Share News

ఎలమంచిలి ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:22 PM

ఎలమంచిలి ఎంపీపీపై జనసేన పార్టీ మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్టు అనకాపల్లి ఆర్డీవో ఆయేషా తెలిపారు.

ఎలమంచిలి ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం
ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో ఆయేషా

ఆర్డీవో సమక్షంలో ప్రత్యేక సమావేశానికి హాజరై అభిప్రాయాలు వెల్లడించిన ఎంపీటీసీ సభ్యులు

తదుపరి ప్రక్రియకు తేదీ ఖరారు కావలసి ఉంది

అనకాపల్లి ఆర్డీవో ఆయేషా

ఎలమంచిలి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి ఎంపీపీపై జనసేన పార్టీ మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్టు అనకాపల్లి ఆర్డీవో ఆయేషా తెలిపారు. శనివారం ఎలమంచిలి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అనకాపల్లి ఆర్డీవో ఆయేషా అధ్యక్షతన ఎంపీడీవో సమక్షంలో నలుగురు ఎంపీటీసీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎలమంచిలి ఎంపీపీ బోదెపు గోవింద్‌పై గత నెల 24న వైస్‌ ఎంపీపీలు రాజాన సూర్య చంద్రశేషగిరిరావు(శేషు), శిలపరశెట్టి ఉమ, ఎంపీటీసీ సభ్యులు నగిరెడ్డి అజీ, బర్రె శివలక్ష్మిలు సంతకాలు చేసి అనకాపల్లి ఆర్డీవోకు, ఎలమంచిలి ఇన్‌చార్జి ఎంపీడీవోకు అవిశ్వాస తీర్మానం నోటీసులను అందజేసిన సంగతి తెలిసిందే. అధికారులు పరిశీలన అనంతరం ఈ నెల 18న ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ఎంపీటీసీ సభ్యులకు తగిన సమాచారం అందించారు. మండలంలో ఏడు ఎంపీటీసీ సెగ్మెంట్లకు గాను ఏటికొప్పాక-2 నగిరెడ్డి దేముడమ్మ మృతి చెందిన సంగతి తెలిసిందే. మిగిలిన ఆరుగురు ఎంపీటీసీలకు గాను నలుగురు ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మాన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు వైస్‌ ఎంపీపీలు, ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు ఆర్డీవో తెలిపారు. నలుగురు ఎంపీటీసీలు ఎంపీపీ బోదెపు గోవింద్‌పై అవిశ్వాస తీర్మాన ప్రత్యేక సమావేశంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టయిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం తదుపరి ప్రక్రియ తేదీ ఖరారు చేయవలసి ఉందన్నారు. కాగా జనసేన పార్టీకి చెందిన వైస్‌ ఎంపీపీ రాజాన శేషు ఆధ్వర్యంలో శిలపరశెట్టి ఉమ, నగిరెడ్డి అమ్మాజీ, బర్రె శివలక్ష్మిలు అంతా కలిసి ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో రాజాన శేషు ఎంపీపీ పదవికి లైన్‌ క్లియర్‌ అయినట్టయింది. ఈ ప్రత్యేక సమావేశంలో ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ ధనుంజయరావు, ఎస్‌ఐలు సావిత్రి, ఉపేంద్రతో పాటు పోలీసు సిబ్బంది భద్రత ఏర్పాట్లు చేశారు. ఎంపీడీవో కార్యాలయం బయట జనసేన పార్టీ శ్రేణులతో కోలాహలం నెలకొంది.

Updated Date - Oct 18 , 2025 | 11:22 PM