డిప్యూటీ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:34 AM
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
తీర్మానానికి 74 మంది సభ్యుల మద్దతు
పదవి కోల్పోయిన జియ్యాని శ్రీధర్
విశాఖపట్నం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాసం నోటీసు ఆధారంగా శనివారం జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ ఎన్నికల అధికారి హోదాలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 111 మందికిగాను 74 మంది (2/3 వంతు...కోరం) హాజరుకావడంతో అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నియమ నిబంధనలను సభ్యులకు ఎన్నికల అధికారి వివరించారు. అనంతరం అవిశ్వాసానికి మద్దతు తెలిపే సభ్యులు చేతులెత్తాలని కోరగా, 63 మంది కార్పొరేటర్లు, 11 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులు చేతులు ఎత్తారు. అవిశ్వాసానికి వ్యతిరేకించేవారు, తటస్థంగా ఉన్నవారు చేతులెత్తాలని కోరగా ఎవరూ స్పందించలేదు. దీంతో అవిశ్వాసం నెగ్గడానికి అవసరమైన 74 మంది మద్దతు లభించడంతో డిప్యూటీ మేయర్ పదవిని శ్రీధర్ కోల్పోయినట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈనెల 19న మేయర్ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాసం కూడా 74 మంది సభ్యుల మద్దతుతో నెగ్గడంతో ఆమె పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. ఈనెల 28న నూతన మేయర్ ఎన్నిక నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేశారు.