Share News

7 నుంచి కొత్త జోన్లు

ABN , Publish Date - Sep 26 , 2025 | 01:09 AM

జీవీంఎసీ పరిధిలో జోన్‌ల పునర్విభజనను వచ్చే నెల ఏడో తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.

7 నుంచి కొత్త జోన్లు

నియోజకవర్గాల పేర్లతో ఏర్పాటు

కొత్తగా అగనంపూడి, మధురవాడ...

భవనాల ఎంపిక, ఇతర ఏర్పాట్లపై అధికారులతో జీవీఎంసీ కమిషనర్‌ సమీక్ష

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

జీవీంఎసీ పరిధిలో జోన్‌ల పునర్విభజనను వచ్చే నెల ఏడో తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న జీవీఎంసీలో ప్రస్తుతం ఎనిమిది జోన్‌లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒక నియోజక వర్గం పరిధిలో ఉన్న వార్డులు..మరొక నియోజకవర్గంలో ఉన్న జోనల్‌ కార్యాలయం పరిధిలో ఉన్నాయి. అదేవిధంగా ఒక జోన్‌ పరిధిలో రెండు, మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న వార్డులు ఉండడంతో పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు జోన్‌ల పునర్విభజన చేపట్టాలని, ఒక జోన్‌ పరిధి ఒక నియోజకవర్గంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భీమిలి, పెందుర్తి జోన్‌ల పరిధి చాలా ఎక్కువగా ఉండడంతో ప్రజలు, కార్పొరేటర్ల సౌలభ్యం కోసం ఆ రెండు నియోజకవర్గాలకు రెండేసి జోన్‌లు ఉండేలా మొత్తం జోన్‌ల సంఖ్య పదికి పెంచుతూ ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. దీనికి ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలపడంతో దసరా తర్వాత మంచిరోజు చూసుకుని కొత్తజోన్‌లను అమల్లోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. దీనిపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ జీవీఎంసీలోని అన్ని విభాగాల అధిపతులతో గురువారం సమావేశం ఏర్పాటుచేసి కొత్తజోన్‌లను అమల్లోకి తేవడంపై చర్చించారు. కొత్తగా ఏర్పాటయ్యే రెండు జోన్‌లకు భవనాలను ఎంపిక చేయాలని, ఫర్నీచర్‌తోపాటు సిబ్బందిని కూడా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వచ్చే నెల ఏడో తేదీ మంచి రోజు కావడంతో ఆరోజు నుంచి కొత్తజోన్‌ల పాలన ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలని సూచించినట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే జోన్‌లను కూడా నంబర్లతో కాకుండా నియోజకవర్గాల పేర్లతోనే పిలిచేలా పునర్వ్యవస్థీకరించారు.

కొత్తగా భీమిలి జోన్‌లో గతంలో మాదిరిగా నాలుగు వార్డులు ఉంటే, భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటయ్యే రెండోజోన్‌కు మధురవాడ జోన్‌గా, జోన్‌-3 కార్యాలయాన్ని ఇకపై తూర్పు జోన్‌ కార్యాలయంగా, జోన్‌-4 కార్యాలయాన్ని సౌత్‌జోన్‌గా, జోన్‌-5 కార్యాలయాన్ని పశ్చిమ జోన్‌గా, జోన్‌-6ని గాజువాక జోన్‌గా, జోన్‌-7ని అనకాపల్లి జోన్‌గా మార్చారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జోన్‌-8ని పెందుర్తి జోన్‌గా మార్చి, అదే నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే జోన్‌కు అగనంపూడి జోన్‌గా పేరుమార్చారు. ప్రస్తుతం ఉన్న అన్ని జోన్‌ల కార్యాలయాలకు భవనాలు ఉండగా నార్త్‌జోన్‌తోపాటు అగనంపూడి జోన్‌లకు మాత్రం కార్యాలయాల కోసం కొత్త భవనాలను గుర్తించాల్సి ఉండడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. కొత్తగా ఏర్పాటయ్యే పది జోన్‌లలో గాజువాక జోన్‌ 108.11 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో అతిపెద్దజోన్‌గా మారగా, 102.830 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో అగనంపూడి జోన్‌ రెండో అతిపెద్దగా జోన్‌గా, 9.698 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సౌత్‌జోన్‌ అత్యంత చిన్నజోన్‌గా మారింది.

Updated Date - Sep 26 , 2025 | 01:09 AM