Share News

పుట్టగొడుగుల్లా ఇటుక బట్టీలు

ABN , Publish Date - Dec 10 , 2025 | 01:22 AM

ఇటుకల బట్టీల నిర్వాహకులు పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. ఇటుకల తయారీ కోసం ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. మరోవైపు ఇటుకల కాల్చే సమయంలో పెద్దఎత్తున పొగ ఎగిసి పడుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇటుల బట్టీల నిర్వాహకుల తీరు ఇష్టారాజ్యంగా తయారైంది.

పుట్టగొడుగుల్లా ఇటుక బట్టీలు
సబ్బవరం మండలం దేవీపురం వద్ద ఇటుకల బట్టి

నిబంధనలను ఉల్లంఘిస్తున్న నిర్వాహకులు

బట్టీల ఏర్పాటు నుంచి మట్టి తవ్వకాల వరకు అనుమతులు నిల్‌

ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో రాయల్టీ ఎగవేత

ఒడిశా నుంచి తక్కువ వేతనాలకు కూలీలను తెచ్చుకుంటున్న యాజమాన్యాలు

కార్మిక చట్టాలకు తూట్లు

పట్టించుకోని రెవెన్యూ, గనులు, పర్యావరణ, కార్మిక శాఖల అధికారులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ఇటుకల బట్టీల నిర్వాహకులు పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు. ఇటుకల తయారీ కోసం ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. మరోవైపు ఇటుకల కాల్చే సమయంలో పెద్దఎత్తున పొగ ఎగిసి పడుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇటుల బట్టీల నిర్వాహకుల తీరు ఇష్టారాజ్యంగా తయారైంది.

వర్షాకాలం ముగియడంతో ఇళ్ల నిర్మాణాలు జోరందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది సిమెంట్‌ (ఫాల్‌జీ) ఇటుకలకుబదులు బట్టీల్లో తయారైన మట్టి ఇటుకల వినియోగానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో ప్రస్తుతం బట్టీల్లో ఇటుకల తయారీ ముమ్మరంగా సాగుతున్నది. వాస్తవంగా ఇటుక బట్టీ ఏర్పాటు చేయాలంటే స్థానిక గ్రామ పంచాయతీ, రెవెన్యూ, గనులు, కార్మిక, పర్యావరణ, భూగర్భ జలవనరుల శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. ఇటుకల తయారీకి అవసరమైన మట్టి తవ్వకాల కోసం గనుల శాఖ అనుమతి వుండాలి. లక్ష ఇటుకలు తయారు చేస్తే.. స్థానిక గ్రామ పంచాయతీకి, గనుల శాఖకు రూ.10 వేలకు తక్కువ కాకుండా రాయల్టీ చెల్లించాలి. కానీ జిల్లాలో అత్యధిక శాతం ఇటుకల బట్టీల నిర్వాహకులు ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. జిల్లాలో సుమారు 380 ఇటుక బట్టీలు ఉన్నట్టు గనుల శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ సంఖ్యకు రెట్టింపు వుంటుంది. ఇటుకల తయారీకి అవసరమైన మట్టిని చెరువులు, వాగుల్లో నుంచి తవ్వుకుపోతున్నారు. వాస్తవంగా మట్టి తవ్వకాల కోసం రెవెన్యూ, గనుల శాఖలతోపాటు అవసరమైతే జలవనరుల శాఖ నుంచి కూడా అనుమతి పొందాలి. క్యూబిక్‌ మీటరు మట్టికి రూ.42 చొప్పున ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. కానీ జిల్లాలో మట్టి తవ్వకాలు జరుపుతున్న ఇటుక బట్టీల నిర్వాహకుల్లో అత్యధికులు రాయల్టీ చెల్లించడం లేదని గనుల శాఖ అధికారుల సమాచారం. ఇటుక బట్టీల కోసం అనకాపల్లి మండలం కుంచంగి, కూండ్రం, తుమ్మపాల, సబ్బవరం మండలం అంతకాపల్లి, చోడవరం మండలం వెంకన్నపాలెం ప్రాంతంలోని చెరువులు, జిరాయితీ భూముల్లో మట్టి తవ్వకాలు సాగుతున్నాయి.

ఇటుకబట్టీల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయడంలేదు. స్థానిక కూలీలు అయితే ఎక్కువ కూలి డిమాండ్‌ చేస్తారన్న ఉద్దేశంతో వెనుకబడిన ప్రాంతమైన ఒడిశా నుంచి కుటుంబాలతో సహా కూలీలను రప్పించుకుంటున్నారు. వీరికి అడ్వాన్సుల రూపంలో కొంత సొమ్మును ముట్టజెప్పి, బట్టీల్లో తక్కువ వేతనాలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులు తమ పిల్లలను బడికి పంపకుండా.. ఇటుకల తయారీ పనులు చేయిస్తున్నారు. కార్మిక శాఖ అధికారులు నిష్పక్షపాతంగా తనిఖీలు జరిపితే ఇటువంటి ఉల్లంఘనలు బయటపడతాయి. కాగా ఇటుక బట్టీల నిర్వాహకులు నిబంధనల ఉల్లంఘనపై గనుల శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. మట్టి తవ్వకాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. తయారు చేసిన ఇటుకల సంఖ్యనుబట్టి రాయల్టీ చెల్లించాలన్నారు. జిల్లాలో ఎన్ని ఇటుకల బట్టీలు ఉన్నాయనేది మండలాల నుంచి వివరాలు సేకరిస్తున్నామన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 01:22 AM