సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్
ABN , Publish Date - May 24 , 2025 | 01:31 AM
రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావేనని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
సంస్కరణలకు చంద్రబాబునాయుడు...
బాబు హయాంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం
కార్యకర్తల సంక్షేమానికి నిధి ఏర్పాటుచేసిన ఘనత లోకేశ్‌కే దక్కుతుంది
మినీ మహానాడులో ఎమ్మెల్యే గంటా
అక్టోబరులో మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన: ఎమ్మెల్యే వెలగపూడి
చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి: ఎమ్మెల్యే గణబాబు
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి తీర్మానం
విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావేనని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మినీ మహానాడు నిర్వహించారు. తొలుత నందమూరి తారకరామారావు విగ్రహానికి, మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పలనరసింహం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గంటా మాట్లాడుతూ ఎన్టీఆర్ తరువాత పగ్గాలు చేపట్టిన చంద్రబాబునాయుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఎంతో కృషిచేశారన్నారు. అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. మూడో తరంలో లోకేష్ ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కార్యకర్తల సంక్షేమానికి నిధి ఏర్పాటుచేశారన్నారు. పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారానికి తీర్మానాన్ని ప్రతిపాదించగా అందరూ ఆమోదించారని, ఇదే అంశం కడప మహానాడులో ప్రస్తావిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ సింహాచలం పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారం అవుతుందని, కోర్టు కేసుకు త్వరలో మోక్షం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ముడసర్లోవ పరిసరాల్లో రైల్వేకు 52 ఎకరాలు ఇచ్చారని, ఆ భూముల్లో ఉన్న నిరుపేదలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మెట్రో రైలుకు వచ్చే అక్టోబరులో శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు మాట్లాడుతూ 1995లో పెందుర్తి జడ్పీటీసీ సభ్యునిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించింది నందమూరి తారకరామారావేనన్నారు. 2019-24 మధ్య దుర్మార్గుడి చేతిలో రాష్ట్రం నాశనం కావడంతో ప్రజలు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏకపక్షంగా తీర్పు చెప్పారన్నారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగిన పేదల పార్టీ కావడంతో తెలుగుదేశం ఉమ్మడి ఏపీలోనూ, ప్రస్తుతం నవ్యాంధ్రలోను మనుగడ సాగించగలుగుతుందన్నారు. దూరదృష్టితో పాలిస్తున్న చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీలో 70 ఏళ్లు దాటిపోతున్న వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు. సీనియర్ నాయకులకు జిల్లా కమిటీలలో స్థానం కల్పించాలని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమమే పార్టీ ధ్యేయమన్నారు. మినీ మహానాడుకు అధ్యక్షత వహించిన విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ మాట్లాడుతూ విశాఖపట్నానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారని అన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. మినీ మహానాడులో చేసిన తీర్మానాలను మహానాడుకు పంపిస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వెంటనే ఇన్‌చార్జిని నియమించాలని కోరారు. ఇన్‌చార్జి లేకపోవడంతో నాయకులు, కార్యకర్తల ఇబ్బందులు పట్టించుకునేవారు లేరన్నారు. సమావేశంలో విశాఖ దక్షిణ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్, పార్టీ నాయకులు చోడే వెంకట పట్టాభి, కోరాడ రాజబాబు, అక్కరమాని విజయనిర్మల, వెల్లంకి భరత్, గొంప కృష్ణ, లొడగల కృష్ణ, తెలుగు మహిళ, యువత, బీసీ, ఎస్సీ సెల్ అధ్యక్షులు సర్వసిద్ధి అనంతలక్ష్మి, తాతాజీ, విజయకుమార్, బుడుమూరు గోవిందరావు, తోటరత్నం, ఈతలపాక సుజాత తదితరులు పాల్గొన్నారు.