సేనలో నూతనోత్సాహం
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:15 AM
‘సేనతో సేనాని’ పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నగరంలోని ఇందిరాప్రియదర్శిని మునిసిపల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన సభ సూపర్ సక్సెస్ అయింది.
సేనాని ప్రసంగానికి హర్షధ్వానాలతో మార్మోగిన మునిసిపల్ స్టేడియం
జనసేన ‘సేనతో సేనాని’ సభ సూపర్ సక్సెస్
భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):
‘సేనతో సేనాని’ పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నగరంలోని ఇందిరాప్రియదర్శిని మునిసిపల్ స్టేడియంలో శనివారం నిర్వహించిన సభ సూపర్ సక్సెస్ అయింది. అంచనాకు మించి భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పవన్ ప్రసంగానికి జేజేలు కొడుతూ అరుపులు, కేకలు, చప్పట్లతో స్టేడియం మార్మోగింది. పవన్ ప్రసంగం కేడర్‌లో నూతనోత్తేజం నింపింది.
జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహించిన తొలి బహిరంగ సమావేశం కావడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సభలో పవన్ కల్యాణ్ గతానికి భిన్నంగా ప్రసంగించారు. పార్టీ కార్యకర్తలకు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించడంతో పాటు వారిని నాయకులుగా తీర్చిదిద్దేందుకు తన వద్దనున్న ప్రణాళికలను సుదీర్ఘంగా వివరించారు. వైసీపీ హయాంలో సాగించిన పోరాటాన్ని మననం చేసుకుంటూనే భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనుకుంటున్నదీ వివరించారు. ఇందుకోసం కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని, వారిని నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని, అందుకు పదేళ్ల సమయం పడుతుందని పవన్ స్పష్టం చేశారు. అధినేత ప్రసంగానికి జనసైనికులు, వీర మహిళలు ఆద్యంతం ఈలలు, చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ తరహా సభను కార్యకర్తలతో నిర్వహించడం, అది విజయవంతం కావడంతో పార్టీ నాయకులు, శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
సభను ప్రారంభించిన వీర మహిళ
సాధారణంగా సభలను పార్టీ ముఖ్య నేతలు ప్రారంభిస్తారు. దానికి భిన్నంగా ‘సేనతో సేనాని’ సభను వీరమహిళ గోవిందమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నోవాటెల్ హోటల్‌లో పవన్‌ను దిగ్బంధించిన సమయంలో ఆమె మూడేళ్ల చంటి బిడ్డతో జనసేన జెండా పట్టుకుని రాత్రంతా దీక్ష చేసింది. సభా ప్రాంగణంలో మధ్యాహ్నం 4.22 గంటలకు ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం 6.21 వరకు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. అదే సమయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాంగణానికి చేరుకున్నారు.
పార్టీని బలోపేతం చేయాలి
తొలుత రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన పలువురు క్రియాశీలక కార్యకర్తలు సభలో ప్రసంగించారు. రమేష్ అనే కార్యకర్త మాట్లాడుతూ పిల్లసేన, కోతి సేన అన్నవారికి లంకా దహనం ఎలా ఉంటుందో చూపించామన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన కార్యకర్త శ్రీకాంత్ మాట్లాడుతూ అసాధ్యాలను సుసాధ్యం చేయడం జనసైనికులకు మాత్రమే సొంతమన్నారు. భీమవరానికి చెందిన విజయలక్ష్మి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో జనసేనకు విజయం దక్కలేదని, అయితే 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో తమ ప్రాంతంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, జడ్పీటీసీ సభ్యులు గెలుపొందడం ద్వారా సాధారణ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి బాటలు వేశామన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రతి గుడిసెపై జనసేన జెండా ఎగురుతుందని ఆ ప్రాంతానికి చెందిన శివ అన్నారు. శ్రీకాకుళానికి చెందిన విష్ణు ప్రియాంక మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ వలనే ఉద్దానం సమస్య ప్రపంచానికి తెలిసిందని, అక్కడ ఇంకా అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషిచేయాలని కోరారు. అనంతరం ఆమె పవన్‌కు వినతిపత్రం ఇచ్చారు.
కర్ణాటక జెండా, కండువాతో పవన్..
పవన్ వేదికపైకి రాగానే అభిమానులు ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటక నుంచి వచ్చిన పలువురు కార్యకర్తలు పెద్దఎత్తున కేకలు వేస్తూ తమ రాష్ట్ర అధికారిక జెండాలను ప్రదర్శించారు. వారిని చూసిన పవన్ కల్యాణ్ కర్ణాటక జెండా, జనసేన జెండాతో కలిపి పట్టుకుని, మెడలో కర్ణాటక రాష్ట్ర జెండా రంగుతో కూడిన కండువాను వేసుకున్నారు. అనంతరం ఒడిశా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితోనూ పవన్ ఫొటోలు దిగారు. పవన్ కల్యాణ్ ప్రసంగం అనంతరం మత్స్యకారులు చేప, వల, పడవ చిత్రాన్ని ఆయనకు బహూకరించారు. పవన్ కల్యాణ్ చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకున్న మత్సకార యువకుడితో పవన్ ఫొటో దిగారు. అనంతరం మృతిచెందిన కార్యకర్తల కుటుంబసభ్యులకు చెక్కులను అందించారు.
అంతా ఒకేమాటపై ఉండాలి
వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
పార్టీ శ్రేణులకు పవన్‌కల్యాణ్ దిశా నిర్దేశం
విశాఖలో ముగిసిన జనసేన సమావేశాలు
విశాఖపట్నం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో జనసేన పార్టీ మూడు రోజులు నిర్వహించిన సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. క్రియాశీలక కార్యకర్తలతో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సమావేశానికి ఏపీతో పాటు తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జనసేన పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని విశాఖ వేదిక పైనుంచి అధినేత పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు. పదవి వచ్చాక పార్టీని పట్టించుకోవడం లేదని ప్రచారం చేశారని, వాస్తవానికి తనకు పరిపాలనపై పట్టు సాధించడానికే పది నెలల సమయం పట్టిందన్నారు. ఇకపై పార్టీ వ్యవహారాలను తానే చూస్తానని, నెలకు పది రోజులు కేటాయిస్తానని, మండల స్థాయి నాయకులను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు నాయకులుగా ఎదగాలని, దానికి కష్టనష్టాలకు ఓర్చుకునేలా తయారుకావాలని హితబోధ చేశారు. వైసీపీ చేసే విమర్శలను, దుష్ప్రచారాన్ని అంతా కలిసికట్టుగా తిప్పి కొట్టాలని, ఈ విషయంలో అంతా ఒక మాటమీదే ఉండాలని సూచించారు. తొలిరోజు బే వ్యూ హోటల్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. పార్టీ నాయకులు కొంతమంది పద్ధతి మార్చుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. రెండో రోజు రుషికొండలో వైసీపీ రూ.453 కోట్లతో నిర్మించిన ప్యాలెస్‌ను పరిశీలించి, దానిని ఈ శీతాకాలంలోనే వినియోగంలోకి తీసుకువస్తామని ప్రకటించారు. అనంతరం బే వ్యూ హోటల్‌లో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆగిందని, అయినప్పటికీ కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, దానిని తిప్పికొట్టాలని నాయకులకు పిలుపునిచ్చారు. కూటమిలో విభేదాలు వద్దని, అది పార్టీతో పాటు రాష్ట్రానికి తద్వారా ప్రజలకు కూడా నష్టమని స్పష్టంచేశారు. ఇంకో పదిహేనేళ్లు కూటమితో కలిసి ప్రయాణం చేయాల్సి ఉందని స్పష్టంచేశారు. ఈ సమావేశాల నిర్వహణకు 12 కమిటీలను వేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయకుమార్, డీసీసీబీ అధ్యక్షుడు కోన తాతారావు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.