Share News

బల్క్‌ డ్రగ్‌ పార్కుకు ఏలేరు నీరు

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:36 AM

జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానున్న బల్క్‌డ్రగ్‌ పార్కు, ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీఐఐసీ గతంలో సేకరించిన భూములకు జాతీయ రహదారి నుంచి ఇప్పటికే రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పుడు నీటి అవసరాల కోసం పైపులైన్‌ నిర్మాణానికి ఎన్‌హెచ్‌హెచ్‌ఏ నుంచి అధికారులు అనుమతులు పొందారు.

బల్క్‌ డ్రగ్‌ పార్కుకు ఏలేరు నీరు
బల్క డ్రగ్‌ పార్కుకు నీటిని సరఫరా చేయనున్న ఏలేరు కాలువ (ఫైల్‌ ఫొటో)

నక్కపల్లి మండలం కాగిత నుంచి ‘పేట వరకు 15.5 కి.మీ.ల పైపులైన్‌

పనులు చేపట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అనుమతి

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానున్న బల్క్‌డ్రగ్‌ పార్కు, ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీఐఐసీ గతంలో సేకరించిన భూములకు జాతీయ రహదారి నుంచి ఇప్పటికే రోడ్డు నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పుడు నీటి అవసరాల కోసం పైపులైన్‌ నిర్మాణానికి ఎన్‌హెచ్‌హెచ్‌ఏ నుంచి అధికారులు అనుమతులు పొందారు.

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భాగంగా నక్కపల్లిలో మల్టీ మోడల్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు కానుంది. నక్కపల్లి ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో బల్క్‌డ్రగ్‌ పార్కుకు 2,001 ఎకరాలు, ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు 2,200 ఎకరాల భూములు కేటాయించిన ప్రభుత్వం ఆయా పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీఐఐసీ సెజ్‌లో ఏర్పాటు కానున్న బల్క్‌ డ్రగ్‌ పార్కుకు ఏలేరు కాలువ నుంచి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నక్కపల్లి మండలం కాగిత గ్రామం నుంచి పాయకరావుపేట వద్ద తాండవ జంక్షన్‌ వరకు 1,100 మి.మీ.ల వ్యాసార్థంతో 15.5 కిలోమీటర్ల పొడవున భారీ పైపులైన్‌ ఏర్పాటు చేయనున్నారు. దీనిని జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేయనున్నందున అనుమతి ఇవ్వాలంటూ ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ ఎస్‌.నరసింహారావు గత నెలలో ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌కు లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్‌హెచ్‌ఏఐ అదికారులు.. ఈ మేరకు అనుమతి ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా నాతవరం మండలం ఎంబీ పట్నం వద్ద ఏలేరు కాలువలో ఇన్‌టేక్‌ వెల్‌తో పాటు పంప్‌ హౌస్‌ నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి పాయకరావుపేట మీదుగా నక్కపల్లి సెజ్‌లో బల్క్‌ డ్రగ్‌ పార్కుకు పైపులైన్‌ ద్వారా నీటిని తరలిస్తారు.

Updated Date - Apr 26 , 2025 | 12:36 AM