అనంతగిరి ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:41 PM
మండలంలోని అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణిపై సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
ఇన్‌చార్జి ఆర్డీవో సమక్షంలో అవిశ్వాస తీర్మానానికి ఆమోదం తెలిపిన 11 మంది ఎంపీటీసీ సభ్యులు
అనంతగిరి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణిపై సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఎంపీపీ తీరును నిరసిస్తూ అవిశ్వాస తీర్మానానికి గత నెలలో ఎంపీటీసీ సభ్యులు పాడేరులోని సబ్‌కలెక్టర్‌ను కలిసి అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో ఈ నెల 30వ తేదీన మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించేలా సబ్‌కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ప్రిసైడింగ్ అధికారి, ఇన్‌చార్జి ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరావును నియమించారు. ఎంపీడీవో ప్రభాకర్ అవిశ్వాస తీర్మానం పెట్టిన సభ్యులకు సమాచారం ఇచ్చారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఎంపీపీ శెట్టి నీలవేణితో పాటు 11 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. ఎంపీపీ శెట్టి నీలవేణిపై అవిశ్వాస తీర్మానంలో వైసీపీకి చెందిన ఏడుగురు, టీడీపీకి చెందిన ఇద్దరు, బీజేపీకి చెందిన ఒకరు, ఇండిపెండెంట్ ఒకరు.. మొత్తం 11 మంది ఎంపీటీసీ సభ్యులు అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణిపై అవిశ్వాస తీర్మానంలో చేతులెత్తి ఆమోదం తెలిపారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టు ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు ప్రకటించారు. తదుపరి నివేదికను జడ్పీ సీఈవోకు పంపిస్తామని, ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని వివరించారు. సమావేశం మందిరం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అరకు సీఐ ఎల్.హిమగిరి, ఎస్‌ఐ డీ. శ్రీనివాసరావు సమక్షంలోని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.