జాబ్ మేళాలతో కోటి ఉద్యోగాలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:12 AM
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ కోటి మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో మూడు నెలలకోసారి నిర్వహణ
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
మెప్మా ఆధ్వర్యంలో జాబ్‌మేళా.. 131 మందికి ఉద్యోగాలు
నర్సీపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ కోటి మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. శుక్రవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో నిపుణ సంస్థ సహకారంతో పెదబొడ్డేపల్లి మునిసిపల్ కార్యాలయంలో జాబ్ మేళా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా హాజరైన ఆయన.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ, నర్సీపట్నంలో మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని, నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో ఏర్పాటు కానున్న కాఫీ యూనిట్ 800 మందికి ఉద్యోగాలు వస్తాయని, నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. జాబ్‌మేళాకు 723 మంది హాజరు కాగా 300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 131 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 18 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, కౌన్సిలర్లు చింతకాయల పద్మావతి, రాజేశ్, మెప్మా పీడీ సరోజని, మునిసిపల్ కమిషనర్ జంపా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.