అమ్మో హోటల్ ఫుడ్!
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:46 AM
‘‘రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్, రొయ్య, చేప వంటకాలు. కుళ్లిపోయిన గుడ్లు. దుర్వాసన వస్తున్న న్యూడిల్స్, వంటలకు వినియోగించే పేస్టులు’’...ఇవీ నగరంలోని అనేక హోటల్స్, రెస్టారెంట్స్‌లో కనిపించిన దృశ్యాలు.
రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాల విక్రయం
నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్స్‌లో దారుణం
ఆహార భద్రత, ప్రమాణాల శాఖ దాడుల్లో గుర్తింపు
మూడు నుంచి ఐదు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలు చూసి అధికారులు షాక్
చికెన్, మటన్, చేపలు, రొయ్యలు అన్నీ అంతే
కొన్నిరకాల పేస్టులు, గ్రేవీలు, కర్రీలు కూడా
హానికారక రంగులు వినియోగం
20 బృందాలతో 40 చోట్ల తనిఖీలు
24 కేసులు నమోదు చేసిన అధికారులు
నేడూ కొనసాగనున్న దాడులు
విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):
‘‘రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్, రొయ్య, చేప వంటకాలు. కుళ్లిపోయిన గుడ్లు. దుర్వాసన వస్తున్న న్యూడిల్స్, వంటలకు వినియోగించే పేస్టులు’’...ఇవీ నగరంలోని అనేక హోటల్స్, రెస్టారెంట్స్‌లో కనిపించిన దృశ్యాలు. పేరుమోసిన హోటల్స్, రెస్టారెంట్స్‌లోనూ ఈ పరిస్థితులు చూసి అధికారులే విస్తుపోయారు.
నగరంలో పలు హోటల్స్, రెస్టారెంట్స్‌లో దారుణ పరిస్థితులు ఉన్నాయని, రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వేడి చేసి వడ్డిస్తున్నారని, ఫలితంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఆకస్మికదాడులు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఆహార భద్రత, ప్రమాణాల శాఖ జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో తూనికలు కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ థామస్ రవికుమార్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లు జీఏబీ నందాజీ, చక్రవర్తి, మరో 40 మంది అధికారులు 20 బృందాలుగా విడిపోయి, నగర పరిధిలోని 40 హోటల్స్, రెస్టారెంట్స్‌లో శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు.
అధికారులే షాక్‌కు గురయ్యేలా...
దాడుల్లో అధికారులు షాక్‌కు గురయ్యే పరిస్థితులు కనిపించాయి. అనేకచోట్ల దుర్వాసన వెదజల్లే ఆహార పదార్థాలనే వేడి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నట్టు గుర్తించారు. తనిఖీలు చేసిన హోటల్స్‌లో రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇసుకతోటలోని మాయ, ముంతాజ్ హోటళ్లలో రోజుల తరబడి నిల్వ ఉన్న చికెన్, మటన్, రొయ్య తదితర పదార్థాలను వినియోగిస్తున్నట్టు తేలింది. జగదాంబ జంక్షన్ సమీపంలోని ఆల్ఫా హోటల్‌లో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాన్ని గుర్తించారు. కొన్నిచోట్ల దుర్వాసన వెదజల్లే పదార్థాలను వేడి చేసి కస్టమర్లకు వడ్డించేందుకు సిద్ధం చేస్తున్నట్టు గుర్తించారు. అనేకచోట్ల అపరిశుభ్ర వాతావరణంలో కిచెన్ నిర్వహిస్తున్న తీరు తనిఖీల్లో బయటపడింది. చికెన్, మటన్, చేపలు, రొయ్యల గ్రేవీలు నాలుగు నుంచి ఐదురోజులపాటు నిల్వ ఉంచినవిగా తేల్చారు. అన్ని హోటల్స్‌లో హానికారక రంగులను వినియోగించడంతోపాటు కొన్నిరకాల పిండిపదార్థాలు, ఆయిల్స్ దారుణంగా ఉన్నట్టు అధికారుల తనిఖీల్లో తేలింది.
పరీక్షల నిమిత్తం నమూనాలు
తనిఖీల్లో గుర్తించిన 42 రకాల ఆహార పదార్థాల నమూనాలు సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. అత్యంత దారుణంగా ఉన్నట్టు నిర్ధారించిన హోటళ్లపై 24 కేసులను నమోదుచేశారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా మిగిలిన వాటిపై చర్యలు తీసుకుంటామని జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు తెలిపారు. తనిఖీలను శనివారం కూడా నిర్వహిస్తామన్నారు. కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్‌లో అనుమతి లేని తూనిక యంత్రాలను వినియోగిస్తున్నట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు.
తనిఖీ చేసిన హోటల్స్ ఇవే...
సనపరా హోటల్ అండ్ రిసార్ట్, బీచ్ రోడ్డులోని ప్యారడైజ్ ఫుడ్‌కోర్ట్, అంబికా సీగ్రీన్, శ్రీకామత్ హోటల్, లాసన్స్‌బే కాలనీలోని పంచభక్ష, ఎంవీపీ కాలనీలోని దేశి విలేజ్ హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్, డైనీ డెస్టినీ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్, ఎండాడలోని కళింగ రెస్టారెంట్, మధురవాడలోని జీషన్ రెస్టారెంట్, జగదాంబ జంక్షన్ సమీపంలోని జీషన్ రెస్టారెంట్, సిరిపురంలోని దక్షిన్ కిచెన్, రుషికొండ సమీపంలోని సంసిద్ధ హాస్పిటాలిటీ, ఎండాడ, వీఐపీ మెయిన్ రోడ్డుల్లోని సోమన రెస్టో కేఫ్, పీఎం పాలెంలోని స్వగ్రామ ఫుడ్ కోర్ట్, క్రికెట్ స్టేడియం దగ్గరలోని జేఎం ఫన్ అండ్ డైన్ ప్రైవేటు లిమిటెడ్, ఎండాడలోని హోటల్ జాస్, పీఎం పాలెంలోని రాజాస్ కిచెన్, పెదవాల్తేరులోని మై రెస్టారెంట్, కృష్ణా కాలేజీ రోడ్డులోని జీషన్ రెస్టారెంట్, నగరంలోని ఈటర్స్ స్టాప్, ప్యారడైజ్, దీపక్ పంజాబీ దాబా, జగదాంబ జంక్షన్ సమీపంలోని హేలాపురి, గవర్నర్ బంగ్లా ఎదురుగా ఉన్న ప్లాట్‌ఫామ్ 65, మద్దిపాలెంలోని అరేబియన్ నైట్స్, లలిత కిచెన్, ఎంవీపీ కాలనీలోని బాలాజీ ఈటర్స్‌స్టాప్, ఇసుకతోటలోని మాయ, ముంతాజ్, ఎన్‌ఏడీ జంక్షన్ సమీపంలోని దాబా సిటీ పంజాబీ, గాజువాకలోని ఆస్వాద్ లంచ్ అండ్ డిన్నర్, బన్నీస్ రెస్టారెంట్, గాజువాకలోని గ్రాండ్ ఆల్ఫా హోటల్, జీషన్ రెస్టారెంట్, రామ్‌నగర్‌లోని బాంబే రెస్టారెంట్, సరస్వతి పార్కు సమీపంలోని అల్కాపూర్ ఫ్యామిలీ రెస్టారెంట్, జగదాంబ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని ఆల్ఫా హోటల్, సిరిపురంలోని ఫ్యూజన్ ఫుడ్స్, ది స్పైసీ వెన్యూ రెస్టారెంట్, స్టోన్ వెల్ఫేర్ బ్రేవర్స్