విద్యాలయాలకు కొత్త రూపు
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:58 PM
జిల్లాలో గిరిజన విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి విద్యాలయానికి అవసరమైన సదుపాయాలు సమకూర్చేందుకు సుమారుగా రూ.200 కోట్ల వ్యయం చేస్తున్నది.
రూ.200 కోట్లతో వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు
జిల్లాలోని ప్రతి పాఠశాలకు భవన సదుపాయం
వచ్చే విద్యా సంవత్సరం నాటికి గిరి విద్యార్థులకు సదుపాయాల కల్పనే లక్ష్యం
గిరిజన ప్రాంత విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేసిన గత వైసీపీ ప్రభుత్వం
తాజాగా రూ.కోట్లలో నిధుల విడుదలతో మహర్దశ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో గిరిజన విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి విద్యాలయానికి అవసరమైన సదుపాయాలు సమకూర్చేందుకు సుమారుగా రూ.200 కోట్ల వ్యయం చేస్తున్నది. ప్రతి పాఠశాలకు భవన సౌకర్యంతో పాటు ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాల్లో సైతం సంపూర్ణ సదుపాయాలు కల్పించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రతి పాఠశాలలోని మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో జిల్లా అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు.
గత వైసీపీ పాలనలో జిల్లాలోని ఒక్క పాఠశాలకు కూడా భవనాన్ని నిర్మించిన దాఖలాలు లేవు. నాడు- నేడు పేరిట తొలి విడతలో కేవలం పది శాతం విద్యాలయాలకు మరమ్మతులు మాత్రమే చేపట్టి, రెండో విడతలో నిధుల కొరత కారణంగా ఎక్కడ పనులు అక్కడ నిలిపివేశారు. దీంతో విద్యాలయాల్లో అసంపూర్తి పనులతో అవన్నీ అధ్వానంగా మారాయి. ఇక మారుమూల ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో దుస్థితిని చెప్పనక్కర్లేదు. గ్రామస్థుల శ్రమదానంలో నిర్మించే రేకుల షెడ్డుల్లోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేయాల్సిన దుస్థితి ఇన్నాళ్లూ కొనసాగింది. అలాగే ప్రతి ఏడాది ఆశ్రమ పాఠశాలల్లో చేపట్టే నిర్వహణ/మరమ్మతుల పనులను గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు చేపట్టలేదు. దీంతో ఆశ్రమ పాఠశాలలు మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారాయి. ఈ క్రమంలో గిరిజన విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. ఈ సమస్యలపై విద్యా సంఘాలు అనేక ఆందోళనలు చేపట్టినప్పటికీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.
జిల్లాలో విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. దీంతో ప్రస్తుతం జిల్లాలోని విద్యాలయాల స్థితిగతులను, వాటి అభివృద్ధికి, మెరుగుపరిచేందుకు చేపటాల్సిన చర్యలపై కలెక్టర్ నుంచి వివరాలను రప్పించుకుని, అందుకు అవసరమైన నిధులను మంజూరు చేసింది. గిరిజన ప్రాంత అవసరాలను గుర్తించి కొత్త పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు, జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసిన కస్తూర్బా బాలికల విద్యాలయాలకు అవసరమైన భవనాలను మంజూరు చేసింది. ఆరు నెలల క్రితమే అందులో కొన్ని భవనాలకు నిధులు మంజూరు కాగా, వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే ఈ ఏడాది ఆదివాసీ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర ఐటీ, మానవవనరుల శాఖల మంత్రి నారా లోకేశ్ ఏజెన్సీలోని గూడు లేని పాఠశాలలకు రూ.46 కోట్లను మంజూరు చేయగా, గిరిజన సంక్షేమ శాఖలోని విద్యాలయాలకు 39 వసతి గృహాలను మంజూరు చేశారు.
కూటమి పాలనలో మంజూరైన నిధులు
- జిల్లా వ్యాప్తంగా గూడు లేని 373 పాఠశాలల భవన నిర్మాణాలకు రూ.46 కోట్లు
- 12 ప్రాథమిక పాఠశాలలకు అదనపు తరగతి గదులకు రూ.2 కోట్లు
- 18 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో కళాశాల భవనాలకు రూ.30 కోట్లు
- జిల్లా వ్యాప్తంగా 55 విద్యాలయాలకు అనుబంధంగా వసతి గృహాల నిర్మాణానికి రూ.102 కోట్లు
- 43 బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.50 లక్షలు
- 94 విద్యాలయాలకు విద్యుత్ సదుపాయానికి రూ.22 లక్షలు
- 4 బాలికల పాఠశాలల్లో వసతి గృహాల నిర్మాణానికి రూ.11 కోట్లు
- పీఎంశ్రీ పథకంలో ఎంపిక చేసిన 23 పాఠశాలల మరమ్మతులు, అదనపు భవనాలు, క్రీడా మైదానాలకు రూ.5 కోట్లు
- జిల్లాలో టైప్- 4గా ఎంపిక చేసిన చింతపల్లి, అరకు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, కొయ్యూరులోని కేజీబీవీలకు ఒక్కొక్క దానికి రూ.2 కోట్లు చొప్పున మొత్తం రూ.10 కోట్లు మంజూరు