Share News

బండి బాధలు ఉండవిక

ABN , Publish Date - May 23 , 2025 | 12:42 AM

నిత్యావసర సరకులు లబ్ధిదారులకు సక్రమంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీలో ఉన్న సమస్యలను పరిష్కరించి, లబ్ధిదారులకు సక్రమంగా సరకులు అందించేందుకు చర్యలు చేపడుతున్నది. జూన్‌ 1 నుంచి రేషన్‌ డిపోల్లోనే సరకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఇంటి వద్దకే సరకులు అందించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఎండీయూ వాహనాలను వాటి యజమానులకే ఉచితంగా ఇవ్వనుంది.

బండి బాధలు ఉండవిక
జీకేవీధి మండలం కంపుమానుపాకలు గ్రామం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగళగుంది గ్రామానికి రేషన్‌ సరకులు మోసుకు వెళుతున్న గిరిజనులు (ఫైల్‌)

- రేషన్‌ డిపోల్లోనే సరకులు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం

- జూన్‌ 1 నుంచి అమలు

- వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే సరకులు

- జిల్లా వ్యాప్తంగా 221 ఎండీయూ వాహనాలు

- గత ప్రభుత్వం ఇంటి వద్దకే సరకులు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించుకున్నా అమలులో విఫలం

- వాహనం ఎప్పుడు వస్తుందో?, ఎక్కడ ఉంటుందో తెలియక లబ్ధిదారుల అవస్థలు

- జిల్లాలో సుమారు 40 శాతం మందికి సరకులు అందడం లేదని ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో నిర్ధారణ

- ఈ నేపథ్యంలో ప్రక్షాళన

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

నిత్యావసర సరకులు లబ్ధిదారులకు సక్రమంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీలో ఉన్న సమస్యలను పరిష్కరించి, లబ్ధిదారులకు సక్రమంగా సరకులు అందించేందుకు చర్యలు చేపడుతున్నది. జూన్‌ 1 నుంచి రేషన్‌ డిపోల్లోనే సరకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఇంటి వద్దకే సరకులు అందించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఎండీయూ వాహనాలను వాటి యజమానులకే ఉచితంగా ఇవ్వనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే అల్లూరి జిల్లాలోనే ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్స్‌) వాహనాలతో అఽధికంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఎండీయూల ద్వారా రేషన్‌ సరకుల పంపిణీలో లోటుపాట్లను గుర్తించేందుకు ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ఈ విషయం తేలింది. జిల్లాలో సుమారుగా 40 శాతం మంది లబ్ధిదారులకు ఎండీయూ ద్వారా సరకులు అందని పరిస్థితులున్నాయని తెలిసింది. జిల్లాలోని పాడేరు, చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 22 మండలాల్లో మొత్తం 2 లక్షల 98 వేల 92 రేషన్‌కార్డులున్నాయి. వాటి ద్వారా 8 లక్షల 91 వేల 232 మంది రేషన్‌ సరకులను పొందుతున్నారు. ఆహార భద్రతా చట్టంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలతో లబ్ధిదారులకు రేషన్‌ సరకులు సక్రమంగా అందడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో పాటు రేషన్‌ డిపోల సంఖ్య కంటే, ఎండీయూ వాహనాల సంఖ్య తక్కువగా ఉండడంతో లబ్ధిదారులకు సరకులు అందని దుస్థితి కొనసాగుతున్నది. వాస్తవానికి జిల్లాలో 671 డిపోల ద్వారా రేషన్‌ సరకులను అందించే పరిస్థితి నుంచి కేవలం 221 ఎండీయూ వాహనాలతో వాటిని పంపిణీ చేసే దుస్థితికి తీసుకువచ్చారు. దీంతో ఎక్కువ మందికి సరకులు అందకపోవడం, అవన్నీ సరిహద్దులోని ఒడిశా రాష్ట్రానికి అక్రమంగా తరలిపోవడం సర్వసాధారణమైపోయింది. అలాగే ఇన్నాళ్లు గిరిజన సహకార సంస్థ ద్వారా జరిగే నిత్యావసర సరకుల పంపిణీ పక్రియను ఎండీయూలతో చేపట్టడంతో ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడింది. అలాగే ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో చేసేది లేక లబ్ధిదారులు మిన్నకుండడం పరిపాటిగా మారింది. అందువల్లే ఏజెన్సీలోని ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి మండలాల్లోని లబ్ధిదారులకు రేషన్‌ సరకులు సక్రమంగా అందని వైనాలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. ఆయా సరకులన్నీ బ్లాక్‌ మార్కెట్‌లోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సివిల్‌ సప్లై వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రతి లబ్ధిదారుడికి కచ్చితంగా రేషన్‌ సరకులు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతుండడంతో ముఖ్యంగా గిరిజనులకు చాలా వరకు మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో రేషన్‌ డిపోలు, ఎండీయూలు, సరకుల పంపిణీ వివరాలు

-----------------------------------------------------------------------------------

వ.సం డివిజన్‌పేరు గోదాములు డిపోలు ఎండీయూలు కార్డుల సంఖ్య

-----------------------------------------------------------------------------------

1. పాడేరు 9 486 144 1,84,358

2. చింతూరు 1 82 30 44,189

3. రంపచోడవరం 4 103 47 69,545

-----------------------------------------------------------------------------------

మొత్తం 14 671 221 2,98,092

-----------------------------------------------------------------------------------

Updated Date - May 23 , 2025 | 12:42 AM