Share News

నేడు ఒడిశా ముఖ్యమంత్రి పాడేరు రాక

ABN , Publish Date - Nov 15 , 2025 | 10:55 PM

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ ఆదివారం పాడేరు వస్తున్నారు. ఆదివాసీ యోధుడు బిర్సాముండా 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు.

నేడు ఒడిశా ముఖ్యమంత్రి పాడేరు రాక
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

బిర్సాముండా విగ్రహావిష్కరణ

ఘాట్‌లో భారీ వాహనాల రాకపోకలు నిషేధం : ఎస్‌పీ

పాడేరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):

ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ ఆదివారం పాడేరు వస్తున్నారు. ఆదివాసీ యోధుడు బిర్సాముండా 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో గిరిజనులతో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. బిర్సాముండా 150 జయంతి ఉత్సవాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఈనెల 1 నుంచి 15 తేదీ వరకు వాడవాడలా నిర్వహించాయి. ఈ సందర్భంగా గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జయంతి ఉత్సవాల సందర్భంగా బిర్సాముండా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే బిర్సాముండా గిరిజనుల కోసం చేసిన త్యాగాలు, ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడిన వీరగాధలను గిరిజనులకు తెలియజేయాలనే ఆలోచనతో ఇక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ ముఖ్యఅతిథిగా ఈ బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌.మాధవ్‌, ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మంత్రులు వై.సత్యకుమార్‌ యాదవ్‌, కందుల దుర్గేశ్‌ హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొనే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ శనివారం సాయంత్రం పరిశీలించారు. బహిరంగ సభ కోసం నిర్మించిన టెంట్‌, ప్రముఖుల రాకపోకలు, జనాల నియంత్రణ, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. అలాగే ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. డ్రోన్‌ కెమెరాలతో నిఘాతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈసందర్భంగా అధికారులకు జిల్లా కలెక్టర్‌ దిశనేకుమార్‌ పలు సూచనలు చేశారు.

ఘాట్‌లో భారీ వాహనాల రాకపోకలు నిషేధం: ఎస్‌పీ

ఒడిశా సీఎం మోహన్‌చరణ్‌ పాడేరులో బహిరంగ సభ నేపథ్యంలో ఆదివారం ఘాట్‌ మార్గలో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నామని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ తెలిపారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎటువంటి భారీ వాహనాలను ఘాట్‌ మార్గంలో రాకపోకలకు అనుమతించమన్నారు. అలాగే బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించే చింతలవీధి ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్‌పీ అమిత్‌బర్దార్‌ పేర్కొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 10:55 PM