కలగా నైట్ ఎక్స్‌ప్రెస్
ABN , Publish Date - Jun 26 , 2025 | 01:23 AM
విశాఖపట్నం ఆర్థిక రాజధాని. విజయవాడ రాష్ట్ర రాజధాని. ఇక్కడి నుంచి విజయవాడ కు రైలులో ఆరు గంటల ప్రయాణం. అయితే అత్యవసరంగా విజయవాడ వెళ్లాల్సి వస్తే ఏ రైలులోనూ కనీసం సీటు దొరికే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పక్కనే ఉన్న మరో నగరానికి వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేనప్పుడు ఎందుకీ ఈ రైల్వే జోన్లు...డివిజన్లు?
విజయవాడకు రాత్రి పూట
రైలు నడపాలని
40 ఏళ్లుగా అడుగుతున్నా
పట్టని అధికారులు
అడ్డుకుంటున్న ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు?
రైల్వేలో లాబీయింగ్ చేస్తున్నారనే అపోహలు
ఇప్పుడు విశాఖ కేంద్రంగా జోన్ కూడా
ఏర్పాటవుతున్నందున రెండు నగరాల మధ్య
ట్రైన్‌ను నడపాలని ప్రయాణికుల డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం ఆర్థిక రాజధాని. విజయవాడ రాష్ట్ర రాజధాని. ఇక్కడి నుంచి విజయవాడ కు రైలులో ఆరు గంటల ప్రయాణం. అయితే అత్యవసరంగా విజయవాడ వెళ్లాల్సి వస్తే ఏ రైలులోనూ కనీసం సీటు దొరికే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పక్కనే ఉన్న మరో నగరానికి వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేనప్పుడు ఎందుకీ ఈ రైల్వే జోన్లు...డివిజన్లు?
విశాఖలో రాత్రి ఎక్కి...ఉదయం విజయవాడలో దిగేలా ఒక నైట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వేయాలని నలభై ఏళ్లుగా విశాఖపట్నం ఎంపీలు కోరుతుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు పట్టించుకోలేదు. రాత్రి పూట విశాఖ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లు బోలెడు ఉన్నాయంటూ ఓ జాబితా చూపిస్తున్నారు. ఫలక్‌నుమా, పూరీ-తిరుపతి, హౌరా ఎక్స్‌ప్రెస్, కోణార్క్...ఇవన్నీ రాత్రి పూటే విశాఖలో బయలుదేరతాయని, మరుసటిరోజు ఉదయానికి విజయవాడ చేరతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే వాటిలో విశాఖపట్నానికి కేటాయించే బెర్తులు తక్కువ. రాత్రి ప్రయాణం కాబట్టి తప్పనిసరిగా బెర్త్ అవసరం. కానీ డిమాండ్‌కు తగిన సంఖ్యలో బెర్తులు లేకపోవడం వల్ల వాటిలో విజయవాడ వెళ్లే అవకాశం దక్కడం లేదు. అది కూడా నెల రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటేనే వాటిలో బెర్తు లభిస్తుంది. విజయవాడ వెళ్లడానికి కూడా నెల రోజుల ముందు ప్రణాళిక ఉంటే తప్ప రైలులో సీటు దొరకని దుస్థితి.
విశాఖ నుంచి నేరుగా విజయవాడకు నైట్ ఎక్స్‌ప్రెస్ ఇక్కడ రాత్రి 10-11 గంటల మధ్య బయలుదేరి తెల్లవారుజామున విజయవాడ చేరేలా నడిపితే ఉత్తరాంధ్ర వాసులందరికీ ఉపయోగపడుతుంది. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఉదయం ఆరు గంటల నుంచే కనెక్టింగ్ రైళ్లు అనేకం ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, తిరుపతి, బెంగళూరు ఇలా...ఎక్కడికైనా అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. అదేవిధంగా రాజధాని పనులపై వెళ్లేవారు కూడా వేగంగా వాటిని ముగించుకొని రాత్రికి మళ్లీ అదే రైలులో అటు నుంచి బయలుదేరి విశాఖపట్నం వచ్చేయవచ్చు. ఇటు నుంచి ఒక రైలు వేసి, రాత్రికి మళ్లీ అదే రైలును అటు నుంచి నడపడానికి రైల్వే అధికారులకు కలిగే ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదు. విజయవాడ నుంచి విశాఖపట్నం రాత్రి పూట రావాలన్నా అదే సమస్య. గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా వంటివి పట్టుకొని రావాలి. వాటిలో కూడా విజయవాడకు ఎక్కువ బెర్తులు ఉండవు. ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే తప్ప అవి కూడా దొరకవు. అందుకని వెంటనే రెండు నగరాల మధ్య ఇంటర్ సిటీ నైట్ ఎక్స్‌ప్రెస్ ఒకటి ప్రారంభించాల్సి ఉంది.
ప్రైవేటు ట్రావెల్స్‌తో కలిసి లాబీయింగ్
ఉత్తరాంధ్ర నుంచి విజయవాడకు రోజుకు 200 బస్సులు వెళుతున్నాయి. అందులో ఒక్క విశాఖపట్నం నుంచే ఆర్‌టీసీ 42 బస్సులు నడుపుతోంది. మిగిలిన 160 బస్సులు ప్రైవేటు ట్రావెల్స్‌వి. ఆర్టీసీలో బస్సు చార్జీ అత్యధికంగా రూ.920. అదే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అయితే కనీస చార్జి వేయి రూపాయలు, బస్సు బయలుదేరే టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ అది పెరుగుతుంది. అలా రూ.1,500 నుంచి రూ.1,600 వరకూ వసూలు చేస్తారు. పండగ సీజన్లలో అయితే రూ.2 వేలు. ఈ ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలకు, రైల్వేలో కొందరు అధికారులకు మధ్య లాబీయింగ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే విశాఖ-విజయవాడ మధ్య నైట్ ఎక్స్‌ప్రెస్ వేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రాత్రిపూట నడిస్తే ట్రావెల్స్‌కు డిమాండ్ ఉండదు. అందుకని వారు రైల్వే అధికారులను మచ్చిక చేసుకొని కొత్త రైళ్లు రాకుండా చేస్తున్నారని రైల్వే వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ప్రత్యేకంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, దానికి జీఎం కూడా నియమితులైనందున వీలైనంత త్వరగా రెండు నగరాల మధ్య ఇంటర్ సిటీ నైట్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాల్సిన అవసరం ఉంది.