ఉపాధి పాత బిల్లులు విడుదల
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:35 PM
ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనుల బిల్లులను వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిపివేసింది. కొందరు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించగా, మరికొందరు అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. తాజాగా కూటమి ప్రభుత్వం వీరి బకాయిలు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వైసీపీ హయాంలో నిలిపి వేసిన బకాయిలకు మోక్షం
జిల్లాకు రూ.8.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనుల బిల్లులను వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిపివేసింది. కొందరు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించగా, మరికొందరు అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. తాజాగా కూటమి ప్రభుత్వం వీరి బకాయిలు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో సుమారు రూ.15 కోట్ల విలువైన రహదారుల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు చేశారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఈ పనులకు వైసీపీ అధికారంలోకి వచ్చాక బిల్లుల చెల్లింపులు సక్రమంగా జరపలేదు. దీంతో కాంట్రాక్టర్లు బిల్లులు అందక, చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో 20 శాతం మినహాయించుకొని అరకొరగా చెల్లింపులు జరిపారు. కోర్టును ఆశ్రయించని అనేక మంది కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపులకు నోచుకోకుండా ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు ఉపాధి పనుల పెండింగ్ బిల్లుల విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్రం జిల్లాలో 2014-19 మధ్య కాలంలో చెల్లింపులకు నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులకు రూ.8.20 కోట్లు మంజూరు చేసింది. వాస్తవానికి ఈ పనుల వివరాలను గత వైసీపీ ప్రభుత్వం ఉపాధి హామీ ఆన్‌లైన్ పోర్టల్ నుంచి తొలగించింది. దీంతో అన్ని మండలాల్లో పెండింగ్ బకాయిల వివరాలు, కాంట్రాక్టర్ల ఆన్‌లైన్ బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. త్వరలోనే పెండింగ్ బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు డ్వామా, ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లింపునకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని డ్వామీ పీడీ పూర్ణిమాదేవి తెలిపారు. త్వరలోనే బకాయిలు సంబంధిత కాంట్రాక్టర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయన్నారు.