కొత్త మండలం గుర్తేడు
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:35 AM
గుర్తేడు పేరిట జిల్లాలో కొత్తమండలం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఇటీవల కేబినెట్ భేటీలో ఆమోదం తెలపగా, గురువారం అందుకు సంబంధించిన జీవో(ఆర్‌టీ నెంబర్: 863)ను ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాలోని పాడేరు డివిజన్ పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి.. మొత్తం పదకొండు మండలాలున్నాయి.
- ఇకపై 23 మండలాలుకానున్న అల్లూరి జిల్లా
- జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వం
పాడేరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): గుర్తేడు పేరిట జిల్లాలో కొత్తమండలం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఇటీవల కేబినెట్ భేటీలో ఆమోదం తెలపగా, గురువారం అందుకు సంబంధించిన జీవో(ఆర్‌టీ నెంబర్: 863)ను ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాలోని పాడేరు డివిజన్ పరిధిలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి.. మొత్తం పదకొండు మండలాలున్నాయి. అలాగే రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరుం, అడ్డతీగల, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, గంగవరం మొత్తం.. ఏడు మండలాలున్నాయి. చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్.పురం.. నాలుగు మండలాలున్నాయి. దీంతో జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇప్పటికి 22 మండలాలున్నాయి. అయితే రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండే వై.రామవరం మండలంలో 137 గ్రామాలున్నాయి. దీంతో పాటు ఆయా గ్రామాలకు మండల కేంద్రం దూరంగా ఉండడంతో వై.రామవరాన్ని రెండు మండలాలుగా విభజించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వై.రామవరం మండలాన్ని రెండు మండలాలుగా ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తూ కేబినెట్‌లోనూ ఆమోదం తెలిపింది. దీంతో ఈ మండలంలో ఉన్న మొత్తం 137 గ్రామాల్లో 59 గ్రామాలను కలుపుతూ కొత్తగా గుర్తేడు కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఇకపై వై.రామవరం మండలంలో 78 గ్రామాలు, కొత్తగా ఏర్పడే గుర్తేడు మండలంలో 59 గ్రామాలుంటాయి. ఈ ప్రక్రియతో ఇన్నాళ్లుగా 22 మండలాలతో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఇకపై 23 మండలాలుగా మారనుంది. తమ ప్రాంత ఇబ్బందులను గుర్తించి వై.రామవరంలోని కొన్ని గ్రామాలతో ప్రత్యేకంగా గుర్తేడు మండలాన్ని ప్రకటించడంపై గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.