Share News

లీజుకు నో

ABN , Publish Date - Nov 05 , 2025 | 01:02 AM

డాబాగార్డెన్స్‌లోని ప్రేమ సమాజంలో కార్యవర్గ సభ్యులు అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు.

లీజుకు నో

ప్రేమ సమాజం భూములపై కార్యవర్గం అత్యవసర భేటీ

సొంతంగానే అభివృద్ధి చేయాలని నిర్ణయం

రుషికొండ వద్ద పెట్రోల్‌ బంకు ఏర్పాటుపై చర్చ

విశాఖపట్నం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి):

డాబాగార్డెన్స్‌లోని ప్రేమ సమాజంలో కార్యవర్గ సభ్యులు అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. భూముల అంశంపై లోతుగా చర్చించారు. రుషికొండలో సంస్థకు చెందిన విలువైన భూములను పలువురు లీజుకు అడుగుతున్న నేపథ్యంలో ‘ప్రేమ సమాజం భూములపై పెద్దల కన్ను’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం ఒక కథనం ప్రచురించింది. దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. దీంతో సంస్థ బాధ్యులు కార్యవర్గంతో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. భూముల లీజుకు సంబంధించి తెర వెనుక ఎవరికైనా హామీలు ఇచ్చారా?...అనే దానిపై చర్చ జరిగింది. ఎవరూ ఎవరికీ ఏమీ హామీ ఇవ్వలేదని, కార్యవర్గం అంతా ఒక మాటపైనే నిలవాలని నిర్ణయించారు. అంతేకాకుండా భూములు లీజుకు ఇవ్వకుండా సొంతంగా అభివృద్ధి చేయాలని కూడా నిశ్చయించారు. ఏ విధంగా దీనిపై ముందుకువెళ్లాలనే అంశంపై తదుపరి చర్చించాలని తీర్మానం చేశారు.

పెట్రోల్‌ బంకులు కూడా సొంతంగానే..

విశాఖపట్నం-భీమిలి మార్గంలో అప్పుఘర్‌ వద్ద మాత్రమే పెట్రోల్‌ బంక్‌ ఉంది. భీమిలి వరకూ ఇంకెక్కడా లేదు. ఈ నేపథ్యంలో రుషికొండలో పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు ఆయిల్‌ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రేమ సమాజం భూములు రహదారిని ఆనుకొని ఎక్కువ విస్తీర్ణంలో ఉండడంతో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ కంపెనీలు తమకు భూములు లీజుకు కావాలని వేర్వేరుగా లేఖలు రాశాయి. అక్కడ మార్కెట్‌ రేటు ప్రకారం అద్దె ఇస్తామని, దీర్ఘకాలం లీజుకు కావాలని కోరాయి. దీనిపై కార్యవర్గ సమావేశంలో చర్చించారు. భూములు ఎవరికీ లీజుకు ఇవ్వకూడదని నిర్ణయించినందున, ఆయిల్‌ కంపెనీలకు కూడా ఆ జాబితాలోకి వస్తాయని కొందరు గుర్తుచేశారు. ప్రేమసమాజం స్వచ్ఛంద సంస్థ కాబట్టి, 95 ఏళ్లుగా నడుస్తున్నందున, ఆ విభాగంలో సంస్థకు పెట్రోల్‌ బంక్‌ కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేయాలని నిర్ణయించారు. ఆ విధంగా సొంతంగా పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేసుకుంటే పలువురికి ఉపాధితో పాటు, ఆదాయం కూడా వస్తుందని చర్చ జరిగింది.

దాతల ఆశయం ప్రకారమే భూముల వినియోగం

ప్రేమ సమాజానికి దాతలు పెద్ద మనసుతో భూములు ఇచ్చారని, వాటిని ఆ ప్రకారమే ఉపయోగిస్తామని కార్యవర్గం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. లీజు విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేసింది. సంస్థకు రుషికొండలో 47.33 ఎకరాలు ఉన్నాయని సంస్థ ప్రతినిధి వి.మోహన్‌రావు తెలిపారు. కార్యవర్గం ఎవరి ప్రలోభాలకు తలొగ్గదని పేర్కొన్నారు.

Updated Date - Nov 05 , 2025 | 01:02 AM