Share News

అన్నదానంలో లోపాలపై విచారణ శూన్యం

ABN , Publish Date - Aug 22 , 2025 | 01:15 AM

దేవదాయ శాఖ ఉన్నతాధికారుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.

అన్నదానంలో లోపాలపై విచారణ శూన్యం

అక్రమార్కులకు ఉన్నతాధికారుల అండ

నగరంలోని ఒక దేవస్థానంలో బయోమెట్రిక్‌ వినియోగించడం లేదని స్పష్టంగా పేర్కొన్నా చర్యలకు వెనకడుగు

ఒకరు తప్పు చేస్తే అందరి నుంచి నివేదికలు

ఇదీ దేవదాయ శాఖ పనితీరు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖ ఉన్నతాధికారుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రధాన ఆలయాల్లో అన్నదాన పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని, స్థానిక అధికారులు నెలకు లక్ష రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారని ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురిస్తే...దానికి విజయవాడ అధికారులు మసి పూసి మారేడు కాయ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పథకం ఒక్కో దగ్గర ఒక్కోలా అమలు చేస్తున్నారు. ఎంతమంది భక్తులకు అన్నదానం చేస్తున్నారో ఒక్క సింహాచలం దేవస్థానంలో తప్ప మిగిలినచోట్ల బయోమెట్రిక్‌ లెక్కలు లేవు. ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో ప్రస్తావించింది. మిగిలిన దేవస్థానాలు ఎందుకు బయోమెట్రిక్‌ అమలు చేయడం లేదో వివరణ కోరాల్సిన దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఆ విషయాన్ని పక్కనపెట్టింది. ఆ ఒక్క దేవస్థానం సిబ్బందిని రక్షించడానికి మిగిలిన దేవాలయాలన్నింటికీ నోటీసులు జారీ చేసింది. శ్రీకాకుళం అరసవిల్లి, విశాఖలోని కనకమహాలక్ష్మి ఆలయం, సింహాచలం, అనకాపల్లిలోని నూకాలమ్మ, అన్నవరంలో సత్యనారాయణ దేవస్థానాలకు ఈ నోటీసులు జారీచేసింది. అన్నదాన పథకంతో పాటు ప్రసాదాల తయారీలో ఉపయోగించే దినుసులు అంటే బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, నూనె, నెయ్యి, శనగపిండి తదితరాల నాణ్యత పరీక్షల నివేదికలు పంపాలని కమిషనర్‌ కార్యాలయం కోరింది. అలాగే గత నెల రోజులు ఏ దేవస్థానంలో ఎంతమందికి అన్నదానం నిర్వహించారో బయోమెట్రిక్‌ వివరాలు సమర్పించాలని ఆదేశించింది. అన్నదానానికి వచ్చే భక్తులకు టోకెన్లు ఇస్తున్నారని, బయోమెట్రిక్‌ తీసుకోవడం లేదని చాలా స్పష్టంగా వార్త ప్రచురిస్తే దానిపై బాధ్యులైన అధికారులను వివరణ కోరకుండా లేని బయోమెట్రిక్‌ వివరాలు సమర్పించాలని కోరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

విశాఖలోని ఒక ఆలయంలో అన్నదానం విభాగం నుంచి లక్ష రూపాయలు ప్రతి నెలా ఉన్నతాధికారికి ఇవ్వడానికి అక్కడ బయోమెట్రిక్‌ అమలు చేయడం లేదు. రికార్డులు అన్నీ మాన్యువల్‌గా నచ్చినట్టు రాసుకుంటున్నారు. ఆ దేవస్థానంలో బయోమెట్రిక్‌ యంత్రాలు ఉన్నప్పటికీ, వాటితోనే భక్తుల సంఖ్య నమోదు చేయాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ పాటించకపోవడం అక్కడి అవకతవకలకు అద్దం పడుతోంది. ఇది పత్రికలో రాగానే బయోమెట్రిక్‌ అమలు చేయాలని ఆదేశించకుండా ఐదు జిల్లాల అధికారులు నివేదిక ఇవ్వాలని విజయవాడ అధికారులు కోరడం తప్పు చేసిన వారిని తప్పించడానికేనని దేవదాయ శాఖ వర్గాలు కోడై కూస్తున్నాయి. అన్నదానంలో డబ్బులు మిగలడానికి నాశిరకం దినుసులు వాడుతున్నారు. ఇప్పుడు వాటికి లేబొరేటరీ నివేదిక కోరుతున్నారు కాబట్టి వాటిని కూడా నకిలీవి తయారుచేసి పంపే అవకాశం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. సింహాచలం దేవస్థానం సిబ్బందిని ఇటీవల తప్పనిసరిగా బదిలీ చేయాల్సి వచ్చింది. కమిషనర్‌ కార్యాలయం అధికారులు వారిని దూరప్రాంతాలకు పంపకుండా స్థానికంగా ఉన్న కనకమహాలక్ష్మి ఆలయానికి బదిలీ చేశారు. ఒకరిద్దరిని దూరంగా వేసినా నెల రోజులు తిరగకుండానే మళ్లీ విశాఖపట్నం తీసుకువచ్చారు. ఇప్పుడు అక్కడే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిపై దృష్టిసారిస్తే కమిషనర్‌ కార్యాలయానికి కూడా సెగ తగిలే అవకాశం ఉండడంతో ఎటువంటి ప్రత్యేక విచారణ చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Aug 22 , 2025 | 01:15 AM