Share News

పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:22 AM

ప్రమాదానికి గురై గాయాలపాలైన ఒక మహిళకు వైద్యం అందించడంలో పెదబయలు పీహెచ్‌సీ సిబ్బంది తాత్సారం చేశారు.

పీహెచ్‌సీ సిబ్బంది నిర్లక్ష్యం
వైద్యాధికారిణితో మాట్లాడుతున్న ఎంపీడీవో శ్యామ్‌సుందరరావు

ప్రమాదానికి గురైన మహిళకు వైద్య సేవలు అందించడంలో జాప్యం

ఎంపీడీవో ఆదేశంతో బాధితురాలికి చికిత్స

పెదబయలు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రమాదానికి గురై గాయాలపాలైన ఒక మహిళకు వైద్యం అందించడంలో పెదబయలు పీహెచ్‌సీ సిబ్బంది తాత్సారం చేశారు. ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో స్పందించడంతో బాధితురాలికి వైద్యం అందించిన ఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. సీతగుంట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామానికి చెందిన గూబురి లింగమ్మ సోమవారం మధ్యాహ్నం వారపు సంతకు నడిచి వెళుతోంది. ఆ సమయంలో వెనుక వస్తున్న పశువులు ఆమెను తరుముకుంటూ రావడంతో కింద పడిపోయింది. ఆమెను తొక్కుకుంటూ పశువులు వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న ఆమె బంధువులు వెంటనే పెదబయలు పీహెచ్‌సీకి తరలించారు. ఆ సమయంలో వైద్య సిబ్బంది తలుపులు వేసుకుని ఉన్నారు. ఎంత సేపటికి రాకపోవడంతో బాధితురాలి భర్త అయిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు జి.నీలకంఠం వైద్యాధికారిణి సత్యశ్రీని ప్రశ్నించారు. భోజనం చేస్తున్నామని, అప్పటి వరకు వేచి ఉండాలని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. దీంతో ఆయన ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్‌ మాధవరావు, ఎంపీటీసీ సభ్యుడు బొంజుబాబు, ఎంపీడీవో శ్యామ్‌సుందరరావుకు ఫోన్లో చెప్పారు. ఎంపీడీవో శ్యామ్‌సుందరరావు అక్కడికి వచ్చి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన సిబ్బంది బాధితురాలికి వైద్య సేవలు అందించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిబ్బందిని ఎంపీడీవో హెచ్చరించారు.

Updated Date - Dec 16 , 2025 | 12:22 AM