ఉద్యానంపై నిర్లక్ష్యం!
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:00 AM
ఉద్యాన పంటల సాగును ప్రోత్సాహించేందుకు ఏర్పాటు చేసిన ఉద్యాన శాఖ నర్సరీలు, శిక్షణ కేంద్రాలు నిర్లక్ష్యం నీడలో కునారిల్లుతున్నాయి. జిల్లాలో మూడు శిక్షణ కేంద్రాలు వుండగా ఆరేళ్ల నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో రెండు కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో ఉద్యాన పంటలను సాగు చేసే రైతులకు అవసరమైన మొక్కలు, ఆధునిక శిక్షణ కార్యక్రమాలు అందడంలేదు.
కళ తప్పిన నర్సరీలు, శిక్షణ కేంద్రాలు
ఒక్క ఏడాది కూడా నిర్వహణ నిధులివ్వని గత ప్రభుత్వం
కుంచంగి, వైఎన్‌పాలెంలో నిలిచిన మొక్కల పెంపకం, శిక్షణ కార్యక్రమాలు
రైతులకు అందని మొక్కలు, విత్తనాలు
కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలని రైతుల వినతి
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ఉద్యాన పంటల సాగును ప్రోత్సాహించేందుకు ఏర్పాటు చేసిన ఉద్యాన శాఖ నర్సరీలు, శిక్షణ కేంద్రాలు నిర్లక్ష్యం నీడలో కునారిల్లుతున్నాయి. జిల్లాలో మూడు శిక్షణ కేంద్రాలు వుండగా ఆరేళ్ల నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో రెండు కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో ఉద్యాన పంటలను సాగు చేసే రైతులకు అవసరమైన మొక్కలు, ఆధునిక శిక్షణ కార్యక్రమాలు అందడంలేదు.
పూలు, కూరగాయలు, పండ్ల తోటలు వంటి ఉద్యాన పంటల సాగుకు ఆసక్తి చూపే రైతులకు ఆయా పంటల సాగుపై శిక్షణ ఇవ్వడమే కాకుండా నర్సరీల నిర్వహణ ద్వారా రైతులకు తక్కువ ధరకు మొక్కలు అందించడానికి ప్రభుత్వం ఉద్యాన శిక్షణ కేంద్రాలు, నర్సరీలను ఏర్పాటు చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు 2014 నుంచి 2018వ సంవత్సరం వరకు ఉద్యాన కేంద్రాల్లో నర్సరీల పెంపకం, రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఏటా వీటి నిర్వహణకు నిధులు మంజూరు చేసి, రైతులకు మేలు రకం వంగడాలు, మొక్కలను పంపిణీ చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఉద్యాన కేంద్రాల నిర్వహణను గాలికొదిలేసింది. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క ఏడాది కూడా ఉద్యాన కేంద్రాల నిర్వహణకు రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో ఆయా కేంద్రాలు నిర్వీర్యం అయ్యాయి.
అనకాపల్లి పట్టణంలో ఎనిమిది ఎకరాల్లో, అనకాపల్లి మండలం కుంచంగిలో 14 ఎకరాల్లో, సబ్బవరం మండలం వైఎన్‌పాలెంలో 16 ఎకరాల్లో ఉద్యాన శిక్షణ క్షేత్రాలు ఉన్నాయి. నిర్వహణ కోసం కొన్నేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో కుంచంగి, వైఎన్ పాలెంలలో క్షేత్రాలు కళ తప్పాయి. అనకాపల్లి పట్టణంలోని కేంద్రంలో ఒక ప్రైవేటు వ్యక్తి మొక్కల పెంపకం చేపట్టారు. కుంచంగి, వైఎన్ పాలెంలో రైతులకు శిక్షణ సంగతి అటుంచి.. కనీసం నర్సరీలను కూడా నిర్వహించడలేదు. వాస్తవానికి ఈ కేంద్రాల్లో అధిక దిగుబడి ఇచ్చే పండ్ల మొక్కలు, కూరగాయ విత్తనాలు, పూల తోటలకు నారును పెంచి రైతులకు అందజేయాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వాలి. కానీ ఐదారేళ్ల నుంచి ఈ కార్యక్రమాలు ఏవీ జరగకపోవడంతో ఉద్యాన పంటలను సాగు చేసే రైతులు ప్రైవేటు నర్సరీలు, వ్యాపారుల నుంచి అధిక ధరలకు పండ్ల మొక్కలు, కూరగాయలు, పూల పంటల నారును కొనుగోలు చేయాల్సి వస్తున్నది.
కుంచంగి ఉద్యాన శిక్షణ కేంద్రంలో భవనాల చుట్టూ తుప్పలు పెరిగిపోయాయి. పైకప్పు రేకులు దొంగలపాలయ్యాయి. ఇక్కడ సుమారు ఏడు ఎకరాల్లో కొబ్బరి, ఐదు ఎకరాల్లో జీడిమామిడి, రెండు ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నట్టు ఉద్యాన శాఖ రికార్డుల్లో వుంది. కానీ నిర్వహణ కొరవడడంతో కొబ్బరి, జీడిమామిడి చెట్లలో చాలా వరకు నేలకొరిగాయి. వైఎన్ పాలెంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఉద్యాన శాఖాధికారులు కుంచంగి, వైఎన్ పాలెం కేంద్రాలలో కొబ్బరి దిగుబడులను విక్రయించి, వచ్చిన డబ్బులను వాచ్‌మన్లకు జీతాలు చెల్లిస్తున్నారు.
ప్రభుత్వంపై ఆశలు...
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగా రైతులకు శిక్షణ శిబిరాలు, తక్కువ ధరకు మొక్కలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. మేరకు జిల్లా అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కుంచంగి, వైఎన్ పాలెం ఉద్యాన కేంద్రాలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు జిల్లా ఉద్యాన శాఖాధికారులు చర్యలుచేపట్టారు. ఈ కేంద్రాల్లో నీటి సదుపాయం పనులకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు జిల్లా ఉద్యాన శాఖాధికారి శిరీషా ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. అదే విధంగా రైతులకు లాభదాయకంగా ఉండే ఉద్యాన పంటల నర్సరీల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేంచినట్టు చెప్పారు. ఆమోదం లభించగానే కుంచంగి, వైఎన్ పాలెం ఉద్యాన కేంద్రాల్లో రైతు శిక్షణ శిబిరాలతోపాటు నర్సరీల పెంపకం చేపడతామని ఆమె తెలిపారు.