దర్జాగా పంచాయతీ స్థలం కబ్జా
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:18 PM
స్థానిక రాజుగారిబీడులో పంచాయతీకి చెందిన స్థలం ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ స్థలం చుట్టూ ఆక్రమణదారులు ప్రహరీ గోడ కడుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రహరీ గోడ నిర్మించిన ఆక్రమణదారులు
చర్యలు తీసుకోని అధికారులు
పాయకరావుపేట, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక రాజుగారిబీడులో పంచాయతీకి చెందిన స్థలం ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ స్థలం చుట్టూ ఆక్రమణదారులు ప్రహరీ గోడ కడుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాయకరావుపేట పంచాయతీలోని రాజుగారిబీడులో 1984లో సర్వే నంబర్లు 175, 176లోని సుమారు నాలుగున్నర ఎకరాల్లో కొందరు లేఅవుట్ వేశారు. ఈ లేఅవుట్‌లో ప్రజోపయోగం కోసం కేటాయించిన స్థలాన్ని 15 రోజుల్లో పంచాయతీకి పట్టా రాసి ఇచ్చేందుకు నిర్ణయించి అప్పట్లో పంచాయతీ నుంచి అనుమతి పొందారు. ఆ తరువాత ఈ విషయాన్ని పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ స్థలం ఆక్రమణకు గురైంది. దీంతో పంచాయతీ అధికారులు ఆక్రమణదారులపై ఎలమంచిలి కోర్టులో కేసు వేయడంతో 2019లో పంచాయతీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పటి నుంచి రాజుగారిబీడులో కోర్టు ద్వారా సాధించిన కమ్యూనిటీ స్థలం పంచాయతీ ఆధీనంలో ఉందని చెబుతున్నారే తప్ప కనీసం పట్టించుకోలేదు. దీంతో సుమారు రూ.1.5 కోట్ల విలువైన ఈ స్థలం చుట్టూ ప్రస్తుతం ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతోంది. విషయం తెలుసుకున్న పంచాయతీ సిబ్బంది వెళ్లి పనులు ఆపాలని తెలియజేసినా ఆక్రమణదారులు పట్టించుకోలేదు. కాగా ఉన్నతాధికారులు స్పందించి ఈ స్థలం కబ్జాకు గురికాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. దీనిపై డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ ఇన్‌చార్జి ఈవో కె.డేవిడ్‌ను వివరణ కోరగా, రాజుగారిబీడులో కమ్యూనిటీ స్థలంగా గుర్తించిన స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించిన వారికి నోటీసు ఇస్తున్నామని తెలిపారు.