ఒడిశా సీఎం పాడేరు రాక రేపు
ABN , Publish Date - Nov 15 , 2025 | 01:20 AM
పాడేరు పట్టణంలోని చింతలవీధిలో స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండ విగ్రహ ప్రారంభోత్సవానికి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈ నెల 16వ తేదీన ఇక్కడకు రానున్న నేపథ్యంలో పటిష్ఠ పోలీసు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎస్పీ అమిత్‌బర్దార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బిర్సా ముండా విగ్రహావిష్కరణ అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు.
చింతలవీధిలో స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోహన్ చరణ్ మాఝీ
జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ
పోలీసులు అసాధారణ బందోబస్తు
ముమ్మరంగా వాహనాల తనిఖీ
పాడేరు/ రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పాడేరు పట్టణంలోని చింతలవీధిలో స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండ విగ్రహ ప్రారంభోత్సవానికి ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈ నెల 16వ తేదీన ఇక్కడకు రానున్న నేపథ్యంలో పటిష్ఠ పోలీసు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎస్పీ అమిత్‌బర్దార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బిర్సా ముండా విగ్రహావిష్కరణ అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ ఇతర పోలీసు అధికారులతో కలిసి చింతలవీధిలో విగ్రహావిష్కరణ ప్రాంతంతోపాటు జూనియర్ కళాశాల ప్రాంగణంలో సభ జరగనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు అందించారు. విగ్రహావిష్కరణ ప్రాంతం, సభా ప్రాంగణం, వీవీఐపీలు ప్రయాణించే మార్గంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఒడిశా సీఎం పర్యటన నేపథ్యంలో రక్షణ చర్యల్లో భాగంగా స్పెషల్ పోలీసు బలగాలను మోహరించారు. వాహనాల తనిఖీని ముమ్మరం చేశారరు. సీఎం పర్యటించే ప్రదేశాల్లో 24/7 డ్రోన్స్‌తో నిఘా ఏర్పాటు చేశారు. కాగా ఎస్పీ అమిత్‌బర్దార్ ఆదేశాలతో డీఎస్పీ షహబాజ్ అహ్మద్ నేతృత్వంతో సీఐ డి.దీనబంధు, ఎస్‌ఐ సురేశ్, ప్రత్యేక బృందాలు గత మూడు రోజుల నుంచి పాడేరు, పరిసర ప్రాంతాల్లో వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. పాడేరు పట్టణంలోకి వచ్చే అన్ని వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
నేడు పాడేరులో కొన్ని విద్యాలయాలకు సెలవు
ఈ నెల 15న బిర్సాముండ జయంతి ఉత్సవాలు, 16న ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పర్యటన నేపథ్యంలో శనివారం పాడేరులోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, సెయింట్ ఆన్స్ స్కూల్, నక్కలపుట్టులోని యూపీ స్కూల్, శ్రీకృష్ణాపురం, లోచలిపుట్టు ఆశ్రమ పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్టు కలెక్టర్ దినేశ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.