నకిలీ సర్టిఫికెట్ల గుర్తింపుపై నిర్లక్ష్యం
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:51 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని పలు డిగ్రీ కాలేజీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పదుల సంఖ్యలో చేరుతున్నారు.
పలు డిగ్రీ కళాశాలల్లో ఇతర రాష్ర్టాల విద్యార్థులకు అడ్మిషన్లు
అందులో పలువురు నకిలీ ధ్రువపత్రాలు
సమర్పిస్తున్నట్టు ఫిర్యాదులు
ఇతర ప్రాంతాల వారి సర్టిఫికెట్లు తమకు పంపాలని గత నెల ఏయూ అధికారుల ఆదేశం
ఆదేశాలను పట్టించుకోని కాలేజీలు
విశాఖపట్నం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని పలు డిగ్రీ కాలేజీల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పదుల సంఖ్యలో చేరుతున్నారు. అయితే, ఈ తరహా ప్రవేశాలు పొందుతున్న వారిలో కొందరు ఫేక్ సర్టిఫికెట్లను సమర్పిస్తున్నారు. ఈ విషయమై వర్సిటీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో ప్రత్యేకంగా దృష్టిసారించారు. గత నెల తొలి వారంలో దీనికి సంబంధించి ఏయూ సీడీసీ డీన్ కార్యాలయం నుంచి కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. 2022-23 విద్యా సంవత్సరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లతో డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సంబంధించి ఈక్వెలెన్స్, జెన్యూనిటీ సర్టిఫికెట్లను సమర్పించాలంటూ వర్సిటీ పరిధిలోని 190 డిగ్రీ కాలేజీలకు సర్క్యులర్ జారీచేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లతో డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లను గత నెల 20వ తేదీలోగా తమకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఇప్పటివరకూ వాటిని ఆయా కాలేజీలు అందజేసిన దాఖలాలు లేవు. మరోవైపు సీడీసీ కార్యాలయ అధికారులు కూడా ఆ విషయం గురించి పట్టించుకోలేదు. ఆయా కాలేజీల నుంచి ఎంతమంది విద్యార్థులకు సంబంధించిన సమాచారం వచ్చిందన్నది కూడా ఇక్కడి అధికారులకు తెలియడం లేదంటే ఇచ్చిన ఉత్తర్వులు అమలును ఏ స్థాయిలో పర్యవేక్షిస్తున్నదీ ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అడ్డుకట్టే పడే చాన్స్.?
ఈక్వెలెన్స్, జెన్యూనిటీ సర్టిఫికెట్లను సమర్పించాలని కోరిన ఏయూ అధికారులు 2022-23 విద్యా సంవత్సరానికి మాత్రమే పరిమితం కావడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ తరువాత విద్యా సంవత్సరాల్లో చేరిన విద్యార్థులను పట్టించుకోలేదు. పోనీ, ఇచ్చిన ఆదేశాలను పకడ్బందీగా అమలుచేసి ఉంటే ప్రస్తుతం జరుగుతున్న డిగ్రీ ప్రవేశాల్లో ఈ తరహా అడ్డగోలు వ్యవహారాలను కట్టడి చేసేందుకు అవకాశం ఉండేదని పలువురు పేర్కొంటున్నారు. ఏయూ అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల కొన్ని కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో కూడా ఈ తరహా ప్రవేశాలు కల్పిస్తున్నాయంటున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా దృష్టిసారించి వీటికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.