బాబోయ్ కుక్కలు!
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:01 AM
మండలంలోని అన్ని గ్రామాల్లో వీధి కుక్కల సంతతి రోజు రోజుకీ పెరిగిపోతున్నది. దీంతో వీటి బెడద సైతం అధికం అవుతున్నది. ముఖ్యంగా ఏడాది కాలంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతూ, ద్విచక్ర వాహనదారులు, పాదచారులపై దాడి చేస్తున్నారు. దీంతో చిన్న పిల్లలు, పాఠశాలల విద్యార్థులు, వృద్ధులు వీధుల్లోకి రావాలంటే భయపడుతున్నారు. పుస్తకాల బ్యాగులతో స్కూళ్లకు నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థుల వెంటపడి కరుస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.
నానాటికీ అధికమవుతున్న గ్రామ సింహాలు
పాదచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడి
పెరుగుతున్న కుక్కకాటు బాధితులు
ప్రజలు భయాందోళన
సబ్బవరం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామాల్లో వీధి కుక్కల సంతతి రోజు రోజుకీ పెరిగిపోతున్నది. దీంతో వీటి బెడద సైతం అధికం అవుతున్నది. ముఖ్యంగా ఏడాది కాలంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా గుంపులు గుంపులుగా తిరుగుతూ, ద్విచక్ర వాహనదారులు, పాదచారులపై దాడి చేస్తున్నారు. దీంతో చిన్న పిల్లలు, పాఠశాలల విద్యార్థులు, వృద్ధులు వీధుల్లోకి రావాలంటే భయపడుతున్నారు. పుస్తకాల బ్యాగులతో స్కూళ్లకు నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థుల వెంటపడి కరుస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. దీంతో పలువురు తల్లిదండ్రులు ఇంటికి సమీపంలో వున్న పాఠశాలకు సైతం ఆటోలో పంపడం, లేదంటే స్వయంగా విడిచిపెట్టిరావడం చేయాల్సి వస్తున్నది. ద్విచక్రవాహనాల వెంట పరుగులు తీస్తూ, వాహనచోదకులకు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కుక్కల దాడి నుంచి తప్పించుకోవడానికి వేగం పెంచి, ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక పశువుల కల్లాల వద్ద గుంపులుగా సంచరిస్తూ కోళ్లు, లేగ దూడలను చంపేసి ఎంచక్కా తినేస్తున్నాయి.
ఇటీవల అసకపల్లికి చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ద్విచక్ర వాహనంపై లంకెలపాలెం రోడ్డులో విధులకు వెళుతున్నారు. రోడ్డుపై ఒకచోట పెద్ద గొయ్యి ఉండడంతో వాహన వేగాన్ని తగ్గించారు. అంతే రెప్పపాటులో కుక్కల గుంపు వచ్చి దాడి చేసి, కాళ్లపై పలుచోట్ల కరిచాయి. ఇతను అనకాపల్లి ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని, రెండు నెలల నుంచి విధులకు వెళ్లకుండా ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. సబ్బవరంలో స్కూల్ ఆటోపై దాడి చేసి ఒక విద్యార్థిని కరిచాయి. గుల్లేపల్లిలో ద్విచక్రవాహన చోదకుడిపై కుక్కల గుంపు దాడి చేసి గాయపరిచాయి. ఇలా పలు గ్రామాల్లో కుక్కల స్వైర విహారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుక్కకాటు బాధితుల్లో పలువురు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి, విశాఖపట్నం కేజీహెచ్‌కి, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. కాగా మండలంలో కొంతకాలం నుంచి కుక్క కాటు కేసులు పెరుగుతున్నాయని స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ చక్రవర్తి చెబుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.