Share News

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌లు 91 శాతం మందికి పంపిణీ

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:27 AM

జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ డబ్బుల పంపిణీ సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 91 శాతం పూర్తయ్యింది.

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌లు 91 శాతం మందికి పంపిణీ

మొత్తం లబ్ధిదారులు 2,57,705 మంది

తొలి రోజు 2,35,486 మందికి డబ్బులు అందజేత

అనకాపల్లి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ డబ్బుల పంపిణీ సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 91 శాతం పూర్తయ్యింది. ఈ నెలకు సంబంధించి మొత్తం 2,57,705 మందికి పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.108.43 కోట్లు విడుదల చేసింది. సచివాలయాల సిబ్బంది ద్వారా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 2,35,486 మందికి పింఛన్‌ సొమ్ము పంపిణీ చేసినట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ శచీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాకవరపాలెం మండలం గిడుతూరులో, హోం మంత్రి వంగలపూడి అనిత, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లులో, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అనకాపల్లి మండలం గోపాలపురంలో పలువురు లబ్ధిదారులకు పింఛన్‌ డబ్బులు అందించారు. అన్ని గ్రామాల్లో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పింఛన్‌ సొమ్ము పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 01:27 AM