Share News

బీఎన్‌ రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:54 AM

నియోజకవర్గంలో ప్రధానమైన బీఎన్‌ రహదారి దుస్థితిపై స్థానిక న్యాయవాదులు దాఖలు చేసిన కోర్టు కేసులో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్‌ అండ్‌బీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని నవంబరు 15న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి హరినారాయణ శనివారం నోటీసులు జారీ చేశారు. బీఎన్‌ రోడ్డు పనుల్లో అధికారులతో పాటు కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వలన సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులపై స్థానిక బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు కాండ్రేగుల డేవిడ్‌, భరత్‌భూషణ్‌, తదితరులు ఈ ఏడాది జూలై నెలలో దాఖలు చేసిన కేసులో జిల్లా కలెక్టర్‌ సహా ఆర్‌అండ్‌బీ అధికారులు కోర్టు ఎదుట హాజరుకావాలని జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

బీఎన్‌ రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం
కోర్టు విచారణకు హాజరైన ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు న్యాయవాదులతో మాట్లాడుతున్న దృశ్యం

- రాష్ట్ర ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి కోర్టు నోటీసులు

- నవంబరు 15న వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశం

- వర్షాలు తగ్గిన తరువాత గోతుల పూడ్చివేత పనులు చేపడతామన్న కాంట్రాక్టర్‌

- రోడ్డు పనులు పూర్తి చేస్తామని మరోసారి హామీ ఇచ్చిన ఆర్‌అండ్‌బీ అధికారులు

చోడవరం, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ప్రధానమైన బీఎన్‌ రహదారి దుస్థితిపై స్థానిక న్యాయవాదులు దాఖలు చేసిన కోర్టు కేసులో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్‌ అండ్‌బీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీని నవంబరు 15న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి హరినారాయణ శనివారం నోటీసులు జారీ చేశారు. బీఎన్‌ రోడ్డు పనుల్లో అధికారులతో పాటు కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వలన సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులపై స్థానిక బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు కాండ్రేగుల డేవిడ్‌, భరత్‌భూషణ్‌, తదితరులు ఈ ఏడాది జూలై నెలలో దాఖలు చేసిన కేసులో జిల్లా కలెక్టర్‌ సహా ఆర్‌అండ్‌బీ అధికారులు కోర్టు ఎదుట హాజరుకావాలని జిల్లా జడ్జి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోర్టు ఎదుట హాజరైన ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు రోడ్డు పనుల్లో జాప్యానికి కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే కారణమని, దీనిని న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నిధులతో చేపట్టినందున ఇది తమ పరిధి కాదని జడ్జికి విన్నవించడంతో, సంబంధిత కాంట్రాక్టర్‌తో పాటు ఆర్‌అండ్‌బీ ఎన్‌డీబీ పనులు పర్యవేక్షించే చీఫ్‌ ఇంజనీర్‌ను ఆగస్టు 20న కోర్టు ఎదుట హాజరుకావాలని జిల్లా జడ్జి నోటీసులు చేశారు. గత నెల 20న సంబంధిత కాంట్రాక్టర్‌ ప్రతినిధితో పాటు ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ తరఫున ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు స్థానిక జిల్లా జడ్జి ఎదుట హాజరై, నెల రోజుల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తామని లిఖితపూర్వకంగా అంగీకరించారు. దీనిపై జిల్లా జడ్జి అధికారులతో పాటు కాంట్రాక్టర్‌ తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసి, గడువులోగా రోడ్డు పనులు పూర్తి చేయకుంటే కేసును హైకోర్టుకు రిఫర్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ కేసును ఈ నెల 20కి వాయిదా వేశారు. అయితే ఆ రోజు జరగవలసిన విచారణ శనివారానికి వాయిదా పడడంతో, శనివారం ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్‌ సుధాకర్‌తో పాటు ఈఈ సాంబశివరావు, కాంట్రాక్టర్‌ తరఫున ప్రతినిధి జడ్జి ఎదుట హాజరయ్యారు. రోడ్డులో కొంత మేర గుంతలు కప్పామని, వర్షాలు తగ్గిన తరువాత పనులు చేపడతామని చెప్పడంతో కేసు వేసిన న్యాయవాదులు కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తూ, గోతులు ఎక్కడా కప్పలేదని, మూడుసార్లు విచారణకు హాజరై కూడా కనీసం పనులు చేపట్టడం లేదని జడ్జి దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే ఎన్‌డీబీ పనులు ఒకే ప్యాకేజీ కింద ఇవ్వడం వల్ల ఈ రోడ్డులో కనీసం మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన గ్రాంటు కూడా విడుదల చేసే పరిస్థితి కూడా లేకపోయిందని జడ్జికి న్యాయవాదులు వివరించారు. ఈ పనులు పూర్తిపై జిల్లా ఆర్‌అండ్‌బీ అధికారుల స్థాయిలో నిర్ణయాలు తీసుకునే స్థాయి లేదని ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే తప్పా, బీఎన్‌ రోడ్డు సమస్య ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని న్యాయవాదులు వివరించారు. దీనిపై స్పందించిన జిల్లా జడ్జి హరినారాయణ నవంబరు 15న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో రోడ్డులో పనులు అత్యవసర ప్రాతిపదికన గుంతలు కప్పే పనిని చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని ఆదేశించారు.

రాష్ట్ర ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చాలని కోరాం

బీఎన్‌ రోడ్డులో కాంట్రాక్టర్‌ కేవలం కంటితుడుపు పనులు చేపట్టారని, రోడ్డు పనులు చేపట్టే విషయంలో కాంట్రాక్టర్‌ మీనమేషాలు లెక్కిస్తున్నారని, ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లామని చోడవరం బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్‌ విలేకరులకు తెలిపారు. ఈ రోడ్డు పనులు పూర్తిస్థాయిలో అయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అందువల్లే ఈ కేసులో రాష్ట్ర ఉన్నతాధికారులను ప్రతివాదులుగా చేర్చాలని జడ్జిని అభ్యర్థించామని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో పాటు ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ సెక్రెటరీని కూడా వ్యక్తిగతంగా హాజరుకావాలని జడ్జి ఆదేశించడం ఆనందంగా ఉందన్నారు. ఉన్నతాఽధికారులకు నోటీసులు జారీ అయినందున న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని, ఇదే సమయంలో విజయరామరాజుపేట కాజ్‌వే పునరుద్ధరణ అంశాన్ని కూడా జడ్జి ముందు ఉంచామని తెలిపారు. కాజ్‌వే త్వరగా పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు అంగీకరించారన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే రోడ్డు పనులు చేపడతామని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ హామీ ఇచ్చినందున. నవంబరు 15 వరకు వేచి చూస్తామని, అప్పటికీ పనుల్లో పురోగతి కనిపించకపోతే హైకోర్టును కూడా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.

Updated Date - Sep 28 , 2025 | 12:54 AM