నాడు రోజు కూలీలు.. నేడు ఇంజనీర్లు
ABN , Publish Date - May 07 , 2025 | 12:52 AM
‘తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది’ అన్నచందంగా ఒకప్పుడు దేవాలయాల్లో రోజువారీ కూలీలుగా పనిచేసిన వారంతా ఇప్పుడు ఇంజనీర్లు అయిపోయి నగరంలో కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారు.
తప్పుడు సర్టిఫికెట్లతో కొంతమంది కొలువు
సింహాచలం, కనకమహాలక్ష్మి దేవాలయాల్లో వారిదే హవా
మెజర్‌మెంట్ బుక్‌లో నమోదు చేయకుండా పనులు
సెప్టిక్ ట్యాంకు పనుల్లోను కక్కుర్తి
రూ.కోట్లలో చందనోత్సవం ఖర్చు
ఏ సంవత్సరం కూడా బయటకు వెల్లడించని అధికారులు
లోతుగా దర్యాప్తు చేస్తే వెలుగులోకి మరిన్ని అక్రమాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది’ అన్నచందంగా ఒకప్పుడు దేవాలయాల్లో రోజువారీ కూలీలుగా పనిచేసిన వారంతా ఇప్పుడు ఇంజనీర్లు అయిపోయి నగరంలో కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారు. అందులో కొందరు తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి పదోన్నతులు పొందేసి ఈఈలు, డీఈలుగా వ్యవహరిస్తున్నారు. డ్రాయింగ్ అంటే తెలియకున్నా, రోజువారీ పనులను మెజర్‌మెంట్ బుక్‌లో నమోదు చేయకున్నా వారి ఆటలు సాగిపోతూ వచ్చాయి. సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు మరణించడంతో ఇప్పుడు వారి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
మూడు దశాబ్దాల క్రితం సింహాచలం దేవస్థానంలో ఎన్‌ఎంఆర్ (నామినల్ మస్తర్ రోల్) అంటే ‘రోజువారీ కూలి’ పనిచేసేవారు ఎక్కువ మంది ఉండేవారు. రాజకీయ నాయకుల సిఫారసులతో వారిని పనుల్లోకి తీసుకునేవారు. అలా ఎన్‌ఎంఆర్‌లుగా చేరిన వారిలో కొందరు ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో అధికారులుగా చెలామణి అవుతున్నారు. కనకమహాలక్ష్మి దేవస్థానంలోను ఇలాంటివారు ఉన్నారు. వారిలో కొందరు ఉద్యోగం చేస్తూ ప్రైవేటుగా చదువుకొని ఆ సర్టిఫికెట్లు సమర్పించి ఇంజనీరింగ్ విభాగాల్లో చేరగా, మరికొందరు తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఇంజనీర్లు అయిపోయారు. ట్రాన్స్‌పోర్టు విభాగంలో క్లీనర్‌గా చేరినవారు కూడా ఇంజనీర్లు అయిపోయారు. వారిలో కొందరికి సాంకేతిక పరిజ్ఞానం ఉండగా, మరికొందరికి ఏమీ తెలియదు. ఇంజనీరింగ్ పనులు చేసేటప్పుడు ప్రతి పనిని ఏ రోజు ఎంత పూర్తిచేశారో కొలతలు వేసి మెజర్‌మెంట్ బుక్ (ఎం.బుక్)లో నమోదుచేయాలి. సింహగిరిపై గోడ కూలిన ఘటనకు సంబంధించి విచారణ నిర్వహించిన త్రిసభ్య కమిటీ అక్కడ ఎం.బుక్ నిర్వహించడం లేదని గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ పథకం కింద ఇచ్చిన రూ.54 కోట్లతో చేపట్టిన పనులకు నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తే...ఆ పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకునే ఎం.బుక్‌ను దేవాలయ ఇంజనీరింగ్ అధికారులు నిర్వహించకపోవడం వారి లెక్కలేనితనానికి అద్దం పడుతోంది.
సెప్టిక్ ట్యాంక్ పనుల్లో అవినీతి
ఇటీవల కొండపై కేశ ఖండనశాల వద్ద సెప్టిక్ ట్యాంక్ నిండిపోయి మురుగు బయటకు వస్తుంటే భక్తులు ఫిర్యాదు చేశారు. దాంతో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించాలని ఇన్‌చార్జి ఈఓ సుబ్బారావు ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. వారు సుమారు 15 ట్యాంకర్లతో మురుగును బయటకు తీసి తరలించారు. బిల్లు కోసం 90 ట్యాంకర్ల మురుగు బయటకు తీసి తరలించినట్టు రాశారు. దీనిపై అప్పటికే ఈఓకు కొంత సమాచారం ఉండడంతో బిల్లును నిలిపివేశారు. విచారణ పూర్తయ్యాక ఇస్తామని స్పష్టంచేశారు.
బయటకు రాని చందనోత్సవం వ్యయాలు
సింహగిరిపై ఉత్సవాల సందర్భంగా విద్యుద్దీపాల అలంకరణ ఖర్చుల్లో లక్షలాది రూపాయలు ఇంజనీరింగ్ విభాగం అడ్డగోలుగా మింగేస్తోంది. ఏటా చందనోత్సవాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. దేనికి ఎంత ఖర్చు అయిందో ఒక్క ఏడాది కూడా వెల్లడించలేదు. విలేకరులు అడిగినా ఇంకా తేలలేదు అని చెప్పడమే తప్ప ఎంత అంచనా వ్యయం అనుకున్నారు?,, వాస్తవంగా ఎంత అయింది?, ఆదాయం ఎంత వచ్చింది?...అనే వివరాలు ఒక్క ఏడాదీ చెప్పలేదు. వీటిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే అవకతవకలు మరిన్ని వెలుగులోకి వస్తాయి.