కైలాసగిరికి కొత్త రోప్‌వే
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:20 AM
కైలాసగిరి రోప్‌వేకు మార్పులు చేయాలని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అప్పుఘర్ సమీపానున్న రోప్‌వేను 2004 మే 5న ప్రారంభించారు. దాని పొడవు 375 మీటర్లు. 360 డిగ్రీల కోణంలో నగర అందాలను చూస్తూ కైలాసగిరిపైకి వెళ్లేలా దీనిని రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేశారు.
పాత రోప్‌వే స్థానంలో ఏర్పాటు
తెలుగు మ్యూజియం వరకూ నిర్మాణం
గతంలో ఒకసారి టెండర్లు
ఆశించిన స్థాయిలో రాకపోవడంతో మరోసారి పిలవాలని వీఎంఆర్‌డీఏ నిర్ణయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కైలాసగిరి రోప్‌వేకు మార్పులు చేయాలని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అప్పుఘర్ సమీపానున్న రోప్‌వేను 2004 మే 5న ప్రారంభించారు. దాని పొడవు 375 మీటర్లు. 360 డిగ్రీల కోణంలో నగర అందాలను చూస్తూ కైలాసగిరిపైకి వెళ్లేలా దీనిని రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేశారు. అప్పట్లో దీనిని బీఓటీ విధానంలో అప్పగించారు. కాలం 20 ఏళ్లు. అది పూర్తి కావడంతో రోప్‌వే ఆపేసి కొత్తది నిర్మించాలని ఇటీవల అధికారులు టెండర్లు పిలిచారు. ఈసారి ఒక్క రోప్‌వేనే కాకుండా దాంతో లూజ్ గ్రావిటీ రైడ్‌ను కూడా జోడించి టెండర్లు పిలిచారు. అప్పుఘర్ నుంచి కాకుండా తెన్నేటి పార్కు నుంచి కొండపైకి రోప్‌వే ద్వారా తీసుకువెళ్లి, అక్కడి నుంచి మళ్లీ తెలుగు మ్యూజియం వరకూ మరో రోప్‌వే వేయాలని డిజైన్ చేశారు. ఇలా మొత్తం రోప్‌వే పొడవు 1.5 కి.మీ వస్తుందని అంచనా వేశారు. ఆ తరువాత కొండ పైనుంచి భూమ్యాకార్షణ శక్తితో కిందికి వచ్చేలా లూజ్ గ్రావిటీ రైడ్లు కూడా పెట్టాలని గత ఆగస్టులో టెండర్లను ఆహ్వానించారు. ఈసారి పీపీపీ విధానంలో పెట్టారు. దీనికి రూ.60 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే అధికారులు ఆశించినట్టుగా టెండర్లు రాలేదు. కేవలం ఒక్కటెండర్ వచ్చింది. మరికొందరు గడువు పెంచాలని, వ్యయం ఎక్కువ అవుతుందని, ఆదాయం పెద్దగా రాదంటూ సూచనలు చేశారు.
మళ్లీ టెండర్లు పిలుస్తాం
ప్రణవ్ గోపాల్, చైర్మన్, వీఎంఆర్‌డీఏ.
తెన్నేటి పార్కు నుంచి రోప్‌వే పెట్టాలని అనుకున్నాం. అయితే ఇందులో భాగంగా చేసిన లూజ్ గ్రావిటీ రైడ్ లాభదాయకం కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. దానిని తొలగించి, కేవలం రోప్‌వే ఒక్కటే తెలుగు మ్యూజియం వరకూ వేయాలని అనుకుంటున్నారు. వ్యయం కూడా రూ.60 కోట్లు కావడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. దానిని కూడా తగ్గించి మళ్లీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పెట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించాము.