Share News

అమ్మవారి సన్నిధిలో కొత్త సంప్రదాయాలేల?

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:20 AM

కనకమహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ ముందు పంచాయితీ నడిచింది.

అమ్మవారి సన్నిధిలో కొత్త సంప్రదాయాలేల?

కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవోపై స్థానికుల ఫిర్యాదు

ఎమ్మెల్యే ఎదుట పంచాయితీ

రాత్రిపూట ఆలయం గేట్లకు తాళాలు వేస్తున్నారన్న నాయకులు

భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని అధికారులకు శాసనసభ్యుడి హితవు

విశాఖపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి):

కనకమహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ ముందు పంచాయితీ నడిచింది. వందేమాతరం గీతం 150 సంవత్సరాల కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే ఆలయానికి రాగా, స్థానిక నాయకులు వచ్చి ఈఓ శోభారాణి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. స్థానిక కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ఇతరులు పలు విషయాలు ప్రస్తావించారు.

కనకమహాలక్ష్మి స్వయంభూ అమ్మవారని, భక్తులు స్వయంగా అభిషేకాలు, పూజలు చేసుకుంటారని, అందుకు 24 గంటలు అవకాశం ఉండేదని, ప్రస్తుత ఈవో వచ్చిన తరువాత రాత్రి 11 గంటల తరువాత ఆలయ గేట్లకు తాళాలు వేసేస్తున్నారని ఫిర్యాదు చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా లేదని వారు పేర్కొన్నారు. స్థానికంగా ఉండే మత్స్యకారులు రాత్రి పూట వేటకు వెళ్లేముందు ఆలయానికి వచ్చి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వెళతారని, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. అమ్మవారి విగ్రహానికి వెండి తాపడం ఉందని, భద్రత కోసం తాళాలు వేస్తున్నామని ఈఓ శోభారాణి సమాధానం ఇవ్వగా, దానిని స్థానికులు ఖండించారు. రాత్రిపూట వెండి తాపడం తీసేస్తున్నారని స్పష్టంచేశారు.

తెల్లవారుజామున 5-6 గంటల మధ్య పూజారులు వచ్చి పూజలు చేశాకే ఇతరులను అమ్మవారి సన్నిధికి అనుమతించే సంప్రదాయం ఈవో తీసుకువచ్చారని ఫిర్యాదు చేశారు. అమ్మవారి దర్శనాలకు ఇలాంటి నిబంధనలు గతంలో ఎన్నడూ లేవన్నారు. అయ్యప్పస్వాములు తెల్లవారు జామున నాలుగు గంటలకు వస్తే వారిని మండపం దాటి ముందుకు వెళ్లనివ్వడం లేదని స్థానిక కార్పొరేటర్‌ దంపతులు ఫిర్యాదు చేశారు. అమ్మవారిపై పాలు, పెరుగు, కొబ్బరికాయల నీళ్లు నేరుగా వేసేవారమని, ఇప్పుడు ప్రత్యేక పాత్రలు పెట్టి...వాటిలో పోయమంటున్నారని, అవన్నీ నిండాక అమ్మవారి తలపై జల్లెడ పెట్టి అందులో పోస్తున్నారని వారంతా ఎమ్మెల్యేకు వివరించారు. ఈ ఆలయంలో భక్తులు ఎవరి పూజ వారు చేసుకునే సంప్రదాయం ఉందని, దానికి ఈఓ శోభారాణి అడ్డంకులు సృష్టిస్తున్నారని, కొత్త పద్ధతులు తొలగించి పాత విధానాల ప్రకారమే అన్నీ జరిగేలా చూడాలని వారు డిమాండ్‌ చేశారు. అన్నీ విన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌...భక్తుల మనోభావాలు, ఆలయ సంప్రదాయాల ప్రకారం ముందుకు వెళ్లాలని, స్థానికులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఈఓకు సూచించారు.

Updated Date - Nov 08 , 2025 | 01:20 AM