కంటి మీద కునుకు లేదు
ABN , Publish Date - Sep 12 , 2025 | 01:10 AM
‘‘ఎటు చూసినా అల్లర్లు...కాలిపోతున్న భవనాలు...నీరు, ఆహారం లేదు.
ఆహారం లేక అవస్థలు
భయంభయంగా గడిపాం
రాష్ట్ర ప్రభుత్వ స్పందన ప్రశంసనీయం
మంత్రి లోకేశ్ అనుక్షణం మా యోగక్షేమాలు తెలుసుకున్నారు
ఇచ్చిన మాట ప్రకారం ఒక్కరోజులోనే స్వస్థలానికి చేర్చారు
విశాఖ చేరుకున్న నేపాల్ యాత్రికులు
‘‘ఎటు చూసినా అల్లర్లు...కాలిపోతున్న భవనాలు...నీరు, ఆహారం లేదు. బతికుంటామనే భరోసా లేదు. మూడు రోజులు కంటి మీద కునుకులేకుండా భయం భయంగా గడిపాం. మా వేదనను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ అనుక్షణం మా యోగక్షేమాలు తెలుసుకున్నారు. మాతో నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు. క్షేమంగా రాష్ట్రానికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారం ఒక్కరోజులోనే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి, స్వస్థలాలకు చేర్చారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం....’’
- నేపాల్ పర్యటనకు వెళ్లి అల్లర్లలో చిక్కుకుపోయిన రాష్ట్ర వాసులు గురువారం క్షేమంగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత చెమర్చిన కళ్లతో చెప్పిన మాటలివి...
గోపాలపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):
నేపాల్ అల్లర్లలో చిక్కుకుని గురువారం క్షేమంగా నగరానికి చేరుకున్న బాధితుల ముఖాల్లో ఆనందం కాంతులీనింది. మూడు రోజులుగా నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులు ఆకలిదప్పులతో ఇబ్బందులు పడ్డారు. తమను సురక్షితంగా తీసుకురావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో అహర్నిశలు శ్రమించిన ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌కు చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు కృషితో క్షేమంగా చేరాం
పది మంది కలిసి ఈ నెల 3న నేపాల్ యాత్రకు వెళ్లాం. అక్కడ కొన్ని ఆలయాలు దర్శించుకుని పోఖరాలో ని ఓ హోటల్‌లో బస చేశాం. అక్కడి నుంచి మరో ఆలయ దర్శనానికి వెళ్లినప్పుడు అల్లర్లు చెలరేగాయి. తిరిగి వచ్చేసరికి మేము బసచేసిన హోటల్‌కు నిప్పంటుకుంది. మా సామగ్రి అంతా హోటల్‌లోనే ఉండిపోయింది. నగరానికి ఎలా చేరుకోవాలో తెలియక ఆందోళన చెందాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ కృషితో క్షేమంగా చేరాం. జీవితాంతం చంద్రబాబుకు రుణపడి ఉంటాం.
- మద్దుల ఆశారాణి, గోపాలపట్నం
ప్రభుత్వ సేవలు అభినందనీయం
నగరం నుంచి 61 మంది నేపాల్ యాత్రకు వెళ్లి అల్లర్ల కారణంగా చిక్కుకుపోయాం. ఇంటికి ఎలా చేరాలో తెలియక తీవ్రంగా ఆందోళన చెందాం. మమ్మల్ని స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి, సేవలు అభినందనీయం. ప్రభుత్వ పనితీరుకు సర్వదా కృతజ్ఞతలు. నేరుగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కరోజులో క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు.
- ఎస్‌వీ రామరాజు, రామాటాకీస్ ప్రాంతం
ఇంత త్వరగా వస్తామనుకోలేదు
నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న మేము సురక్షితంగా, ఇంత తొందరగా రాష్ట్రానికి చేరుకుంటామనుకోలేదు. బాధితుల్ని స్వస్థలాలకు తీసుకురావడానికి ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం. ప్రభుత్వం తీసుకున్న చొరవ జీవితాంతం మరువలేనిది. మమ్మల్ని సురక్షితంగా ఇళ్లకు చేరుస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు.
- రోజారాణి, కాకినాడ
మాకు పునర్జన్మే.
విజయనగరం నుంచి 39 మందిమి నేపాల్ పర్యటనకు వెళ్లి అక్కడి అల్లర్లలో చిక్కుకున్నాం.మూడు రోజులు ఆహారం కూడా లేక అవస్థలు పడ్డాం. కళ్ల ముందు జరుగుతున్న మారణకాండ చూసి భయాందోళనకు గురయ్యాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో సురక్షితంగా చేరుకున్నాం. మాకు పునర్జన్మ కల్పించిన చంద్రబాబు, లోకేశ్‌లకు కృతజ్ఞతలు.
- కర్రి శ్రీనివాసరావు, విజయనగరం