అందరి భాగస్వామ్యంతో యోగా
ABN , Publish Date - May 27 , 2025 | 12:35 AM
యోగా సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. యో
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
ప్రతి మండలంలో 20 వేల మంది పాల్గొనాలని సూచన
పాడేరు, మే 26(ఆంధ్రజ్యోతి): యోగా సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. యోగాంధ్ర- 2025పై జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రతి మండలం నుంచి 20 వేల మంది భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల 32 వేల మంది భాగస్వామ్యం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని, ఇప్పటికీ కేవలం 36 వేల మంది మాత్రమే నమోదయ్యారన్నారు. 3,168 మంది మాస్టర్ ట్రైనర్లను సమకూర్చుతున్నామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఎంపిక చేసిన నాలుగు రోజులు యోగా సాధన చేయిస్తామని, ఈ నెల 26 నుంచి 30 వరకు గ్రామ, జూన్ 2 నుంచి 87 వరకు మండల, జూన్ 9 నుంచి 14 తేదీ వరకు జిల్లా స్థాయిలో యోగా పోటీలను నిర్వహిస్తామన్నారు. అలాగే జూన్ 16 నుంచి 18 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలుంటాయన్నారు.
నేడు పాడేరులో యోగాంధ్ర- 2025 భారీ ర్యాలీ
పాడేరులో యోగాంధ్ర- 2025లో భాగంగా మంగళవారం భారీ ర్యాలీ నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ తెలిపారు. మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఐటీడీఏ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని, అక్కడి నుంచి సినిమాహాల్ సెంటర్ మీదుగా అంబేడ్కర్ సెంటర్‌లో ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు ఎంజే.అభిషేక్‌గౌడ, కె.సింహాచలం, అపూర్వభరత్, యోగా నోడల్ అధికారి, సమగ్ర శిక్షా ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్.లోకేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నంద్, జిల్లా సెరీకల్చర్ అధికారి అప్పారావు, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, డ్వామా పీడీ విద్యాసాగరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మజీరావు, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌రావు, జిల్లాలోని 22 మండలాలకు చెందిన ఎంపీడీవోలు పాల్గొన్నారు.