నగరంపాలెంలో చెరువు కబ్జా!
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:31 AM
మధురవాడ సమీపాన నగరంపాలెంలో ఉన్న చెరువును కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారు.
గతంలోనే కొంత మేర ఆక్రమణ
కల్యాణ మండపం నిర్మిస్తామంటూ
ఇప్పుడు పూర్తిగా పూడ్చివేస్తున్న వైనం
చోద్యం చూస్తున్న యంత్రాంగం
విశాఖపట్నం/మధురవాడ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):
మధురవాడ సమీపాన నగరంపాలెంలో ఉన్న చెరువును కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారు. కల్యాణ మండపం నిర్మిస్తామంటూ చెరువును పూడ్చేస్తున్నారు. నగరంపాలెంలో భూలోకమాత గుడి ఎదురుగా, 61,62 సచివాలయాలకు ఆనుకుని సర్వే నంబరు 65/10లో ప్రభుత్వానికి చెందిన చెరువు సుమారు 2.9 ఎకరాలు ఉంది. ఒకప్పుడు ఆ చెరువు కింద వ్యవసాయం చేసేవారు. అయితే వ్యవసాయ భూముల్లో కాలనీలు వచ్చేశాయి. దీంతో కొందరు కబ్జాదారులు చెరువులో నిర్మాణ వ్యర్థాలు డంపింగ్ చేసి సుమారు ఎకరా వరకూ ఆక్రమించుకున్నారు. అక్కడ గత ఏడాది బడ్డీలు ఏర్పాటుచేయగా కొందరు స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు వాటిని తొలగించారు. జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేస్తే కబ్జాదారులు కొంత వరకూ ఆగేవారు. కానీ చెరువు ఎందుకు పనికిరాదని అధికారులు భావించారేమో దాని రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కూటమి పార్టీలకు చెందిన నేతల అండదండలతో కబ్జాదారులు చెరువులో కల్యాణ మండపం నిర్మిస్తామని కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. చెరువులో కల్యాణ మండపం నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తారు?...అన్నది పట్టించుకోకుండా ఇటీవల రాత్రిపూట చెరువును పూర్తిగా పూడ్చే పనిచేస్తున్నారు. ఇప్పటికే మధురవాడ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వర్షాకాలంలోనే బోర్లు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పెంచేందుకు దోహదం చేసే చెరువులు కబ్జాకు గురవుతున్నా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం గమనార్హం. దీనిపై మధురవాడ రెవెళ్లపాలేనికి చెందిన సంతోష్‌కుమార్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి చెరువును కాపాడాలని కోరారు.