Share News

అధికారులు విధిగా సమయపాలన పాటించాలి

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:24 PM

అధికారులు విధిగా సమయ పాలన పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు.

అధికారులు విధిగా సమయపాలన పాటించాలి
మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన ఐటీడీఏ పీవో శ్రీపూజ

జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశం

పీజీఆర్‌ఎస్‌లో 134 వినతుల స్వీకరణ

పాడేరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అధికారులు విధిగా సమయ పాలన పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అధికారులు కార్యాలయాలతో పాటు మీకోసం కార్యక్రమానికి సైతం సమయపాలన పాటించాలన్నారు. అలాగే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఈ ఏడాది టెన్త్‌లో చక్కని ఫలితాలు సాధించేందుకు డీఈవో, టీడబ్ల్యూ డీడీ సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, సబ్‌కలెక్టర్‌ శార్యమన్‌పటేల్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎంవీఎస్‌.లోకేశ్వరరావులతో కలిసి ప్రజల నుంచి 134 వినతులను స్వీకరించారు. తమ గ్రామానికి తారురోడ్డు, చెక్‌డ్యామ్‌ నిర్మించాలని జీకేవీధి మండలాలనికి చెందిన గూణలంక గ్రామవాసి బోనంగి నరసింహపడాల్‌ కోరగా, పాడేరు మండలం డి.గొందూరు పంచాయతీ కరకపుట్టు గ్రామానికి తాగునీటి సదుపాయాం కల్పించాలని పలువురు కోరారు. చింతపల్లి మండలం పెదబరడ పంచాయతీ పరిధి వంగసార, పెద్దగెడ్డ ప్రాంతాలకు రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరగా, అరకులోయ మండలం బస్కి గ్రామానికి చెందిన శెట్టి రామరాజు, తను సికిల్‌ సెల్‌ ఎనీమియాతో బాధపడుతున్నానని మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

1100 మీకోసం కాల్‌ సెంటర్‌ సేవలు సద్వినియోగం

మీకోసంలో అర్జీదారులు దాఖలు చేసిన వ్యక్తులు తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు ఫోన్‌ చేసి సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ సూచించారు. అర్జీలకు సంబంధించిన ఎండార్స్‌మెంటును అర్జీదారులకు రిజిస్టర్‌ పోస్టులో పంపిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్‌ , గ్రామ సచివాలయాల నోడల్‌ అధికారి పీఎస్‌.కుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీబాయి, జాతీయ రహదారుల డిప్యూటీ తహశీల్దార్‌ వి.ధర్మరాజు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నందు, జిల్లా ఖజానాధికారి ప్రసాద్‌బాబు, ఎస్‌టీవో కృపారావు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 11:24 PM