Share News

టీడీపీకి కొత్త సారథులు

ABN , Publish Date - Dec 22 , 2025 | 01:18 AM

తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు కమిటీకి కొత్త సారథులు వచ్చారు. పార్లమెంటు కమిటీ అధ్యక్షుడిగా చోడేవెంకట పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణను నియమించారు.

టీడీపీకి కొత్త సారథులు

విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా చోడే వెంకట పట్టాభిరామ్‌, ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణ

ప్రకటించిన పార్టీ అధిష్ఠానం

సీనియర్లకు పెద్దపీట వేసి బాధ్యతలు అప్పగింత

విశాఖపట్నం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):

తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు కమిటీకి కొత్త సారథులు వచ్చారు. పార్లమెంటు కమిటీ అధ్యక్షుడిగా చోడేవెంకట పట్టాభిరాం, ప్రధాన కార్యదర్శిగా లొడగల కృష్ణను నియమించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదివారం అధికారిక ప్రకటన చేసింది.

ప్రస్తుతం పార్లమెంటు అధ్యక్షుడిగా గండి బాబ్జి, ప్రధాన కార్యదర్శిగా పొలమరశెట్టి శ్రీనివాసరావు ఉన్నారు. సంస్థాగత ఎన్నికల్లో వార్డు/గ్రామ కమిటీ నుంచి జిల్లా కమిటీ వరకు మార్పులుచేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. అదే సమయంలో అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని బాబ్జి చెప్పారు. దీంతో మూడు నెలల క్రితం ముగ్గురు సభ్యుల కమిటీ పార్టీ జిల్లా కార్యాలయంలో కొత్త సారఽఽథుల ఎంపికపై అభిప్రాయసేకరణ చేపట్టింది. అధ్యక్ష పదవికి విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన చోడే పట్టాభిరామ్‌, మహ్మద్‌ నజీర్‌, లొడగల కృష్ణ తరఫున పలువురు కమిటీకి నివేదించారు. పట్టాభిరామ్‌ కోసం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గట్టిగా ప్రయత్నించి మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీ భరత్‌ మద్దతు కూడగట్టారు. దీంతో పార్టీలో సీనియర్‌ అయిన పట్టాభికి అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు వారం క్రితమే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొన్ని పార్లమెంటు కమిటీ సారథుల నియామకంలో మార్పులు చేయాల్సి రావడంతో ఆదివారం అధికారికంగా పేర్లు ప్రకటించారు.

సీనియర్లకు పట్టం

పార్టీ సీనియర్లకు విశాఖ పార్లమెంటు కమిటీ సారథులగా నియమించి అధిష్ఠానం వారికి పెద్దపీట వేసింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పట్టాభి, లొడగల కృష్ణ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్నవారే. తూర్పు నియోజవర్గానికి చెందిన పట్టాభికి అధిష్ఠానంతో పాటు సీనియర్‌ నేతలతో సత్సంబంధాలున్నాయి. కోనసీమ జిల్లా కె. గంగవరం మండలం ఎండగండి గ్రామానికి చెందిన పట్టాభి సివిల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు. వ్యాపార రీత్యా సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నగరానికి వచ్చి కాంట్రాక్టరుగా వృత్తి జీవితం ప్రారంభించారు. అదే సమయంలో తెలుగుదేశంలో చేరి జిల్లా నాయకులతో కలిసి పనిచేశారు. చాలాకాలం పార్టీలో కొనసాగిన పట్టాభి 2007లో విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఎనిమిదో వార్డు నుంచి టీడీపీ కార్పొరేటరుగా విజయం సాధించారు. జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్‌లీడరుగా పనిచేశారు. ఆ తరువాత 2013 నుంచి 2018వరకు అర్బన్‌ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2023లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీపడినా సామాజిక సమీకరణల నేపథ్యంలో అవకాశం దక్కలేదు. గత ఏడాది ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పట్టాభికి టీటీడీ లోకల్‌ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా నియమించింది. తాజాగా పార్లమెంటు అధ్యక్ష పదవి కట్టబెట్టి సీనియార్టీకి గుర్తింపు ఇచ్చింది. ప్రధాన కార్యదర్శిగా నియమితులైన లొడగల కృష్ణ ఉత్తర నియోజకవర్గానికి చెందిన నాయకుడు. విద్యార్థి నేతగా తెలుగుదేశం పార్టీలో చేరిన లా పట్టభద్రుడు. అర్బన్‌ జిల్లా తెలుగుయువత అధ్యక్షుడిగా పనిచేసిన తరువాత రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పదవిని పొందారు.

సమన్వయంతో పార్టీని బలోపేతం చేస్తా

విశాఖ పార్లమెంటు అధ్యక్షుడిగా నియమించడం ఆనందంగా ఉంది. చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషిచేస్తాను. ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, సీనియర్‌ నాయకులు, కేడర్‌తో కలిసి పనిచేస్తా. కిందిస్థాయి కేడర్‌ ఇబ్బందులను తెలుసుకుని ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తా. అధిష్ఠానం ఆదేశించిన కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తా. ప్రభుత్వ పథకాలపై కేడర్‌తో కలిపి ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తా. వచ్చే ఏడాది జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా పనిచేయడమే ధ్యేయం. మూడు పార్టీల నేతలతో ఇప్పటినుంచే సమన్వయం చేసుకుంటా. పార్టీ అధ్యక్ష పదవి అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు.

- చోడే వెంకట పట్టాభిరామ్‌

Updated Date - Dec 22 , 2025 | 01:18 AM