జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్
ABN , Publish Date - Jul 22 , 2025 | 01:19 AM
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు కమిషనర్ కేతన్‌గార్గ్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
29 వరకూ నామినేషన్ల స్వీకరణ
వచ్చే నెల ఆరున పోలింగ్
విశాఖపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు కమిషనర్ కేతన్‌గార్గ్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్‌తోపాటు ఓటర్ల జాబితాను జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్ కార్యాలయాల్లో అతికించారు. వచ్చే నెల ఆరున జరిగే ఎన్నిక కోసం సోమవారం నుంచి ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ప్రస్తుత స్టాండింగ్ కమిటీ పదవీ కాలం వచ్చే నెల ఆరో తేదీతో ముగియనున్నది. ఆలోగానే కొత్త కమిటీ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
స్టాండింగ్ కమిటీలో పది మంది సభ్యులను 97 మంది కార్పొరేటర్లు బ్యాలెట్ విధానంలో ఎన్నుకుంటారు. సోమవారం నుంచి 29వ తేదీ వరకూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్ (జనరల్) కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందుబాటులో ఉంచుతున్నట్టు కమిషనర్ తెలిపారు. పూర్తిచేసిన నామినేషన్ పత్రాలను 29వ తేదీ వరకూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ అదనపు కమిషనర్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. 30న నామినేషన్ పత్రాలను పరిశీలించి, అర్హులైనవారి జాబితాను ప్రదర్శిస్తామన్నారు. రెండో తేదీన నామినేషన్‌ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందన్నారు. అదేరోజు తుది జాబితాను నోటీసుబోర్డులో ప్రదర్శించి, ఆరో తేదీ ఉదయం పది నుంచి రెండు గంటల వరకు పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందన్నారు.
52 మందితో బీజేపీ జిల్లా కమిటీ
ఇద్దరు ప్రధాన కార్యదర్శులు
ఆరుగురు ఉపాధ్యక్షులు
ఏడుగురు కార్యదర్శులు
విశాఖపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి):
భారతీయ జనతా పార్టీ సోమవారం 52 మందితో విశాఖ జిల్లా కమిటీని ప్రకటించింది. పార్టీ జిల్లా అధ్యక్షునిగా పరశురామరాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా ప్రధాన కార్యదర్శులుగా సిరసపల్లి నూకరాజు, దాడి పురుషోత్తమ రమేశ్‌లను నియమించారు.ఉపాధ్యక్షులుగా చల్లా మంజుల, అత్తిలి శంకరరావు, జేవీ కైలాస్‌రెడ్డి, తాళాడ గిరిజ, కొక్కిలిగడ్డ విజయబాబు, కలిదిండి బదరీనాథ్‌లను, కార్యదర్శులుగా కంటుభుక్త సునీత, బిడిషా బోయెద్, లక్కరాజు సోమరాజు, కరాల మహేశ్, జోగా గోవింద్ యాదవ్, కె.పద్మ, లెంకా శ్రీరామ్‌లను నియమించారు. జిల్లా కోశాధికారిగా ఉపాధ్యాయ శేషలత, సోషల్ మీడియా కన్వీనర్‌గా గొంజిపల్లి రాకేశ్‌ను, ఐటీ సెల్ కన్వీనర్‌గా కోనారి ప్రసాద్ యాదవ్‌ను నియమించారు. వీరు కాకుండా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మరో 31 మందిని నియమించింది. జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు ప్రాధాన్యం కల్పించామని పరశురామరాజు ప్రకటనలో తెలిపారు.
రేషన్ డీలర్ల నుంచి వసూళ్లు
కార్డుకు రూ.2 నుంచి 3 రూపాయలు డిమాండ్ చేస్తున్న పౌర సరఫరాల శాఖ చెకింగ్ ఇన్‌స్పెకర్లు
విశాఖపట్నం, జూలై 18 (ఆంధ్రజ్యోతి):
రేషన్ డీలర్ల నుంచి పౌర సరఫరాల శాఖకు చెందిన కొంతమంది చెకింగ్ ఇన్‌స్పెక్టర్లు నెలవారీ మామ్మూళ్లు వసూలు చేస్తున్నారు. నగరంలోని సర్కిల్-1, సర్కిల్-3 పరిధిలో సొమ్ములు వసూలు చేస్తున్నట్టు కొందరు డీలర్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి, కమిషనర్‌లకు ఫిర్యాదు చేశారు. ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడంతో గత నెల నుంచి రేషన్ డిపోల్లోనే కార్డుదారులకు బియ్యం, పంచదార పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డీలర్ల నుంచి నెలవారీ మామ్మూళ్లకు చెకింగ్ ఇన్‌స్పెక్టర్లు తెరలేపారు. డిపో పరిధిలోని కార్డుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రెండు నుంచి మూడు రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారని మంత్రికి పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కిరండూల్ మార్గంలో రైళ్ల గమ్యాల కుదింపు
విశాఖపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి):
కొత్తవలస-కిరండూల్ (కేకే) లైన్‌లో ఈ నెల 26 వరకు కిరండూల్ రైళ్లతోపాటు హిరాకుడ్, సమలేశ్వర్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతోపాటు గమ్యాలను కుదించి కోరాపుట్ వరకే నడపనున్నట్టు విశాఖపట్నం సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ-కిరండూల్ రాత్రి ఎక్స్‌ప్రెస్ (18515) ఈ నెల 23 నుంచి 25 వరకూ విశాఖలో బయలుదేరి కోరాపుట్ వెళుతుంది. ఇదే ఎక్స్‌ప్రెస్ (18516) ఈ నెల 24 నుంచి 26 వరకు కోరాపుట్‌లో బయలుదేరి విశాఖ చేరుతుంది. కోరాపుట్-కిరండూల్ మధ్య రాకపోకలను రద్దు చేశారు. అలాగే విశాఖ-కిరండూల్ పాసింజర్ (58501) ఈ నెల 23 నుంచి 26 వరకు విశాఖలో బయలుదేరి కోరాపుట్ వెళుతుంది. ఇదే పాసింజర్ (58502) 23 నుంచి 26 వరకూ కోరాపుట్‌లో బయలుదేరి విశాఖ చేరుతుంది.
మునిసిపల్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు
విశాఖపట్నం, జూలై 21 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర మునిసిపల్ శాఖలో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న నాన్ పీహెచ్ వర్కర్లకు వేతనాలను పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కేటగిరీ-1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి రూ.24,500కి, కేటగిరీ-2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500కి, కేటగిరి-3 వర్కర్ల వేతనం రూ.15 వేల నుంచి రూ.18,500కి పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై జీవీఎంసీ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ వర్కర్ల సంఘం అధ్యక్షుడు ఎం.ఆనందరావు స్పందిస్తూ కేటగిరీల వారీగా జీతాలు పెంచడ ం ఆహ్వానించదగ్గపరిణామమే కానీ, సమ్మె కాలానికి వేతనాలు చెల్లింపు, పీఆర్‌సీ అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింపు డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదని, వాటి పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.