అభా.. కదలదేంటబ్బా!
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:50 AM
ప్రజల ఆరోగ్య స్థితిగతులను డిజిటల్ విధానంలో నిక్షిప్తం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభా) ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది.
ప్రజారోగ్య సమాచారాన్ని డిజిటల్ విధానంలో నిక్షిప్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం
అభా పేరిట హెల్త్ ఐడీ రూపకల్పన
దేశంలోని ఏ ఆస్పత్రికి వెళ్లినా రోగి ఐడీ నంబరుతో ఆరోగ్య స్థితి తెలుసుకునే అవకాశం
జిల్లాలో మందకొడిగా సాగుతున్న ప్రక్రియ
వివరాలివ్వని గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్‌ల వాసులు
ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కలెక్టర్, డీఎంహెచ్‌వో విజ్ఞప్తి
విశాఖపట్నం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):
ప్రజల ఆరోగ్య స్థితిగతులను డిజిటల్ విధానంలో నిక్షిప్తం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభా) ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. ఆయుష్మాన్ భారత్ ప్రొగ్రామ్‌లో భాగంగా ఆధార్ తరహాలో 14 అంకెల నంబరుతో ఆరోగ్య సమాచారాన్ని అందించేలా డిజిటల్ హెల్త్ ఐడీ విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా రోగి ఆరోగ్య సమాచారం ఆ హెల్త్ అకౌంట్ నుంచి తెలుసుకునేలా దీనిని రూపొందించింది. అయితే ప్రజలకు దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో ఆసక్తి చూపడం లేదు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఇప్పటికే హెల్త్ ఐడీని క్రియేట్ చేశారు. రెండేళ్లుగా ఈ కార్యక్రమం పెద్దఎత్తున సాగుతోంది. జిల్లాలో సుమారు 22 లక్షల మంది ప్రజలకు అభా హెల్త్ అకౌంట్ ఓపెన్ చేసి ఐడీ నంబరు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 18 లక్షల మందికి హెల్త్ ఐడీ నంబర్లను క్రియేట్ చేశారు. మరో 4.15 లక్షల మందికి సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగడంలేదు. రిజిస్ట్రేషన్ చేయించుకోని వారంతా అపార్ట్ మెంట్లు, గ్రూప్‌హౌస్‌ల్లో ఉంటున్న వారే కావడం గమనార్హం. అభా హెల్త్ ఐడీ రిజిస్ర్టేషన్ చేసేందుకు వచ్చే ఆరోగ్య సిబ్బందిని అనుమతించకపోవడంతో ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆయా ప్రాంతాలకు చెందిన ఏఎన్‌ఎం, ఇతర సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అభా ఐడీ యాప్‌లో సదరు వ్యక్తి ఆధార్ నంబరును ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెంటనే అతని ఫోన్ నంబరుకు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ చెబితేనే అభా ఐడీ క్రియేట్ అవుతుంది. ఆ తరువాత హెల్త్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.
ఓటీపీతోనే సమస్య
అయితే అనేక చోట్ల ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం సిబ్బందికి ఓటీపీ చెప్పాల్సి రావడమేనని అధికారులు చెబుతున్నారు. ఓటీపీ చెబితే డబ్బులు పోతాయనే భయంతో ఆరోగ్య సిబ్బందికి చాలామంది సహకరించడంలేదు. కొన్నిచోట్ల గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్ వాసులు సిబ్బందిని లోపలికి వచ్చేందుకు కూడా అనుమతించడంలేదు. ఈ పక్రియ చేపడుతున్న ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని కలెక్టర్ సూచించినా ప్రయోజనం కనిపించడంలేదని అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రజలు ఆలోచించాలని, ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు కోరుతున్నారు. కొన్ని నెలలుగా ప్రక్రియ ముందుకు కదలడం లేదన్నారు. ప్రజలు సహకరిస్తేనే హెల్త్ ఐడీ నమోదు ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
ఐడీ నంబరుతో ఎంతో మేలు
అభా ఐడీతో కూడిన హెల్త్‌కార్డులు పొందడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఈ నంబరు కలిగి ఉంటే దేశంలోని ఏ ఆస్పత్రికి వెళ్లినా రోగికి సంబంధించిన రిపోర్టులు, ఇతర వివరాలు తమ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ వివరాలన్నింటినీ డిజిటల్ పద్ధతిలో ఈ అకౌంట్‌లో స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దేశంలోని ఏ ఆస్పత్రికి వెళ్లినా నంబరు నమోదు చేయగానే రోగికి సంబంధించిన ఆరోగ్య చరిత్ర డిస్‌ప్లే అవుతుంది. వెంటనే వైద్యులు తదుపరి పరీక్షలు, ఇతర వైద్య సేవలను అందించేందుకు వీలుంటుంది. పేపర్‌లెస్ వైద్య విధానాన్ని అందించేందుకు హెల్త్ ఐడీ దోహదపడుతుదని అధికారులు వివరిస్తున్నారు.
నిధులు వెనక్కి
మనబడి- మన భవిష్యత్తు అగమ్యగోచరం
పాఠశాలల్లో అసంపూర్తిగా మిగిలిన పనులు
ఈ విద్యా సంవత్సరంలో పూర్తయ్యేనా!
మంత్రి లోకేశ్ చొరవ చూపాలని పాఠశాల అభివృద్ధి కమిటీల విజ్ఞప్తి
విశాఖపట్నం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):
అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా చేపట్టిన పనుల పూర్తికి అవసరమైన నిధుల కేటాయింపులో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యలో నిలిచిన పనులకు ఇటీవల పాఠశాల విద్యాశాఖ కేటాయించిన నిధులు సుమారు రూ.13 కోట్లు తిరిగి వెనక్కి తీసుకోవడంతో పాఠశాల అభివృద్ధి కమిటీలు నిరాశకు గురయ్యాయి.
గత ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింద జిల్లాలోని రెండో దశ 309 పాఠశాలల్లో రూ.114 కోట్లతో చేపట్టిన పనులు 2023 మధ్యలోనే నిలిచిపోయాయి. ఇందుకోసం రూ.48 కోట్ల వరకు నిధులు ఖర్చు చేయగా, మరో రూ.40 కోట్ల విలువైన మెటీరియల్... అంటే ఇనుము, సిమెంటు, ఇసుక, తలుపులు, కిటికీలు వంటి వాటిని సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ నుంచి సరఫరా చేశారు. మరో రూ.30 కోట్లు అవసరమని అప్పట్లోనే గుర్తించారు. నాడు-నేడు తొలిదశ పనులకు చకాచకా నిధులు కేటాయించిన అప్పటి ప్రభుత్వం, రెండో దశపై పూర్తి నిర్లక్ష్యాన్ని చూపింది. దీనివల్ల చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయాయి. ఇతరత్రా వసతులు కూడా అందుబాటులోకి రాలేదు. లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, ప్రహరీల పనులు సగంలోనే ఆగిపోయాయి. కొన్నిచోట్ల అదనపు గదుల నిర్మాణాలు పూర్తైనా వాటికి తలుపులు, కిటికీలను ఏర్పాటు చేయలేదు. భవనాలకు రంగులు వేయలేదు. ఈలోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకానికి ‘మన బడి-మన భవిష్యతు’గా పేరు మార్చి పనుల పూర్తికి నిధులు కోరడంతో జిల్లాకు రూ.30 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ నిధులతో పాటు మెటీరియల్ సరఫరా చేయాలని కోరారు. మరోపక్క అసంపూర్తి పనులు చేపట్టాలని పాఠశాల అభివృద్ధి కమిటీలు జిల్లా విద్యాశాఖను ఏడాదిగా కోరుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా తొలివిడత రూ.13 కోట్లు మంజూరు చేశారు. ఆ తరువాత ఉన్నతాఽధికారుల ఆదేశాలలో వచ్చిన నిధులను వెనక్కి పంపించేశారు.
జిల్లాలో విద్యార్థులు ఎక్కువగా ఉండి అరకొర వసతులు ఉన్న చంద్రంపాలెం, తోటగరువు, సునీల్‌శర్మ కాలనీ ఉన్నత పాఠశాలల్లో ఇబ్బందులు నెలకొన్నాయి. ఇప్పటికే స్లాబులు వేసి తలుపులు, కిటికీలు బిగించడం, సున్నాలు వేసి విద్యుత్ సరఫరాకు వీలుగా నిధులిస్తే పలు పాఠశాలల్లో అదనపు గదులు అందుబాటులోకి వస్తాయని పాఠశాల అభివృద్ధి కమిటీలు కోరుతున్నాయి. దీనిపై మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.