చదువుపై నిర్లక్ష్యమా!?
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:54 AM
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పలువురు విద్యార్థులు.. ప్రధానంగా బాలుర ప్రవర్తన సరిగ్గాలేదని, భావి భారత పౌరులైన వీరిని సన్మార్గంలో పెట్టాల్సి బాధ్యత విద్యా శాఖపై వుందని జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన స్థాయీ సంఘ సమావేశాలకు అధ్యక్షత వహించిన ఆమె విద్యా శాఖపై జరిగిన చర్చలో మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కొంతమంది విద్యార్థుల తీరుపై చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆవేదన
తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని సూచన
జడ్పీ సమావేశాలకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
పీఏసీఎస్‌లలో రుణాల మంజూరులో జాప్యం
ముగనపాక జడ్పీటీసీ సభ్యుడు ఆరోపణ
విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పలువురు విద్యార్థులు.. ప్రధానంగా బాలుర ప్రవర్తన సరిగ్గాలేదని, భావి భారత పౌరులైన వీరిని సన్మార్గంలో పెట్టాల్సి బాధ్యత విద్యా శాఖపై వుందని జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన స్థాయీ సంఘ సమావేశాలకు అధ్యక్షత వహించిన ఆమె విద్యా శాఖపై జరిగిన చర్చలో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఉన్నత పాఠశాలలను సందర్శించానని, బాలురు వేషధారణ, ప్రవర్తన సరిగా లేవని, చదువు పట్ల నిర్లక్ష్యధోరణి కనిపించిందన్నారు. బాలికలు ముస్తాబై క్రమశిక్షణతో పాఠశాలలకు వస్తున్నారని, ఇందుకు విరుద్ధంగా బాలుర ప్రవర్తన ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా కారణమని ఆమె వ్యాఖ్యానించారు. మెగా పేరెంట్ సమావేశాలకే వచ్చే తల్లిదండ్రులతో మాట్లాడి , పిల్లల క్రమశిక్షణ గురించి గట్టిగా చెప్పాలని, తద్వారా వారికి మంచి భవిష్యతు ఇవ్వాలని ఆమె సూచించారు. సమగ్ర శిక్ష విశాఖ జిల్లా అదనపు కో-ఆర్డినేటర్ చంద్రశేఖరరావు బదులిస్తూ.. విద్యార్థుల ప్రతిభ, ప్రవర్తన గురించి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు చెబుతున్నామని, క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండాలని హెచ్‌ఎంలను ఆదేశిస్తామన్నారు. దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం మాట్లాడుతూ, తాను కేజీబీవీలో తనిఖీకి వెళితే.. సంబంధించి ప్రిన్సిపాల్‌ను దేవరాపల్లి ఎంఈవో వివరణ కోరడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయవచ్చని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని అన్నారు. దీనిపై విచారణ చేస్తామని అనకాపల్లి జిల్లా విద్యా శాఖాధికారికార్యాలయ అఽధికారి ఒకరు హామీ ఇచ్చారు.
పీఏసీఎస్‌ల నుంచి రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, అదే వాణిజ్య బ్యాంకుల్లో అయితే ఒకటి, రెండు రోజుల్లోనే రుణం ఇస్తున్నారని మునగపాక జడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ చెప్పారు. డీసీసీబీ సీఈవో డీవీఎస్ వర్మ వివరణ ఇస్తూ.. రీ-సర్వే అనంతరం కొన్ని గ్రామాల్లో రైతులకు ఈ-పాసుపుస్తకాలు జారీచేయకపోవడంతో రుణం మంజూరులో స్వల్ప జాప్యం జరుగుతున్నదన్నారు. అన్ని డాక్యుమెంట్లు ఉంటే మూడు రోజుల్లో రైతులకు రుణాలు అందిస్తామన్నారు. డి.పట్టా భూములకు కూడా పంట రుణాలు ఇస్తామని పేర్కొన్నారు.
హౌసింగ్ శాఖపై జరిగిన చర్చలో గొలుగొండ జడ్పీటీసీ సభ్యుడు సుర్ల వెంకట గిరిబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకు ఇచ్చిన పట్టాలను కొందరు అఽధికారులు పెండింగ్‌లో పెడుతున్నారని, కొత్తగా ఇళ్ల మంజూరుకు ఏ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారో చెప్పాలని కోరారు. సంబంధిత అధికారి బదులిస్తూ.. దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. చైర్‌పర్సన్ సుభద్ర జోక్యం చేసుకుంటూ.. అర్హులకు ఇళ్లు మంజూరుయాలని ఆదేశించారు. జడ్పీలో జరిగే ఏ సమావేశాలకు అయినా జిల్లాస్థాయి అధికారులు తప్పకుండా హాజరుకావాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. కేజీహెచ్‌లో సోలార్ సదుపాయం ఏర్పాటుచేయాలని, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని కె.కోటపాడు, దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యులు అనురాధ, సత్యం కోరారు. స్థాయీ సంఘ సమావేశాల్లో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పలువురు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
జడ్పీ బడ్జెట్ రూ.1,631.96 కోట్లు
స్థాయీ సంఘ సమావేశంలో ఆమోదం
విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘ సమావేశం ఈ ఆర్థిక (2025-26) సంవత్సరం సవరణ బడ్జెట్‌ను, 2026-27 సంవత్సరం అంచనా బడ్జెట్‌ను ఆమోదించింది. చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శుక్రవారం జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో సవరించిన బడ్జెట్‌ను, అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జడ్పీ సాధారణ సమావేశంలో చర్చించే ముందు బడ్జెట్‌ను స్థాయీ సంఘ సమావేశంలో ప్రవేశపెడతారు. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2026-27లో రూ.1631.96 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాతో బడ్జెట్ రూపొందించారు. జడ్పీకి సొంతంగా రూ.24.34 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.20 కోట్లు, ఇంకా ఇతర శాఖలు ప్రధానంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖల నుంచి రూ.1587.61 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. దీని నుంచి రూ.1612.96 కోట్లు వ్యయం అవుతుందని బడ్జెట్‌లో పొందుపరిచారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాలకు సంబంధించి గత ఏడాది రూపొందించిన లెక్కలను స్వల్పంగా సవరించారు. దీని ప్రకారం ఆదాయం రూ.1,626.92 కోట్లు, ఖర్చు రూ.1601.54 కోట్లుగా చూపించారు.