Share News

తాండవ కాలువలకు కొత్త రూపు

ABN , Publish Date - May 11 , 2025 | 12:54 AM

తాండవ ఆయకట్టు కాలువలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం సాగు నీటి వనరుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడమేకాకుండా సత్వరమే నిధులు సైతం మంజూరు చేస్తున్నది. దీంతో పంట కాలువల్లో పూడికతీత, మదుముల మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాండవ రిజర్వాయర్‌ నుంచి ఖరీఫ్‌కు సాగునీరు విడుదల చేసేనాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

తాండవ కాలువలకు కొత్త రూపు
నాతవరం మండలం మాధవనగరం వద్ద తాండవ కాలువలో పూడిక తీసిన తరువాత..

ఐదేళ్ల తరువాత పూడికతీత

ఉపాధి హామీ పథకం కింద శరవేగంగా పనులు

ఖరీఫ్‌ ఆరంభంనాటికి పూర్తిచేయాలని లక్ష్యం

ఆయకట్టు చివరి భూములకు తొలగనున్న సాగునీటి కష్టాలు

కూటమి ప్రభుత్వానికి రైతుల కృతజ్ఞతలు

నాతవరం, మే 10 (ఆంధ్రజ్యోతి): తాండవ ఆయకట్టు కాలువలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం సాగు నీటి వనరుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడమేకాకుండా సత్వరమే నిధులు సైతం మంజూరు చేస్తున్నది. దీంతో పంట కాలువల్లో పూడికతీత, మదుముల మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాండవ రిజర్వాయర్‌ నుంచి ఖరీఫ్‌కు సాగునీరు విడుదల చేసేనాటికి ఈ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క ఏడాది కూడా తాండవ రిజర్వాయర్‌ పంట కాలువలు పూడికతీతకు నోచుకోలేదు. ఎక్కడికక్కడ తూటుకాడ, మట్టి, పిచ్చిమొక్కలు పెరిగిపోయి నీటి ప్రవాహం మందగించింది. దీనివల్ల ఆయకట్టు చివరి భూములకు సకాలంలో నీరు అందని పరిస్థితి నెలకొంది. దీనివల్ల దమ్ము, వరినాట్లు పనులు ఆలస్యం అయ్యేవి. అంతేకాక పొట్ట, కంకి దశల్లో నీటి ఎద్దడికి గురై ధాన్యం దిగుబడి తగ్గిపోతున్నది. కాలువల్లో పూడికలు తీయించి సాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించాలని తాండవ రైతులు నాటి పాలకులు, అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ ఒక్క ఏడాది కూడా పూడిక తీయించిన పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి రావడంతో రైతుల ఆశలు చిగురించాయి. తాండవ కాలువలో పూడిక తీయించాలని నర్సీపట్నం ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్‌ అయిన సీహెచ్‌ అయ్యన్నపాత్రుడుని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయన ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల మంత్రులతో మాట్లాడి, ఉపాధి హామీ పథకం కింద తాండవ కాలువల్లో పూడిక తీయించేలా కృషి చేశారు. దీంతో రూ.1.5 కోట్లతో తాండవ కుడి, ఎడమ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టారు. గట్లపై తుప్పలను నరికివేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయ్యాయి. కొత్త రూపును సంతరించుకున్న పంట కాలువలను చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కోసం గత ఐదేళ్లపాటు పడి కష్టాలు తొలగినట్టేనని అన్నదాతలు చెబుతున్నారు. కాగా మదుములు, అక్విడక్టులకు కూడా మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - May 11 , 2025 | 12:54 AM