ఘాట్‌లో ప్రమాదభరితంగా ఓఎఫ్‌సీ గోతులు
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:23 PM
పాడేరు ఘాట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు తవ్విన గోతులు పూర్తిగా పూడ్చకపోవడంతో ప్రమాదభరితంగా మారాయి. దీంతో ఘాట్‌లో నిత్యం ఏదో చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఘాట్ మార్గంలో రాకపోకలకు సాగించేందుకు ప్రయాణికులు, డ్రైవర్లు భయపడుతున్నారు.

ఆప్టికల్ కేబుల్ గోతులు సరిగా పూడ్చక అవస్థలు
రాకపోకలు ఇబ్బంది పడుతున్న వాహనచోదకులు
గాతలు సక్రమంగా పూడ్చాలని ప్రయాణికులు, డ్రైవర్లు డిమాండ్
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పాడేరు ఘాట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేసేందుకు తవ్విన గోతులు పూర్తిగా పూడ్చకపోవడంతో ప్రమాదభరితంగా మారాయి. దీంతో ఘాట్‌లో నిత్యం ఏదో చోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఘాట్ మార్గంలో రాకపోకలకు సాగించేందుకు ప్రయాణికులు, డ్రైవర్లు భయపడుతున్నారు. ఏజెన్సీలోని బీఎస్‌ఎన్‌ఎల్ సేవలను విస్తరించడంలో భాగంగా మైదాన ప్రాంతం నుంచి పాడేరుకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఘాట్ రోడ్డుకు ఒక వైపు గాతలు తవ్వి దానిలో కేబుల్ వేస్తున్నారు. అయితే కేబుల్ వేసిన తర్వాత ఆయా గాతలను సక్రమంగా పూడ్చడం లేదు. గాతలకు పైపైనే మట్టి వేసి వదిలేస్తున్నారు. తరచూ వర్షాలు కురుస్తుండడంతో ఆ మట్టి మరింత కుంగిపోతున్నది. ఈక్రమంలో ఘాట్‌లో రాకపోకలు సాగించే క్రమంలో ఎదురుగా వచ్చే వాహనానికి దారిచ్చే క్రమంలో ఏదో ఒక వాహనం ఆగాతలో దిగబడిపోతున్నాయి. శనివారం మైదాన ప్రాంతం నుంచి పాడేరు వస్తున్న ఓ వ్యాన్ ఆగాతలో కూరుకుపోయి ఒరిగింది. అదే మరింతగా ఒరిగితే పక్కకు బోల్తా కొట్టేదని డ్రైవర్లు అంటున్నారు. ఇదో సమస్య కాగా గాతలు పూడ్చేమట్టిని సైతం రోడ్డునే వదిలేయడంతో రోజూ వర్షం కురుస్తుండడంతో రోడ్డు బురదమయమై వాహనాలు జారిపోయి పక్కన గాతల్లోకి వెళుతున్నాయని పలువురు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎదురెదురుగా వచ్చే లారీలు, బస్సులు తప్పుకోవడం సైతం కష్టతరంగా మారింతని ప్రయాణికులు తెలిపారు. వాస్తవానికి కేబుల్ కోసం తవ్విన గాతలను పూర్తి స్థాయిలో పూడ్చితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, కాంట్రాక్టర్ ఆయా గాతలను సక్రమంగా పూడ్చకపోవడంతోపాటు మట్టి రోడ్డుపైకి రావడంతో వాహనాలు ప్రమాదాలకు గురువుతున్నాయని డ్రైవర్లు అంటున్నారు. అధికారులు స్పందించి ఘాట్ మార్గంలో కేబుల్ గాతలను పటిష్టంగా పూడ్చి రాకపోకలకు ఇబ్బందులు తొలగించాలని డ్రైవర్లు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.