Share News

అధికారుల నిర్లక్ష్యం..విద్యార్థులకు శాపం

ABN , Publish Date - Jun 06 , 2025 | 10:49 PM

అరకు ఏకలవ్య మోడల్‌ ఆశ్రమోన్నత పాఠశాలను ఎనిమిది నెలల క్రితం అట్టహాసంగా ప్రారంభించినా నేటికీ భవన సముదాయాలు అందుబాటులోకి రాలేదు. దీంతో అరకొర వసతులతో యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో మూడు ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం..విద్యార్థులకు శాపం
అరకులోయ ఏకలవ్య మోడల్‌ ఆశ్రమోన్నత పాఠశాల తరగతుల భవనం

అరకు ఏకలవ్య పాఠశాలను ప్రారంభించిన ప్రధానమంత్రి

ఎనిమిది నెలలైనా సొంత గూటికి చేరని విద్యార్థులు

యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఇబ్బంది పడుతున్న

మూడు ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు

బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ భవనాలు అప్పగించని కాంట్రాక్టర్‌

కలెక్టర్‌, ఐటీడీఏ పీవో జోక్యం చేసుకోవాలని తల్లిదండ్రులు వినతి

అరకులోయ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): అరకు ఏకలవ్య మోడల్‌ ఆశ్రమోన్నత పాఠశాలను ఎనిమిది నెలల క్రితం అట్టహాసంగా ప్రారంభించినా నేటికీ భవన సముదాయాలు అందుబాటులోకి రాలేదు. దీంతో అరకొర వసతులతో యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో మూడు ఏకలవ్య పాఠశాలల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అసలు విషయమేమింటే.. నూతన భవనాల బిల్లులు చెల్లింపుల విషయంలో ఏర్పడిన అనిశ్చితి వల్ల కాంట్రాక్టర్‌ భవనాలను అప్పగించలేదు. వివరాల్లోకి వెళితే..

అరకులోయలో ఏకలవ్య మోడల్‌ ఆశ్రమోన్నత పాఠశాల భవన సముదాయాలను బొండాం పంచాయతీ మజ్జివలస గ్రామంలోని 15 ఎకరాల్లో రూ.20 కోట్లతో నిర్మించారు. తరగతులు నిర్వహించే ప్రధాన భవనం, బాల, బాలికలకు వేర్వేరుగా వసతిగృహ భవనాలు, వేర్వేరుగా డైనింగ్‌ హాల్‌, వంటశాలు నిర్మించారు. బాల, బాలికల పర్యవేక్షణకు ఇద్దరు వార్డెన్‌ల నివాసగృహాలను నిర్మించారు. వీటిని 2024 అక్టోబరు రెండో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌లో ప్రారంభించారు. దీంతో విద్యార్థులకు పూర్తి స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు సంబరపడ్డారు. కానీ ఎనిమిది నెలలైనా ఆ భవనాలు అందుబాటులోకి రాలేదు. నూతన భవనాలు నిర్మాణాల్లో ఉండడంతో అరకులోయ యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల ఏకలవ్య మోడల్‌ ఆశ్రమోన్నత పాఠశాలలను నిర్వహిస్తున్నారు. డుంబ్రిగుడ, అనంతగిరిల్లో భవనాలు నిర్మిస్తుండగా.. అరకులోయలో భవనాల నిర్మాణాలు పూర్తి కావడంతో 2024 అక్టోబరు 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయినప్పటికీ సొంత భవనాల్లోకి అరకులోయ ఏకలవ్య పాఠశాలను తరలించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

భవనాలు అప్పగించని కాంట్రాక్టర్‌

అరకులోయ ఏకలవ్య మోడల్‌ ఆశ్రమోన్నత పాఠశాల భవనాలను నిర్మించిన కాంట్రాక్టర్‌ వాటిని అధికారులకు అప్పగించలేదు. తాను అదనంగా వ్యయం చేసిన రూ. రెండు కోట్ల బిల్లులు కాకపోవడంతో భవనాలను కాంట్రాక్టర్‌ అప్పగించడం లేదు. వాస్తవానికి ఆ భవనాల నిర్మాణానికి అదనంగా రూ.రెండు కోట్లు అదనపు వ్యయం అవుతుందని అంచనా ఉందని అంటున్నారు. అయితే రెండు కోట్ల రూపాయల విలువైన పనులు చేసేటప్పుడు అధికారుల అనుమతులు తీసుకోలేదని అంటున్నారు. అందువల్ల ఆ నిధులు విడుదలపై అనిశ్చితి నెలకొంది. ఈ విషయంలో అధికారులు, కాంట్రాక్టర్‌ చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని, లేకుంటే ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని, అలా చేయకుండా ప్రధానమంత్రితో ప్రారంభింపజేసి భవనాలు అప్పగించకుండా జాప్యం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీవో స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - Jun 06 , 2025 | 10:49 PM