Share News

రూసా 2.0 నిధులపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Dec 21 , 2025 | 01:22 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మంజూరైన రూసా 2.0 నిధులను వినియోగించుకోవడంలో పాలకులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.

రూసా 2.0 నిధులపై నిర్లక్ష్యం

ఏయూకు 2017లో రూ.100 కోట్లు మంజూరు

అందులో కేంద్రం వాటా రూ.60 కోట్లు, రాష్ట్ర వాటా రూ.40 కోట్లు

రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడంతోకేంద్రం నిధులు పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి

వచ్చే మార్చిలోగా ఆ నిధులు వినియోగించాలని కేంద్రం ఆదేశాలు

మ్యాచింగ్‌ గ్రాంటు విడుదలకు ముందుకొచ్చిన మంత్రి నారా లోకేశ్‌

....అయినా రూ.30 కోట్ల విడుదలకు సాంకేతిక ఇబ్బందులు ఉన్నట్టు చెబుతున్న అధికారులు

ప్రత్యేక చొరవ తీసుకోనట్టయితే నిధులు మురిగిపోయే ప్రమాదం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మంజూరైన రూసా 2.0 నిధులను వినియోగించుకోవడంలో పాలకులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. సుమారు ఎనిమిదేళ్ల కిందట మంజూరైన నిధులను వినియోగించుకోకపోవడంతో ఇప్పుడు రూ.30 కోట్లు మురిగిపోయే పరిస్థితి నెలకొంది. విశ్వవిద్యాలయాల్లో పరిశోధన, బోధన సామర్థ్యాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ శిక్ష అభియాన్‌ (రూసా) కింద నిధులను మంజూరుచేస్తోంది. 2017లో ఏయూకు రూ.100 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో కేంద్రం వాటా రూ.60 కోట్లు కాగా, రాష్ట్ర వాటాగా రూ.40 కోట్లు మ్యాచింగ్‌ గ్రాంటును ఇవ్వాల్సి ఉంటుంది.

డీపీఆర్‌లో పేర్కొన్న అంశాలపైనే వెచ్చించాలి

రూసా 2.0 నిధులు ఎటువంటి కార్యకలాపాలకు (కాంపోనెంట్స్‌) ఖర్చు చేస్తారన్న వివరాలతో కూడిన డీపీఆర్‌ను వర్సిటీ అధికారులు అందించారు. డీపీఆర్‌లో పేర్కొన్న కాంపోనెంట్స్‌పై మాత్రమే నిధులు వెచ్చించాలి. డీపీఆర్‌లో పేర్కొన్న దాని ప్రకారం వర్సిటీలో బాయ్స్‌, గర్ల్స్‌ హాస్టల్స్‌ నిర్మాణానికి రూ.7.32 కోట్లు, డ్రైనేజీ సదుపాయాల కల్పనకు రూ.3 కోట్లు, భవనాల ఆధునికీకరణకు రూ.3 కోట్లు, ఆర్‌ అండ్‌ డి బిల్డింగ్‌ నిర్మాణానికి రూ.8.45 కోట్లు, న్యూ ఎంబీఏ ప్రోగ్రామ్‌ అమలుకు రూ.15 కోట్లు, పేటెంట్స్‌ కోసం రూ.3 కోట్లు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌, ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ల నిర్వహణకు రూ.3 కోట్లు, ఫారిన్‌ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌కు రూ.4 కోట్లు, అవుట్‌రీచ్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహణకు రూ.50 లక్షలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.5 కోట్లు, డ్రగ్‌ అండ్‌ టెస్టింగ్‌ లేబొరేటరీలో సిబ్బంది నియామకానికి, జీతభత్యాలకు రూ.1.5 కోట్లు, స్టార్టప్‌ అండ్‌ రీసెర్చ్‌ గ్రాంట్‌ ఫర్‌ ఫ్యాకల్టీకి రూ.5 కోట్లు, ఎక్సటెన్షన్‌ ఔట్‌ రీచ్‌ యాక్టివిటీస్‌కు రూ.5 కోట్లు, ఎంటర్‌ప్రైజెస్‌ రీసోర్స్‌ ప్లానింగ్‌కు రూ.10 కోట్లు, రీసెర్చ్‌ వర్క్‌లు, ఇతర కార్యలకాపాల నిర్వహణకు మిగిలిన మొత్తాన్ని వెచ్చించాలి.

అయితే, కేంద్రం నిధులు అందించేందుకు ముందుకువచ్చినా రాష్ట్రంలో పాలకులు మ్యాచింగ్‌ గ్రాంటు విడుదల చేయకపోవడంతో ఆ నిధులను పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎనిమిదేళ్లు దాటినా కేంద్రం ఇచ్చిన రూ.60 కోట్లలో ఇప్పటివరకూ రూ.25 కోట్లు మాత్రమే వినియోగించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మ్యాచింగ్‌ గ్రాంటు కింద వర్సిటీ బడ్జెట్‌ నుంచి సుమారు రూ.15 కోట్లు వెచ్చించి రూసా నిధులు మురిగిపోకుండా జాగ్రత్తపడుతూ వచ్చారు. ఇప్పటివరకూ డైనేజీల నిర్మాణం, ఓల్డ్‌ బిల్డింగ్‌ ఆధునికీకరణ, ఆర్‌ అండ్‌ డి బిల్డింగ్‌ నిర్మాణం, న్యూ ఎంబీఏ ప్రోగ్రామ్‌ అమలు, కాన్ఫరెన్స్‌ల నిర్వహణ వంటి కాంపోనెంట్స్‌పై రూ.40 కోట్లను ఖర్చు చేశారు.

తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మ్యాచింగ్‌ గ్రాంటు విడుదల చేసేందుకు సన్నద్ధం కావడంతో సుమారు రూ.30 కోట్లు పనులను పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే పూర్తిచేసిన పనులకు సంబంధించి సుమారు రూ.15 కోట్ల వరకూ బిల్లులను చెల్లించాలనుకున్నారు. మరో రూ.15 కోట్లతో ఇతర పనులు చేపట్టాలనుకున్నారు. అయితే, ఆ రూ.30 కోట్ల విడుదలకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. అందులో రూ.25 కోట్లు ఫారిన్‌ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ, ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం, స్టార్టప్‌ అండ్‌ రీసెర్చ్‌ గ్రాంట్స్‌ ఫర్‌ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్‌, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ వంటి వాటి నిర్వహణకు వెచ్చించాల్సి ఉంది. ఇవన్నీ ఇప్పటికిప్పుడు చేసే అవకాశం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు ఇచ్చేందుకు ముందుకువచ్చినా, నిధుల విడుదలపై సందిగ్ధం నెలకొంది. ప్రత్యేక చొరవ తీసుకోనట్టయితే ఆ రూ.30 కోట్లు మురిగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలోగా రూసా 2.0 నిధులు వినియోగించుకోవాలని, లేదంటే కేంద్రం నుంచి భవిష్యత్తులో రావాల్సిన నిధులు నిలిపివేస్తామని ఇప్పటికే కేంద్రం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

వీటికి వెచ్చించిన అధికారులు..

రూసా నిధులతో వర్సిటీలను అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. ఏయూలో నెలకొన్న ఇబ్బందులను అప్పట్లోనే ఆయన దృష్టికి వర్సిటీ అధికారులు తీసుకువెళ్లి ఉన్నట్టయితే ఇప్పుడు సమస్య ఉత్పన్నమయ్యేది కాదని చెబుతున్నారు. ఈ ప్రభావం పీఎం ఉషా ప్రోగ్రామ్‌ కింద కేంద్రం మూడో విడతలో ఇవ్వాల్సిన నిధులపై పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - Dec 21 , 2025 | 01:22 AM