అడ్డరోడ్డులో కొత్త రెవెన్యూ డివిజన్
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:44 AM
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం జీఓ ఎంఎస్ నంబర్ 515ను జారీ చేశారు. కొత్త డివిజన్ ఏర్పాటుపై సుమారు నెల రోజులపాటు ప్రజల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా తుది నిర్ణయం తీసుకుంది.
ఏడు మండలాలతో ఏర్పాటు
అనకాపల్లి డివిజన్‌లో పది, నర్సీపట్నం డివిజన్‌లో ఏడు మండలాలు
నేడు అడ్డరోడ్డులో ఆర్డీవో కార్యాలయం ప్రారంభం
హాజరుకానున్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు
అనకాపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం జీఓ ఎంఎస్ నంబర్ 515ను జారీ చేశారు. కొత్త డివిజన్ ఏర్పాటుపై సుమారు నెల రోజులపాటు ప్రజల నుంచి స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా తుది నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి డివిజన్‌లోని ఎలమంచిలి, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలను, నర్సీపట్నం డివిజన్‌లోని పాయకరావుపేట, నక్కపల్లి, కోటవురట్ల, ఎస్.రాయవరం మండలాలను అడ్డరోడ్డులో ఏర్పాటు చేసే కొత్త రెవెన్యూ డివిజన్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇక నర్సీపట్నం డివిజన్‌లో వున్న చీడికాడ మండలాన్ని అనకాపల్లి డివిజన్‌లో చేర్చారు. దీంతో అనకాపల్లి డివిజన్‌లో అనకాపల్లి, కశింకోట, మునగపాక, సబ్బవరం, పరవాడ, చోడవరం, బుచ్చెయ్యపేట, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు.. మొత్తం 10 మండలాలు వుంటాయి. నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, రోలుగుంట, రావికమతం, మాడుగుల.. మొత్తం ఏడు మండలాలు మాత్రమే నర్సీపట్నం డివిజన్‌లో వుంటాయి.
తిమ్మాపురం పంచాయతీ భవనంలో ఆర్డీఓ కార్యాలయంం
ఎస్.రాయవరం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మండలంలోని అడ్డరోడ్డు కేంద్రంగా కొత్తగా ప్రకటించిన రెవెన్యూ డివిజన్ కార్యకలాపాలు బుధవారం నుంచే ప్రారంభం అవుతాయని తహశీల్దారు రమేశ్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన అడ్డరోడ్డులో మీడియాతో మాట్లాడుతూ, ఆర్డీవో కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ విజయకృష్ణన్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ హాజరుకానున్నట్టు చెప్పారు. అంతకుముందు ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు కోసం తిమ్మాపురం పంచాయతీ కార్యాలయం, సచివాలయం నిర్వహిస్తున్న రెండు అంతస్థుల భవనాన్ని నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, సర్పంచ్ కర్రి సత్యనారాయణ, వైస్‌ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు, టీడీపీ నియోజకవర్గం కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేశ్, టీడీపీ మండల అధ్యక్షుడు అమలకంటి అబద్ధంతో కలిసి పరిశీలించారు. ఇది అన్ని విధాలా అనుకూలంగా వుండడంతో అనంతరం ఆర్డీవో కార్యాలయం ఏర్పాటుకు సర్పంచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచాయతీ తీర్మానం చేయించారు. సచివాలయం, పంచాయతీ కార్యాలయం నిర్వహణకు పక్కనే కొత్తగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవనాన్ని కేటాయించారు. రెండు కార్యాలయాల రికార్డులు, కంప్యూటర్లు, ఇతర సామగ్రిని యుద్ధప్రాతిపదికన ఈ భవనంలోకి తరలించారు. ఆర్డీవో కార్యాలయం కోసం తీసుకున్న భవనానికి రంగులు వేయడం ప్రారంభించి, రాత్రికి పూర్తిచేశారు.