పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:01 AM
కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు ప్రారంభించడంలో జాప్యం చేయడంపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
డిపాజిట్ సొమ్ము జీవీఎంసీకి జమ చేయండి
జోన్-4 సమీక్షలో కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశం
తాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకూడదు
ఆస్తిపన్ను చెల్లించని వారి ఆస్తులను జప్తు చేయండి
విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు ప్రారంభించడంలో జాప్యం చేయడంపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన సూర్యాబాగ్‌లోని జోన్-4 కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులతోపాటు పెండింగ్‌లో ఉన్న పనుల గురించి ఇంజనీరింగ్ అధికారులను ఆరా తీశారు. మంజూరైన పనులను సంబంధిత కాంట్రాక్టర్ నిర్ణీత సమయంలో ప్రారంభించి సకాలంలో పూర్తిచేసి జీవీఎంసీకి అప్పగించాలన్నారు. వర్క్ ఆర్డర్ తీసుకున్న తర్వాత కూడా పనులు ప్రారంభించకుంటే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేయడంతోపాటు వారి డిపాజిట్ సొమ్మును జీవీఎంసీకి జమ చేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు పనులు చేయడంలో నిర్లక్ష్యం వహించకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదేనని స్పష్టంచేశారు.
ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి జాప్యం, ఇబ్బంది లేకుండా చూడాలని సంబంధిత విభాగం అధికారులను ఆదేశించారు. వర్షాకాలం కావడంతో మురుగు కాలువలు, డ్రైనేజీల్లో నీటిసరఫరా పైప్‌లైన్‌లు ఉంటే వాటికి లీకులు లేకుండా జాగ్రత్తవహించాలన్నారు. ఏమాత్రం పైప్‌లైన్ లీకేజీ ఉన్నా నీటి కాలుష్యం జరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పువాటిల్లుతుందన్నారు. విద్యుత్ దీపాల నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలన్నారు. అండర్‌గ్రౌండ్ కేబుల్ పనులపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. జోన్ పరిధిలో అనధికార నిర్మాణాలపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలపై కమిషనర్ ఆరా తీశారు. నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘన ఉంటే వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీచేయవద్దని స్పష్టంచేశారు. ఒకవేళ సర్టిఫికెట్ ఇస్తే మాత్రం వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాన్ మంజూరుకు సంబంధించిన దరఖాస్తులను రెండు రోజులు కంటే ఎక్కువకాలం లాగిన్‌లో ఉంచకుండా పైఅధికారులకు పంపించాలని ఏసీపీ ఝాన్సీలక్ష్మిని ఆదేశించారు. ఆస్తిపన్ను వసూలు ఆశించినంతగా లేకపోవడంతో పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆస్తిపన్ను చెల్లించని వారి ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించారు. జోన్‌లో పారిశుధ్య నిర్వహణ పక్కాగా జరగాలని, రాత్రి పారిశుధ్య నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని జోనల్ కమిషనర్‌ను ఆదేశించారు. శానిటరీ సెక్రటరీలు ఉదయాన్నే వార్డులో పర్యటించి పారిశుధ్య సిబ్బంది హాజరు, పనితీరును పరిశీలించడంతోపాటు క్లాప్ వాహనంతో వెళ్లి ఇంటింటికీ చెత్తసేకరణ ఎలా జరుగుతుందనేదాని పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో నీరు నిల్వలేకుండా జాగ్రత్తపడడం ద్వారా సీజనల్ వ్యాధులను నియంత్రించాలని ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. సెంటర్ మీడియన్‌లలో పచ్చదనం ఉండాలని, మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తవి వె ంటనే నాటాలని హార్టికల్చర్ అధికారి వెంకటరమణను ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఈ శ్రీధర్, మురళీకృష్ణ, ఏఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.