Share News

నేటి నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవలు బంద్‌

ABN , Publish Date - Oct 10 , 2025 | 01:22 AM

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవ లను నిలిపివేయాలని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యా లు నిర్ణయించాయి.

నేటి నుంచి  ఎన్టీఆర్‌ వైద్య సేవలు బంద్‌

  • ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం

  • ఆరు నెలలుగా పేరుకుపోయిన బిల్లులు

  • సుమారు రూ.150 కోట్ల మేర బకాయిలు

  • 65 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యసేవలపై ప్రభావం

విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవ లను నిలిపివేయాలని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యా లు నిర్ణయించాయి. గత ఆరు నెలలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆషా) ప్రకటించింది. ఇప్పటికే వివిధ మార్గాలద్వారా ప్రభుత్వానికి తమ ఇబ్బందులను తెలియపరిచినప్పటికీ ప్రయోజనం కనిపించలేదని ఆషా ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా ఎన్టీఆర్‌ వైద్య సేవలు నిలిపివేయడంతో జిల్లాలోని 65 ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రోగులకు వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. అయితే ఇప్పటికే వైద్యసేవలు పొందుతున్న రోగులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం కింద జిల్లాలో ప్రతిరోజూ సుమారు 500 నుంచి 600 మంది రోగులకు శస్త్ర చికిత్స లు, ఇతర వైద్యసేవలను అందిస్తున్నారు. తాజా నిర్ణ యంతో ప్రతిరోజూ సుమారు 400 మందికి ఇబ్బందులు ఎదురవనున్నాయి. అయితే ఇప్పటికే కేన్సర్‌, కిడ్నీ తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందిస్తామని ఆషా ప్రకటించింది.

పేరుకుపోయిన బకాయిలు..

జిల్లాలో మొత్తం 85 నెట్‌వర్క్‌ ఆస్పత్రులున్నాయి. వీటి లో ప్రైవేటు/కార్పొరేట్‌ ఆస్పత్రులు 65. ఈ ఆస్పత్రులకు సుమారు రూ.150 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నా యి. ఒక్కో ఆస్పత్రికి కనిష్ఠంగా రూ.50 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయినట్టు ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆరిలోవ హెల్త్‌సిటీలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి రూ.22 కోట్ల వరకు బకాయి ఉండగా, మరో ఆస్పత్రికి రూ.15 కోట్లు, ఇంకో ఆస్పత్రికి రూ.10 కోట్లు ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంది. నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉంచడంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టమవుతోందని ఆషా ప్రతినిధులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అప్పులు చేసి మరీ సిబ్బందికి జీతాలు చెల్లించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని అసోసియేషన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెకు దిగిన నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి నగర పరిధిలోని ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందేందుకు వచ్చే రోగులు పునరాలోచించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఆషా ప్రతినిధులతో చర్చలు జరుపుతోందన్నారు. కాగా అత్యవసర శస్త్ర చికిత్సల నిర్వహణలో ఆస్పత్రుల యాజమాన్యాలు అశ్రద్ధ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.


రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.553.22 కోట్లు

లక్ష్యంలో 81,15 శాతం సాధన

తొలి ఆరు నెలలు ఆశాజనకం

ఫలించిన అధికారుల చర్యలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

రిజిస్ట్రేషన్ల శాఖ మెరుగైన ఆదాయం సాధించింది. రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు పెద్దగా లేకపోయినప్పటికీ 81.15 శాతం లక్ష్యాన్ని సాధించింది. గత ఏడాది కంటే 11.26 శాతం వృద్ధి నమోదు చేసింది.

విశాఖ జిల్లాలో తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా వాటి ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు)రూ.681.77 కోట్ల ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అధికారులు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో సంప్రతింపులు చేసి, ఒప్పందాలన్నింటినీ రిజిస్ట్రేషన్‌ జరిగేలా చర్యలు తీసుకుని రూ.553.22 కోట్ల ఆదాయం లభించేలా చూశారు. ఇది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో 81.15 శాతం. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ.497.22 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. దాంతో పోల్చుకుంటే ఈ ఏడాది 11.26 శాతం వృద్ధి నమోదైందని విశాఖ డీఐజీ బాలకృష్ణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

కార్యాలయాల వారీగా ఆదాయం వివరాలు

---------------------------------------------------------------

కార్యాలయం లక్ష్యం ఆదాయం

---------------------------------------------------------------

భీమునిపట్నం రూ.40.25 కోట్లు రూ.35.43 కోట్లు

సూపర్‌బజారు రూ.166.39 కోట్లు రూ.125.26 కోట్లు

గాజువాక రూ.65.83 కోట్లు రూ. 68.47 కోట్లు

గోపాలపట్నం రూ.34.96 కోట్లు రూ. 21.43 కోట్లు

ద్వారకానగర్‌ రూ.71.46 కోట్లు రూ.50.12 కోట్లు

మధురవాడ రూ.157.77 కోట్లు రూ.143.97 కోట్లు

ఆనందపురం రూ. 39.31 కోట్లు రూ. 33.78 కోట్లు

పెదగంట్యాడ రూ. 57.38 కోట్లు రూ.36.61 కోట్లు

పెందుర్తి రూ. 48.41 కోట్లు రూ. 38.12 కోట్లు

--------------------------------------------------------------------

Updated Date - Oct 10 , 2025 | 01:22 AM