బాబోయ్ దోమలు!
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:25 AM
పట్టణంలో మురుగు నీటి కాలువల నిర్వహణ అత్యంతం దారుణంగా వుంది. కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి, ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోతున్నది. కొన్నిచోట్ల కనీసం నెలకు ఒకసారి కూడా కాలువల్లో పూడిక తీయడంలేదు. దీంతో దోమల వృద్ధి కేంద్రాలుగా మారాయి. చీకటిపడితే చాలు ప్రజలపై స్వైరవిహారం చేస్తున్నాయి. పట్టణంలో ప్రధాన రహదారుల నుంచి చిన్నపాటి వీధుల వరకు, ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్నిచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది.

చీకటిపడితే స్వైరవిహారం, జనం ఇక్కట్లు
అనకాపల్లిలో అధ్వానంగా డ్రైనేజీలు
పేరుకుపోయిన పూడిక, చెత్తాచెదారం
వారానికోసారి కూడా శుభ్రం చేయని వైనం
దోమల నిలయాలు మారిన డ్రైనేజీ కాలువలు
పట్టించుకోని జీవీఎంసీ అధికారులు
అనకాపల్లి టౌన్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో మురుగు నీటి కాలువల నిర్వహణ అత్యంతం దారుణంగా వుంది. కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి, ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోతున్నది. కొన్నిచోట్ల కనీసం నెలకు ఒకసారి కూడా కాలువల్లో పూడిక తీయడంలేదు. దీంతో దోమల వృద్ధి కేంద్రాలుగా మారాయి. చీకటిపడితే చాలు ప్రజలపై స్వైరవిహారం చేస్తున్నాయి. పట్టణంలో ప్రధాన రహదారుల నుంచి చిన్నపాటి వీధుల వరకు, ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్నిచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది.
మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అనకాపల్లి పట్టణంలో సుమారు లక్ష మందికిపైగా జనం నివసిస్తున్నారు. పట్టణంలో 23 వేలకుపైగా నివాస గృహాలు వున్నాయి. దాదాపు 20 మురికివాడలు ఉన్నాయి. భౌగోళికంగా ఎత్తుపల్లాలు అధికంగా లేకపోవడంతో వర్షపునీటితోపాటు మురుగునీటి ప్రవాహం మందకొడిగా వుంటుంది. ఇదే పట్టణవాసులకు శాపంగా మారింది. దీనికితోడు జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం వారు సిబ్బంది కొరత కారణంగా పారిశుధ్య పనులను పూర్తిస్థాయిలో నిర్వహించడంలేదు. వీధుల్లో చెత్తాచెదారాన్ని రోజూ తొలగిస్తున్నప్పటికీ, మురుగునీటి కాలువలను శుభ్రం చేయడంలేదు. ఓపెన్ కాలువలు కావడంతో చెత్తాచెదారం.. ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పేరుకుపోతున్నాయి. పారిశుధ్య సిబ్బంది కొరత కారణంగా వారానికి ఒక రోజు కూడా డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో మురుగు నీరు ఎక్కడిక్కడ నిలిచిపోవడం, కాలువలు నిండిపోతే రోడ్లపైకి ప్రవహించడం సర్వసాధారణంగా మారింది. ఈ కారణాల వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పోనీ దోమల నియంత్రణకు మందులు ఏమైనా పిచికారీ చేస్తారా అంటే.. అదీ మొక్కుబడి తంతే! దీంతో దోమల కాటు నుంచి ప్రజలే తమను తాము కాపాడుకోవాల్సి వస్తున్నది. ప్రతి ఇంటిలో ఏదో ఒక పరికరం (ఆల్‌అవుట్ వగైరా) వుండాల్సిందే. లేకపోతే దోమలకాటుకు గురై జ్వరాలబారిన పడక తప్పదు.
కాగా పట్టణంలో మురుగు కాలువలను సరిగా శుభ్రం చేయకపోవడం, దోమలబెడద అధికంగా వుండడంపై జీవీఎంసీ జోనల్ కమిషనర్ బీవీ రమణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తున్నామన్నారు. కాలువలను శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మలేరియా విభాగం ద్వారా డ్రైనేజీ కాలువల్లో యాంటీ లార్వా ఆపరేషన్ జరిపిస్తామని తెలిపారు.