నాన్‌స్టాప్ కౌంటర్లు ఖాళీ
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:52 AM
స్త్రీశక్తి పథకం అమలుతో ద్వారకా, మద్దిలపాలెం బస్‌స్టేషన్లలోని నాన్‌స్టాప్ కౌంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
40 శాతం దాటని ఆక్యుపెన్సీ రేషియో
నిర్వహణ వ్యయం కూడా కష్టమే
బస్సుల మధ్య వ్యవధిని పెంచిన అధికారులు
ద్వారకాబస్‌స్టేషన్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
స్త్రీశక్తి పథకం అమలుతో ద్వారకా, మద్దిలపాలెం బస్‌స్టేషన్లలోని నాన్‌స్టాప్ కౌంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. షెడ్యూల్ సర్వీసులు సగటున కేవలం 40 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్నాయి. కనీసం 60 శాతం ఆక్యుపెన్సీ రాకుంటే బస్సుల నిర్వాహణ వ్యయం కూడా రావడం కష్టమేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కనీస ప్రయాణికులు లేకపోవడంతో నాన్‌స్టాప్ సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
ద్వారకా, మద్దిలపాలెం బస్‌స్టేషన్‌ల నుంచి నర్సీపట్నం, కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, ప్రాంతాలకు నాన్‌స్టాప్ సర్వీసులున్నాయి. వీటితో పాటు ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. ఒకే కుటుంబానికి చెందిన పురుషులు ఒక బస్సులో, మహిళలు మరో బస్సులో ప్రయాణించేందుకు ఇష్టపడకపోవడంతో అందరూ ఈ ఐదు రకాల బస్సులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో నాన్‌స్టాప్ కౌంటర్ల వద్ద జనం కనిపించడం లేదు. సాధారణంగా శ్రీకాకుళానికి ప్రతి 30 నిమిషాలకు ఒక నాన్‌స్టాప్ సర్వీస్ నడుస్తుంది. నర్సీపట్నానికి 50 నిమిషాల వ్యవధిలో, కాకినాడ, రాజమండ్రి గంట వ్యవధితో షెడ్యూల్ సర్వీసులు ఉన్నాయి. అయితే బస్సులు బయలుదేరే సమయానికి వీటిలో 30 శాతానికి మించి ఆక్యుపెన్సీ రావడంలేదు. దీంతో కొన్నింటిని రద్దు చేసి బస్సుల మధ్య వ్యవధి పెంచారు. శ్రీకాకుళం నాన్‌స్టాప్‌లను 30 నిమిషాల నుంచి 45 నిమషాలకు, నర్సీపట్నానికి 50 నిమిషాల నుంచి 1.10గంటలకు, రాజమండ్రి, కాకినాడలకు గంట నుంచి గంటన్నర వ్యవధితో బస్సులు నడుపుతున్నారు. అయినా ఆక్యుపెన్సీ రేషియో 40 శాతానికి మించి రావడంలేదని అధికారులు వాపోతున్నారు. స్త్రీశక్తి పథకం అమలు ప్రభావం నాన్‌స్టాప్ సర్వీసులపై పడిందని చెబుతున్నారు.
ముగిసిన ఫుడ్ ఫెస్టివల్
చివరి రోజు భారీగా తరలివచ్చిన ఆహార ప్రియులు
బీచ్ రోడ్ సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): బీచ్ రోడ్డులోని ఎంజీఎం మైదానంలో ఏర్పాటుచేసిన వైజగ్ ఫుడ్ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. పర్యాటక శాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో అధికసంఖ్యలో నగర వాసులు తరలివచ్చి వివిధ రకాల ఆహారపదార్థాలను ఆస్వాదించారు. స్టార్ హోటల్స్, ప్రముఖ రెస్టారెంట్లు, ఇతర సంస్థలు అనేక రుచులను అందుబాటులో ఉంచాయి. హైదరాబాద్‌కు చెందిన నీలోఫర్ కేఫ్ టీ, బన్ స్టాల్ ఏర్పాటుచేసింది. పర్యాటక శాఖ ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించారు. మొత్తమ్మీద ఫుడ్ ఫెస్టివల్ నగరంలోని ఆహార ప్రియులకు సరికొత్త వంటకాలను రుచిచూపించింది.
ముగిసిన మూడో విడత డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన
విశాఖపట్నం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ మెరిట్ జాబితా మేరకు మూడోవిడత అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఆదివారం ఉక్కు నగరం విశాఖ విమల విద్యాలయంలో నిర్వహించారు. మొత్తం 23 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటివరకు రెండువిడతల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికాగా మూడోవిడత ఆదివారం నిర్వహించామని డీఈవో నిమ్మక ప్రేమ్‌కుమార్ తెలిపారు.