Share News

ఉపాధి శ్రామికులకు అరకొర చెల్లింపులు

ABN , Publish Date - May 16 , 2025 | 12:43 AM

ఉపాధి హామీ పథకం కింద వివిధ రకాల పనులు చేస్తున్న శ్రామికులకు అరకొరగానే చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి రెండో వారం నుంచి మార్చి రెండో వారం వరకు వేతనాల చెల్లింపులు జరగ్గా.. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు కూలి డబ్బులు అందలేదు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధి శ్రామికులకు సుమారు రూ.51 కోట్లు అందాల్సి వుందని అధికారులు చెబుతున్నారు.

ఉపాధి శ్రామికులకు  అరకొర చెల్లింపులు
చెరువు గట్టు ఏర్పాటు పనుల్లో ఉపాధి శ్రామికులు

జనవరి నుంచి మార్చి రెండో వారం వరకే అందిన వేతనాలు

అప్పటి నుంచి ఇంతవరకు రూ.51 కోట్లు బకాయిలు

ఇతర పనులు లేకుపోవడంతో ‘ఉపాధి’ కూలి డబ్బులే ఆధారం

సత్వరమే నిధులు విడుదల చేయాలని వినతి

చోడవరం, మే 15 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం కింద వివిధ రకాల పనులు చేస్తున్న శ్రామికులకు అరకొరగానే చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి రెండో వారం నుంచి మార్చి రెండో వారం వరకు వేతనాల చెల్లింపులు జరగ్గా.. ఆ తరువాత నుంచి ఇప్పటి వరకు కూలి డబ్బులు అందలేదు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధి శ్రామికులకు సుమారు రూ.51 కోట్లు అందాల్సి వుందని అధికారులు చెబుతున్నారు.

ఉపాధి హామీ పథకం కింద మట్టి పనులు ఈ ఏడాది జనవరి 11వ తేదీ నుంచి మొదలుపెట్టగా, ఏప్రిల్‌ రెండో వారం వరకు ఒక్క రోజు కూలి కూడా శ్రామికులకు అందలేదు. దీంతో బకాయిల కోసం తరచూ ఆందోళనలు చేస్తున్నారు. పని ప్రదేశంలో వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రాష్ట్రానికి రూ.912 కోట్లు విడుదల చేయడతోజనవరి నుంచి అప్పటి వరకు చేసిన పనులకు కూలి డబ్బులు అందుతాయని శ్రామికులు భావించారు. అయితే కొన్ని మండలాల్లో మార్చి నెలాఖరు వరకు మాత్రమే కూలి డబ్బులు జమ కాగా, మరికొన్ని మండలాల్లో మార్చి రెండో వారం వరకే వచ్చినట్టు చెబుతున్నారు. మొత్తం మీద రూ.25-30 కోట్లు విడుదల అయినట్టు తెలిసింది. వాస్తవానికి ఏప్రిల్‌ రెండో వారం వరకు వేతనాలు క్లియర్‌ అవుతాయని శ్రామికులు భావించారు. కానీ మార్చి రెండో వారం వరకే అందడంతో అప్పటి వరకు ఇల్లు గడవడానికి చేసిన అప్పులకు డబ్బులు సరిపోయాయని, మళ్లీ సరకుల కోసం అప్పులు చేయాల్సి వస్తున్నదని, లేదంటే కిరాణా షాపుల్లో అరువుపై సరకులు తీసుకోవాల్సి వస్తున్నదని శ్రామికులు వాపోతున్నారు.

ప్రస్తుతం మే నెల రెండో వారం కూడా ముగిసింది. ఉపాధి శ్రామికులకు రెండు నెలలకుపైగా కూలి డబ్బులు అందాల్సి ఉంది. జనవరి నుంచి మార్చి వరకు పొలాల్లో పనులు వుండడంతో ఉపాధి పనులకు అంతంతమాత్రంగానే హాజరు వుండేది. ఏప్రిల్‌ నుంచి శ్రామికుల హాజరు బాగా పెరిగింది. దీంతో పెండింగ్‌ వేతనాలు రూ.50 కోట్లకుపైబడి వున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వేరే పనులు కూడా లేవని, ఉపాధి పనులే ఆధారమైనందున త్వరగా నిధులు విడుదల అయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఉపాధి శ్రామికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉపాధి సిబ్బంది వేతనాలు సైతం..

ఉపాధి హామీ పథకం పనులు చేయించే సిబ్బందికి, అధికారులకు కూడా వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకే వేతనాలు అందినట్టు చెబుతున్నారు. మే నెలలో రెండు వారాలు పూర్తయినప్పటికీ ఏపీవోలు, ఫీల్డు అసిస్టెంట్లు ఇతర కార్యాలయ సిబ్బందికి ఇంకా వేతనాలు జమకాలేదు. కాగా ఉపాధి శ్రామికుల వేతన బకాయిలపై డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ పూర్ణిమాదేవిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. మార్చి నెల వరకు వేతనాలు అందాయని, ఏప్రిల్‌ నుంచి చెల్లించాల్సి వుందన్నారు. ఈ వారంలో నిధులు విడుదల అయ్యే అవకాశం వుందని, సిబ్బందికి వేతనాలు కూడా ఈ వారంలోనే జమ అవుతాయని భావిస్తున్నట్టు చెప్పారు.

Updated Date - May 16 , 2025 | 12:43 AM