బార్లలో ఇష్టారాజ్యం
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:21 AM
నగరంలో బార్ అండ్ రెస్టారెంట్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
నిబంధనలు పట్టించుకోని నిర్వాహకులు
పోలీసుల తనిఖీల్లో బయటపడిన లొసుగులు
ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయం
కానరాని ఫైర్ సేఫ్టీ, సీసీ కెమెరాలు
ఉన్నతాధికారుల నివేదిక
అయినా కానరాని దిద్దుబాటు చర్యలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో బార్ అండ్ రెస్టారెంట్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనేక బార్లలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుగుతున్నాయని, భద్రతా చర్యలు పాటించడం లేదని ఇటీవల పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బహిర్గతమైంది. దీనిపై సంబంధిత శాఖల అధికారులకు నివేదిక పంపించినా ఇంతవరకూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగర పరిధిలో 127 బార్ అండ్ రెస్టారెంట్‌లు ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్‌ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతితోపాటు జీవీఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అగ్ని ప్రమాదాలు వంటివి సంభవించినా సకాలంలో మంటలను ఆర్పేందుకు వీలుగా అన్నిరకాల పరికరాలను ఏర్పాటుచేసి ఆ శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. అయితే నగరంలోని చాలా బార్‌లలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిగిపోతున్నాయి. పలుబార్లలో ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే బార్‌ల లోపల, బయట తరచూ కొట్లాటలు జరుగుతుంటాయి. రెండు, మూడు హత్యలు కూడా జరిగాయి. దర్యాప్తులో భాగంగా అక్కడకు వెళ్లిన పోలీసులకు కనీసం సీసీ కెమెరాలు కూడా లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల 450 మంది పోలీసులు 92 బృందాలుగా ఏర్పడి 104 బార్ అండ్ రెస్టారెంట్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 23 బార్‌లలో ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారని, 14 బార్ అండ్ రెస్టారెంట్‌లకు ఫైర్ ఎన్‌ఓసీ లేదని, రెండు బార్‌లలో సీసీ కెమెరాలు లేవని, ఒక బార్ అండ్ రెస్టారెంట్‌కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదని, రెండు బార్‌లకు ట్రేడ్ లైసెన్స్ లేదని, ఒక బార్ అండ్ రెస్టారెంట్‌కు జీఎస్‌టీ లేదని గుర్తించారు. ఉల్లంఘనలపై పోలీస్ ఉన్నతాధికారులు నివేదిక తయారుచేసి చర్యల నిమిత్తం సంబంధిత శాఖలకు పంపించారు. అయితే ఆయా శాఖలు చర్యలు తీసుకున్నట్టు ఇంతవరకూ ఎలాంటి దాఖలాలు లేవు. స్వయంగా పోలీసులే తనిఖీలు నిర్వహించి లోపాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరినా స్పందన లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.