Share News

హుకుంపేట ఎంపీపీపై వీగిన అవిశ్వాసం

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:44 AM

స్థానిక ఎంపీపీ కూడ రాజబాబుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయానికి ఎంపీటీసీ సభ్యులు హాజరుకాకపోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను రద్దు చేసినట్టు ఆర్డీవో లోకేశ్వరరావు ప్రకటించారు.

హుకుంపేట ఎంపీపీపై వీగిన అవిశ్వాసం
ఖాళీగా ఉన్న హుకుంపేట ఎంపీటీసీ సభ్యుల కుర్చీలు

సమావేశానికి హాజరుకాని ఎంపీటీసీ సభ్యులు

అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్టు ఆర్డీవో వెల్లడి

హుకుంపేట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీపీ కూడ రాజబాబుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయానికి ఎంపీటీసీ సభ్యులు హాజరుకాకపోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను రద్దు చేసినట్టు ఆర్డీవో లోకేశ్వరరావు ప్రకటించారు. మండల పరిషత్‌లో 11 మంది సభ్యులున్నారు. వీరిలో బీజేపీ ఒకరు, టీడీపీ ఇద్దరు, ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఒకరు, మిగిలిన ఎంపీటీసీ సభ్యులు వైసీపీ మద్దతుదారులున్నారు. వీరిలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి ప్రియాంక కొద్దిరోజుల కిందట రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 10వ తేదీన తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులు సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌కు స్థానిక ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 5న స్థానిక మండల పరిషత్‌ కార్యాయంలో నిర్వహించే ప్రత్యేక సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు హాజరుకావాలని సబ్‌ డివిజన్‌ మేజిస్ట్రేట్‌ నోటీసులు జారీ చేశారు. అయితే ఎంపీటీసీ సభ్యులు హాజరుకాకపోవడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టలేదని ఆర్డీవో తెలిపారు. ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ఒక్కసారి ప్రవేశ పెట్టడానికే వీలుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఎంపీడీవో రమాదేవి, ఏవో సత్యనారాయణ, స్థానిక ఎస్‌ఐ సూర్యనారాయణ హాజరయ్యారు.

Updated Date - Nov 06 , 2025 | 12:44 AM