అమ్మో...కశ్మీరా
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:57 AM
పర్యాటక స్వర్గధామం కశ్మీర్ మళ్లీ వెలవెలబోయే పరిస్థితులు వచ్చాయి.
విమాన, రైళ్ల టికెట్లు రద్దు చేసుకుంటున్న పర్యాటకులు
డబ్బు తిరిగి ఇచ్చేందుకు హోటళ్ల యాజమాన్యాల నిరాకరణ
ఏప్రిల్‌లో నగరం నుంచి టికెట్లు బుక్ చేసుకున్నవారు 800 మంది
మే నెలలో 250 మంది...
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పర్యాటక స్వర్గధామం కశ్మీర్ మళ్లీ వెలవెలబోయే పరిస్థితులు వచ్చాయి. నాలుగైదేళ్లుగా అక్కడకు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి వేసవిలో రాష్ట్రం నుంచి సుమారు ఐదు వేల మంది వరకూ కశ్మీర్ వెళ్లి వస్తున్నారు. తాజాగా పహల్గాంలో జరిగిన ఘటనతో ఇప్పుడు కశ్మీర్ అంటేనే అంతా భయకంపితులవుతున్నారు.
పెహల్గాంలో ఉగ్రవాదులు 28 మంది పర్యాటకులను విచక్షణారహితంగా తుపాకులతో కాల్చి చంపడం, అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారూ ఉండడంతో కశ్మీర్ పర్యటనకు వెళ్లడానికి ఇప్పుడు అంతా వెనకడుగు వేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన పది మంది ఈ నెల 18న కశ్మీర్ పర్యటనకు వెళ్లగా, వారిలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ చంద్రమౌళి ఉగ్రవాదుల చేతితో హతమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన తరువాత కశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారంతా అర్ధంతరంగా టూర్ ముగించుకొని వెనక్కి వచ్చేశారు. ఈ వేసవి సెలవుల్లో కశ్మీర్ వెళ్లాలని ముందుగానే విమాన, రైలు టికెట్లు, హోటల్ రూమ్‌లు బుక్ చేసుకున్నవారు ఇప్పుడు వాటిని రద్దు చేసుకుంటున్నారు.
విశాఖపట్నం నుంచి కశ్మీర్ వెళ్లడానికి మూడు మార్గాలను పర్యాటకులు ఎంచుకుంటారు. ఎక్కువ మంది విమానాలను ఆశ్రయిస్తారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీ, అక్కడి నుంచి శ్రీనగర్‌కు చాలామంది వెళుతున్నారు. వీరికి రానుపోను చార్జీల కింద ట్రావెల్ సంస్థలు రూ.40 వేలు వసూలు చేస్తున్నాయి. మరికొంతమంది విశాఖపట్నం నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లిపోయి, అక్కడి నుంచి జమ్మూ వరకు రైలులోను, అక్కడి నుంచి శ్రీనగర్‌కు రహదారి మార్గంలో వెళుతున్నారు. వైష్ణోదేవిని దర్శంచుకోవాలనుకునే వారిలో అత్యధికులు ఈ విధంగా వెళుతున్నారు. ఇంకొందరు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లి అక్కడి నుంచి జమ్మూ-తావి రైలులో నేరుగా జమ్మూకు వెళ్లిపోతున్నారు. అక్కడి నుంచి శ్రీనగర్‌కు విమానంలో వెళుతున్నారు. తిరుగు ప్రయాణంలో శ్రీనగర్ నుంచి ఢిల్లీ వచ్చి, అక్కడి నుంచి రైలులో విశాఖపట్నం వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గత మూడేళ్లుగా ప్రతి వేసవిలో సుమారు ఐదు వేల మంది కశ్మీర్ పర్యటనకు వెళుతున్నారు. 2022 నుంచి పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
100 శాతం వెనక్కి ఇస్తున్న విమాన సంస్థలు
వేసవిలో ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో అంతా కశ్మీర్ వెళుతుంటారు. ఇందుకోసం మూడు నెలల ముందుగానే విమానాలు, రైళ్లలో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. విశాఖపట్నం నుంచి ఈ (ఏప్రిల్) నెలలో ఢిల్లీ మీదుగా శ్రీనగర్ వెళ్లడానికి 800 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వారిలో ఇప్పటికే 500 మంది వెళ్లి వచ్చేశారు. ఇంకో 300 మంది వెళ్లాల్సి ఉంది. ఇప్పుడు వారంతా టికెట్లు రద్దు చేసుకుంటున్నారు. విమాన సంస్థలు 100 శాతం రిఫండ్ ఇస్తున్నాయి. రైళ్లలో కూడా నిబంధనల ప్రకారం టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తున్నారు. వచ్చే నెల మే నెలలో ఇంకో 250 మంది విమానాల్లో వెళ్లాల్సి ఉంది. వారిలో 75 శాతం రద్దు చేసుకోగా, 25 శాతం రద్దు చేసుకోకుండా హోల్డ్ చేసి ఉంచాల్సిందిగా కోరుతున్నారు. పరిస్థితులు ఎలా ఉంటాయో చూసుకొని అప్పుడు రద్దు చేసుకుంటామని చెబుతున్నారు.
హోటల్ యాజమాన్యాల నిరాకరణ
కె.విజయమోహన్, అధ్యక్షులు, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్
విమాన, రైలు టికెట్లను రద్దు చేసుకోగలుగుతున్నారు కానీ అక్కడ శ్రీనగర్‌లో బుక్ చేసుకున్న హోటల్ గదులు మాత్రం క్యాన్సిల్ కావడం లేదు. అక్కడి యాజమాన్యాలు అంగీకరించడం లేదు. ఇప్పటికిప్పుడు రద్దు అంటే తాము ఎవరికి ఇచ్చుకోవాలంటూ వారు రిఫండ్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దాంతో బుకింగ్ అడ్వాన్స్ మొత్తాలు కోల్పోవలసి వస్తోంది. ఉగ్రవాదుల దాడితో కశ్మీర్ పర్యటన అంటేనే భయపడిపోతున్నారు.